magaజి. వెంకటరామారావు

భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అంతవరకూ దేశాధినేతగా ఉన్న గవర్నరు జనరల్‌ పదవి రద్దయింది. ఆ స్థానంలో రాష్ట్రపతి పదవి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాదివారు ప్రధానిగా ఉంటే దక్షిణాదివారు రాష్ట్రపతిగా, దక్షిణాదివారు ప్రధానిగా ఉంటే ఉత్తరాది వారు రాష్ట్రపతిగా ఉండాలన్న అభిప్రాయంతో మొదటి రాష్ట్రపతి పదవికి రాజాజీ పేరుని, రెండవ రాష్ట్రపతి పదవికి డాక్టర్‌ ఎస్‌. రాధాకృష్ణన్‌ పేరును ప్రధాని నెహ్రూ సూచించారు కానీ, ఈ రెండుసార్లు కాంగ్రెస్‌ హైకమాండ్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పేరునే ప్రతిపాదించింది. రాష్ట్రపతి ఎన్నికకుముందు రాజేంద్రప్రసాద్‌ రాజ్యాంగ సభ అధ్యక్షులుగా ఉండేవారు.

డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌: పన్నెండు సంవత్సరాలు రాష్ట్రపతిగా పనిచేసిన గౌరవం ఒక్క డా. రాజేంద్రప్రసాద్‌కే దక్కింది. ఈ సుదీర్ఘకాలంలో రాష్ట్రపతి ప్రసాద్‌, ప్రధాని నెహ్రూ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. తన మతంపట్ల రాజేంద్రప్రసాద్‌కు విశ్వాసం ఉండేది. ఆ విశ్వాసంతోనే ఆయన వారణాసిలో సాధు పుంగవులకు పాదాభివందనం చేశారు. పూరీ పుణ్యక్షేత్రంలో పరమశివుని విగ్రహావిష్కరణ మహోత్సవంలో సర్ధార్‌ పటేల్‌తోపాటు పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాష్ట్రపతి చేసిన ఉపన్యాసం ప్రసారం కాకుండా నెహ్రూ తగు చర్యలు తీసుకున్నారు.

త్వరపడి దూరదృష్టి లేకుండా క్లిష్టమైన ఆర్థిక, సాంఘిక శాసనాలను చేసినప్పుడు ప్రజలు పెక్కు రకాలుగా కష్టనష్టాలు అనుభవించగలరని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ నిరంతరం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉండేవారు. అభ్యుదయమనేది క్రమంగా సాధించాలని, అందుకోసం అన్నిరకాల ప్రజల స్వచ్ఛంద సహకారం పొందాలని ఆయన అభిలషించేవారు. 1951లో హిందూకోడ్‌ బిల్లు విషయంలో ప్రధానితో రాష్ట్రపతి విభేదించారు. ప్రభుత్వ నిర్ణయాలను సవాల్‌ చేసే అధికారం రాష్ట్రపతికి ఎవరిచ్చారని నెహ్రూ మండిపడ్డారు. రాష్ట్రపతి అంత నిస్సహాయుడేమీ కాదని, ప్రభుత్వానికి, పార్లమెంటుకు కూడా కొన్ని పరిమితులున్నాయని ప్రసాద్‌ గట్టిగా సమాధానమిచ్చారు. అవసరమనుకుంటే ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు కూడా పంపించాలని రాష్ట్రపతి ప్రసాద్‌ సూచించారు. పన్నెండేళ్లు బాధ్యతగల పదవిలో ఎంతో హుందాగా డా. రాజేంద్ర ప్రసాద్‌ ప్రవర్తించారు. భారత రాజ్యాంగ సూత్రాలు, ఆశయాలను కాదని ఆయన వ్యవహరించిన సందర్భం ఒక్కటైనా లేదు. అందుకు ఆయన సౌజన్యమే కారణం.

