శ్రావణ అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజున పొలాల పండుగ చేసుకోవడం అనూచానంగా వస్తున్నది. వ్యవసాయ దారులు రైతు నేస్తాలని పిలువబడే తమ ఎడ్లకు పూజలు చేయడం ఇక్కడి ఆచారం.
వ్యవసాయదారులు తమ ఎడ్లను సొంత పిల్లలకంటే అధికంగా ప్రేమిస్తారు. అవి కూడా యజమాని పట్ల అంతే విశ్వాసంతో గొడ్డుచాకిరి చేస్తాయి. ఎద్దులేనిదే వ్యవసాయం లేదు. వ్యవసాయముంటేనే అన్నం దొరుకుతుందని భావించి ఎడ్ల రుణం తీర్చుకోవడం తమవల్ల కాదని సంవత్సరానికొకసారి ఎడ్ల పూజ చేసి వాటిపై తమకున్న మమకారాన్ని చాటుకుంటారు.
ఈ పండుగ మహారాష్ట్ర వారిది. తెలంగాణ ప్రాంతం మహారాష్ట్రను ఆనుకొని వున్నది కనుక ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలు మహారాష్ట్రలో వున్నట్లుగానే వుంటాయి. మంచి సంప్రదాయం ఎక్కడిదైతే ఏమిటి?
శ్రావణమాసం మొత్తం ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఆదిలాబాదులో నివసించిన మునిపంతులు అనే కవి ఆదిలాబాదు యాసలో భారతం రచించినాడు. ఈ భారతాన్ని శ్రావణమాసంలో భక్తి శ్రద్ధలతో పారాయణం చేయడం సంప్రదాయంగా మారింది. అంతేగాక శ్రావణమాసంలోని శని, సోమవారాలు ఉపవాసదీక్ష చేసేవారు. 1960 నుంచి 70 మధ్య కాలంలో శ్రావణమాసం శని, సోమవారాల్లో ఒంటిపూట బడులు వుండేవి కనుక ఆ సంప్రదాయం ఎంత గొప్పగా వుండేదో అర్థం చేసుకోవచ్చు.
ఈ మధ్య ఆంధ్రుల సహవాసంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారు. ఒకప్పుడీ సంప్రదాయం లేదు. ఏదైనా మంచి సంప్రదాయాన్ని ఎక్కడినుంచయినా తీసుకోవచ్చు గదా! మహారాష్ట్రుల నుంచి సంక్రమించిన శ్రావణ మంగళవార వ్రతాలుండనే వున్నాయి.
శ్రావణమాసంలో క్షవరం పనులు చేసుకోకపోవడం, మత్స్య మాంసాలను నిషేధించుకోవడంవంటి ఆచారాలను పాటిస్తారు. శ్రావణమాసం పూర్తయి అమావాస్యనాడు పొలాల పండుగ జరుపుకొని ఆ మరుసటి రోజైన బొడుగ పండుగనాటి నుండి మాంసాహారం తినటం ప్రారంభిస్తారు. అయితే భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకపూజ వుంటుంది గనుక వినాయక నిమజ్జనం అయ్యే వరకు అంటే అనంత చతుర్దశివరకు మాంసాహారం ముట్టరు.
భాద్రపద అమావాస్య రోజు ఎడ్లపూజ ఇక్కడి ప్రత్యేకత. ఎడ్లంటే నందీశ్వరుని అవతారమని భావించే రైతులకు ఎడ్లమీద ప్రేమాభిమానాలుండడం ఆశ్చర్యం కాదు. కర్ణాటక రాష్ట్రానికి వెళ్లితే ఎక్కడైనా నందీశ్వరాలయాలు దర్శనమిస్తాయి. రాయలసీమలో మహానంది అనే పుణ్యక్షేత్రమే వున్నది. లేపాక్షినంది విశ్వవిఖ్యాతిగాంచింది.