సంక్షోభ సమయంలో పరిమిత కాలానికి కేంద్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న సూచన భారత రాజ్యాంగ నిర్ణయ సభలో చర్చకు వచ్చింది. నాడు ప్రధాన మంత్రిగా ఉన్న నెహ్రూ ఈ సూచనను వ్యతిరేకించారు. రాష్ట్రపతి పాలనకు కేంద్రంలో అవకాశం కల్పించినట్లయితే, అత్యాశపరుడైన రాష్ట్రపతి దానిని దుర్వినియోగపరచి నియంతగా మారవచ్చునని జవహర్‌లాల్‌ నెహ్రూ వాదించారు. 74వ ఆర్టికల్‌ సూచనలో స్పష్టంగా రూపొందించారు. ‘రాష్ట్రపతికి ఆయన విధుల నిర్వహణలో సహాయ పడడానికి, సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి నాయకత్వంలో ఒక మంత్రిమండలి ఉండాలి’ అని ఉంది.

భారత విధానంలో అధ్యక్షుడు (రాష్ట్రపతి) ఉన్నా అతని అధికారం నామమాత్రమే. కార్యనిర్వహణాధికారమంతా ప్రధానమంత్రి వశంలో, క్యాబినెట్‌ వశంలో ఉంటుంది. ప్రధానమంత్రి, మంత్రుల సభ పార్లమెంటుకు బాధ్యత వహించవలసి ఉంటుంది. పార్లమెంటు విశ్వాసం కోల్పోయినప్పుడు మంత్రులు అధికారంలో ఉండటానికి వీలులేదు. మన ప్రధానమంత్రి లోక్‌సభను రద్దుచేసి కొత్త సభను ప్రజలు ఎన్నుకోనున్నట్లు రాష్ట్రపతికి సలహా ఇవ్వవచ్చు. మన విధానంలో మంత్రుల సభ లోక్‌సభ పరస్పరాశ్రయ సంబంధం కలవి.

డా|| రాజేంద్రప్రసాద్‌ అనంతరం ఉప రాష్ట్ర పతి డా|| ఎస్‌. రాధా కృష్ణన్‌ 1962లో భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయ్యారు. నెహ్రూ ఔన్నత్యం వృద్ధాప్యంవల్ల కొంత, చైనా దాడివల్ల కొంత తగ్గుముఖం పడుతున్న సమయమది. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరివల్లనే ఈ యుద్ధంలో భారతదేశం ఓడిపోవలసి వచ్చిందని రాష్ట్రపతి విమర్శించారు. రక్షణమంత్రి కృష్ణమీనన్‌కు ఉద్వాసన చెప్పే వరకు రాధాకృష్ణన్‌ విడిచి పెట్టలేదు. ప్రధాని ఇందిరాగాంధీతో రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. దేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేవీ కూడా డా. రాధాకృష్ణన్‌తో ఇందిరాగాంధీ చర్చించలేదు. రూపాయి మారకం విలువను తగ్గించుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయనకు ముందుగా తెలియజేయలేదు. షేక్‌ అబ్దుల్లాకు అనవసరమైన ప్రాముఖ్యమిచ్చి కశ్మీర్‌ సమస్యను నెహ్రూ సాగదీస్తున్నారని డా. రాధాకృష్ణన్‌ అభిప్రాయపడేవారు. కామ్‌రాజ్‌ మొదలైన పెద్దలు రాధాకృష్ణన్‌ను రెండవసారి రాష్ట్రపతి పదవికి పోటీ చేయమని కోరినా ఇందిరాగాంధీ నుంచి తగినంత ప్రోత్సాహం లేనందున ఆయన అందుకు యిష్టపడలేదు.

డా|| రాధాకృష్ణన్‌ తరువాత ఉప రాష్ట్రపతి డా|| జాకీర్‌హుస్సేన్‌ రాష్ట్రపతి అయ్యారు. ఆయన రెండేళ్లు మాత్రమే పదవిలో ఉండి గుండె జబ్బుతో మరణించారు. డా|| జాకీర్‌ హుస్సేన్‌ మరణంతో ఉప రాష్ట్రపతి వి.వి. గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను రాష్ట్రపతి చేయడం కాంగ్రెస్‌లోని పాతకాపులకి యిష్టంలేదు. రాజీ ప్రయత్నాలు విఫలంకాగా ఇందిరాగాంధీ గిరి చేత ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా ఇప్పించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేయించారు. పార్టీల సరిహద్దులని చెరిపివేస్తూ రాష్ట్రపతి పదవికి పూర్తిస్థాయిలో సైద్ధాంతిక ప్రాతిపదిక మీద జరిగిన పోటీ అది ఒక్కటే. కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థి సంజీవరెడ్డికి స్వల్ప ఓట్లతో ఓటమి లభించింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా కాక రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా మాత్రమే వి.వి.గిరి రాష్ట్రపతి పీఠమెక్కారు. ఇందిరాగాంధీ చలవతో రాష్ట్రపతి అయిన గిరి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడంగాని జాతి గర్వించదగ్గ నిర్ణయాలు గానీ ఏనాడూ తీసుకున్న దృష్టాంతాలు లేవు.

గిరి అనంతరం ఫక్రుద్దీన్‌ అలీ అహమద్‌ 1974లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఏ ప్రాతిపదికన చూసినప్పటికీ ఫక్రుద్దీన్‌ అలీ అహమద్‌, వి.వి.గిరి వంటివారిని స్ఫూర్తిమంతమైన రాష్ట్రపతులుగా అంగీకరించలేదు. ఇంది రాగాంధీ సర్కారు విధించిన అత్యయిక పరిస్థితి తీర్మానంపై మారు మాట్లాడకుండా తలవంచుకుని సంతకంచేసిన ఫక్రుద్దీన్‌ నిస్సత్తువని చాటుకున్నారు. ఫక్రుద్దీన్‌ అలీ అహమద్‌ చర్య అత్యున్నత పీఠం విలువను కోల్పోయేలా చేసింది.

1979 జూలైలో మొరార్జీ దేశాయ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయగానే రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి తన నిర్ణయాధికారాలను స్వేచ్ఛగా ఉపయోగించడం మొదలు పెట్టారు. మొరార్జీ ఆపద్ధర్మ ప్రధానిగా ఉండగా ఆయనను రేడియోలో జాతినుద్ధేశించి ప్రసంగించడానికి అనుమతిం చలేదు. మెజారిటీ నిరూపించుకోలేని చరణ్‌సింగ్‌ను 1980 ఎన్నికల వరకు ప్రధానిగా కొనసాగనిచ్చారు.

విదేశీ పర్యటన విషయంలో ఇందిరాగాంధీ, సంజీవరెడ్డిల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. బ్రిటిష్‌ రాకుమారుడు చార్లెస్‌ వివాహానికి ఆహ్వానం రావడంతో సంజీవరెడ్డి లండన్‌ ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే ఈ వివాహానికి తను వెళ్ళాలని ఇందిరాగాంధీ భావించారు. దౌత్య వ్యవహారాలకు సంబంధించినంతవరకు ఇద్దరూ కలిసి వెళ్ళటానికి వీలులేదు. ఈ పర్యటనకు ప్రభుత్వం తనని పంపించని పక్షంలో వ్యక్తిగత హోదాలోనైనా వెళ్ళడం ఖాయమని సంజీవరెడ్డి స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితులలో ఇందిరాగాంధీ తలవంచవలసి వచ్చింది. ప్రయాణాన్ని మానుకున్నారు.

ఇందిరాగాంధీ ఆశీస్సులతో రాష్ట్రపతి అయిన జైల్‌సింగ్‌ వివాదాస్పదుడై కొంతకాలం సంచలనం సృష్టించారు. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ పేరిట అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలోకి సైనికులను పంపాలన్న ఇందిరాగాంధీ నిర్ణయాన్ని రాష్ట్రపతిగా ఆమోదించడం జైల్‌సింగ్‌ చేసిన తప్పిదాలలో చాలా ప్రమాదకరమైనది. సిక్కుమతం, పంజాబ్‌ రాజకీయాలు క్షుణ్ణంగా తెలిసిన జ్ఞానీజీ సలహాని ఇందిరాగాంధీ పాటించలేదా అన్నది వేరే విషయం. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సిక్కుల మనసు విరిగిపోతుందని, అది ప్రమాదభూయిష్టమైన పరిణామాలకు దారితీస్తుందని ఆయన సలహాలు చెప్పిన దాఖలాలు లేవు. అత్యయిక పరిస్థితి ప్రకటించిన సమయంలో ఫక్రుద్దీన్‌ అలీ అహమద్‌ ఎంత దుర్భలంగా వ్యవహరించారో, ఆపరేషన్‌ బ్లూస్టార్‌ విషయంలో జ్ఞానీజీ అంతకన్నా పేలవంగా ప్రేక్షకపాత్ర పోషించారు. 1984లో జైల్‌సింగ్‌ మంత్రిగాకూడా లేని రాజీవ్‌ను ప్రధానిగా చేశారు. జైల్‌సింగ్‌, రాజీవ్‌గాంధీల మధ్య సయోధ్య కుదరలేదు. వీరిద్దరిమధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరిగి కొంతకాలం విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వకుండా రాజీవ్‌ సర్కారు రాష్ట్రపతిని సతాయించింది.

జైల్‌సింగ్‌ తర్వాత 1987లో ఆర్‌. వెంకట్రామన్‌ రాష్ట్రపతి అయ్యారు. ఇదివరకటి రాష్ట్రపతులతో పోలిస్తే వెంకట్రామన్‌పై వచ్చిన విమర్శలు తక్కువ. రాజ్యాంగబద్ధంగా, మిత్రభావంతో మెలిగిన రాష్ట్రపతిగా వెంకట్రామన్‌ను చెప్పుకుంటారు. ప్రభుత్వంనుంచి వివరణ పత్రాలను ఆయన కోరిన సందర్భం ఒక్కటీ లేదు. ఆయన హయాంలో వరుసగా ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. రెండుసార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగి, చివరకు ఏ పార్టీకి మెజారిటీరాని సంకట పరిస్థితి తలెత్తింది. హిందూత్వ నినాదం ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగసి, అయోధ్య సమస్యను ఒక జాతీయ అంశంగా మార్చింది. దేశ ప్రజలందరికీ ప్రియమైన ఒక నాయకుడు ఎన్నికల ప్రచార ముగింపు దశలో తీవ్రవాదుల దౌష్ట్యానికి నేలకొరిగిన విషాదఘట్టం జరిగింది ఈ రాష్ట్రపతి సమయంలోనే.

1990లో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తలెత్తిన దుస్సాధ్యమైన భారం ఆయన నెత్తిమీద పడింది. రాష్ట్రపతి దైనందిన కార్యకలాపాలలోకి ప్రతిరోజూ ఎన్నో సంక్షోభాలు, రాజకీయ, రాజ్యాంగ, అంతర్గత వ్యక్తిగత సమస్యలు చొచ్చుకువచ్చి ప్రధాని నివాసంకంటే కూడ రాష్ట్రపతి భవనే భారత రాజకీయ కార్యకలాపాలకు ప్రధాన స్థావరమయింది. అయితే, బీహారు గవర్నర్‌ యూనిస్‌ సలీమ్‌ను బర్తరఫ్‌చేసిన విధానం, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం బర్తరఫ్‌ రాష్ట్రపతిని విమర్శలపాలు చేసింది.

భారతదేశపు తొమ్మిదవ రాష్ట్రపతి డా|| శంకర్‌దయాళ్‌శర్మ 1992లో ఎన్నికయ్యారు. ఆయన మూడు రాష్ట్రాల గవర్నరుగా, పలుమార్లు కేంద్రమంత్రిగా, ఒకసారి ఉప రాష్ట్రపతిగా పలు పదవులు నిర్వహించారు. శర్మకు రాష్ట్రపతి అయ్యేవరకు స్వంత కారులేదు. పార్లమెంటు ఎంపీల మెటడోర్‌ వ్యాన్‌లలో వెళ్ళడం ఆయనకు నామోషీ అనిపించలేదు.

భారత రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌ అనవసరంగా చురుకుదనాన్ని ప్రదర్శించి ఉండకపోతే యుద్ధం తాకిడికి గురైన మన దేశం మరొకసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురయ్యేదికాదు. రాష్ట్రపతి భవన్‌ కనుక తన పని తను చూసుకుంటూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే, అటల్‌ బిహారీ వాజ్‌పేయి లోక్‌సభలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురయ్యేదికాదు. ఒక్క ఓటుతో ఓడిపోవడమన్నది జరిగి ఉండేది కాదు. విశ్వాస తీర్మానానికి బదులు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉంటే సమంజసంగా ఉండేది. ఓటింగ్‌ మరోలా జరిగి ఉండేది. దేశంలో సుస్థిర రాజ్యాంగపాలనకు పూచీ వహించవలసిన రాష్ట్రపతి నారాయణన్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం దేశాన్ని కొంతకాలం కుదిపివేసింది. అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణ దరిమిలా కొంత సంయమనం పాటించి అవిశ్వాస తీర్మానం తెచ్చే అవకాశం విపక్షాలకు వదిలేసి ఉంటే అంతటి సంకట పరిస్థితి ఉత్పన్నం కాకపోయేదేమో.

ఒక దశలో నారాయణన్‌ బ్రిటన్‌ పర్యటనకు వెళ్ళి నిర్దిష్ట కాలపరిమితి దాటిన తర్వాత కూడా అక్కడే ఉంటానని పట్టుబట్టి భారత ప్రభుత్వాన్ని యిబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టారు. ఆ ఖర్చు భారత ప్రభుత్వమే భరించవలసి వచ్చింది. ఆ అదనపు కాలానికిగాను ఒక దేశపు రాష్ట్రపతికి ఇవ్వాల్సిన అధికారిక మర్యాదలేవీ నారాయణన్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం ఇవ్వలేదు.

ఉప రాష్ట్రపతి కాకుండానే, రాజకీయ వాసనలు ఏ మాత్రంలేని రాజకీయవేత్తగా దేశ పదకొండవ రాష్ట్రపతిగా డా|| అబ్దుల్‌ కలాం 2002లో రాష్ట్రపతి భవన్‌లో కాలుపెట్టారు. రక్షణరంగంలో ఇండియాను దుర్భేద్యశక్తిగా నిలిపేందుకు తన జీవితాన్నే ధారపోసిన అనర్ఘరత్నం. సొంత సోదరులు, బంధువులు రాష్ట్రపతి భవన్‌కు వస్తే వారి భోజన ఖర్చులకు తన జీతం డబ్బులే వాడేవారు. రాష్ట్రపతి హోదాలో పొందిన బహుమతులను, జ్ఞాపికలను రాష్ట్రపతి భవన్‌లోనే ఉంచారు. ప్రజల రాష్ట్రపతిగానే పేరు తెచ్చుకున్నారు. తన ఐదేళ్ళ పదవీకాలంలో మొత్తం ఏడుసార్లే విదేశీ పర్యటనలకు వెళ్ళారు. కేవలం రెండంటే రెండు సూట్‌కేస్‌లతో ఆయన రాష్ట్రపతి భవన్‌ను వదిలారు.

ఏకాఎకి రాష్ట్రపతి పదవికి ఎగబాకేదాకా శ్రీమతి ప్రతిభా పాటిల్‌ రాజకీయ వేదికమీద లేనేలేరు. ఒక మహిళ కావడం, కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి సన్నిహితురాలు కావడం ఆమె అర్హతలు. విదేశీ పర్యటనల విషయంలోనైతే ప్రతిభాపాటిల్‌ చరిత్ర సృష్టించారు. మరే ఇతర రాష్ట్రపతి పర్యటించని స్థాయిలో 22 దేశాలను ఆమె సందర్శించారు. దేశ అత్యున్నత పీఠానికి గౌరవాన్ని, హుందాతనాన్ని కల్పించే చర్యలేవీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ తన పదవీకాలంలో ఒక్కటంటే ఒక్కటికూడా చేపట్టిన దాఖలాలు లేవు. రాష్ట్రపతిగా ఏ దశలోనూ ఆమె తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు.

తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో వివాదాలకు తావివ్వకుండా ఐదేళ్ళ పూర్తికాలం రాష్ట్రపతిగా గడిపిన గంభీరమూర్తి ప్రణబ్‌ముఖర్జీ. ఏ పదవిలో ఉన్నా తన పరిమితులు తెసుకున్న వ్యక్తి. మనదేశంలో అధ్యక్షుణ్ణి అదుపులో పెట్టడానికి ఏర్పాటైన బహుముఖ వ్యవస్థ ఉద్దేశ్యం. అతణ్ణి నిశ్శక్తుణ్ణి చేయడంకాదు. తనకు నియమించిన అధికార పరిధిలో తను వ్యవహరిస్తున్నంత వరకు అతణ్ణి ఎవరూ బాధించలేదు. తన యిష్టమైన పద్ధతిలో తను ఎంతవరకు పోగలడో తెలుసుకొని వ్యవహరించగలవాడే కృతార్థుడైన, సమర్థుడైన అధ్యక్షుడు. నీతి, స్వాతంత్య్రాదులు దాటనంతవరకే ఆ పదవి గొప్పతనం.

Other Updates