నంది స్వయంగా శివుని వాహనం కనుక శివునికి ఏదైనా నివేదించు కోవాలంటే నందీశ్వరుని చెవిలో చెప్పుకుంటే చాలు అని మనవారి నమ్మకం. నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని దర్శించుకోవాలట. శివాలయంలో శివునికి ఎదురుగా కూర్చుని ఆ మహాదేవుని రూపాన్ని కండ్లలో నిలుపుకొని ఏకాగ్ర చిత్తంతో వుంటాడు నంది. శివుని మీద ఈగ వాలనివ్వడు. ఒకసారి రావణుడు శివపార్వతుల దర్శనంకోసం సరాసరి లోపలికి వచ్చేస్తాడు. నందీశ్వరుడు అడ్డగిస్తాడు. శివపార్వతులు ఏకాంతంలో వున్న సమ యంలో ఎవరినీ అనుమతించనంటాడు.
రావుణునికి కోపం వచ్చి నందీశ్వరున్ని వానర ముఖం వాడని నిందిస్తాడని, ఆ వానరంతోనే నీవు నశించిపోతావని నందీశ్వరుడు ప్రతిశాపం పెట్టినాడని పురాణాల్లో కనిపిస్తుంది. శివపార్వతులు నాట్యానికి అధిదేవతలు. శివుడు చేసేది తాండవమయితే అమ్మవారిది లాస్యం. శివుడు స్వయంగా నటరాజు కదా! శివుని తాండవానికి అనుగుణంగా నందీశ్వరుడు మృదంగం వాయిస్తాడట. అటువంటి నందీశ్వరున్ని పూజించుకునే చక్కటి సంప్రదాయం తెలంగాణలో వున్నది.
పొలాల అమావాస్యనాడు ఎడ్లకు పూర్తిగా విశ్రాంతినిస్తాడు రైతు. ఆనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నాగలికట్టడం, బండి కట్టడం వుండదు. ఎద్దు మూపుమీద కొండి వెయ్యరన్నమాట. ఎద్దునేకాదు ఎద్దు మీదుండే కాడి కూడా అంతే పవిత్రమైనదిగా భావిస్తారు. పెండ్లి పీటలకు బదులుగా కాడిని వుంచి పెండ్లి తంతు జరిపించడం సంప్రదాయం.
ఎద్దుకు పూర్తి విశ్రాంతి అంటే ఎడ్ల బరువులు దింపుడంటారు. నిజంగానే ఎద్దు వ్యవసాయదారుని పంట బరువునేగాక కుటుంబ భారాన్ని కూడా మోస్తుంది. ఒకప్పుడు ఆదిలాబాదు చుట్టుప్రక్కల నుంచి, మహారాష్ట్రానుంచి ఎడ్లబండ్ల మీద పత్తి నింపుకొని వరుసలు కట్టి వ్యవసాయదారులు మార్కెట్‌కు చేరుకునే దృశ్యం కన్నులపండువగా కనబడేది. ఇప్పుడా దృశ్యం కనుమరుగయింది. ట్రాక్టర్లమీద ఆటో ట్రాలీలమీద పత్తి వస్తున్నది. ఎండ్ల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడం కొంచెం బాధాకరమైన విషయమైనా సత్యమదే!
పొలాల అమావాస్యనాడు ఉదయం నాలుగు గంటలనుండే పండుగ హడావిడి ప్రారంభమవుతుంది. ఇల్లూ, వాకిలి ఊడ్చి అలుకు పూతతో మొదలై తీనెలుదీసి సున్నం బొట్లతోపాటు వాకిట్లో ముత్యాల ముగ్గులతో, బంతిపూలు, మామిడాకులతో దర్వాజాలు ముస్తాబవుతాయి. ఎడ్ల కొమ్ములకు రంగురంగుల వార్నీసులు పూసి వాటికి కాయితం పూలు లేదా దారాలతో తయారైన జూలతో అలంకరిస్తారు. ఎడ్ల వీపులమీద జూలు పరుస్తారు. వీటిని రకరకాల పువ్వులు, ఆకులు, పక్షుల బొమ్మలు కుట్టి దర్జీవాళ్లు ప్రత్యేకంగా తయారు చేస్తారు.
వ్యవసాయదారులు ఈ పండుగను తప్పనిసరిగా చేస్తారు. కానీ వ్యవసాయం లేని వాళ్లు కూడా ఈ పండుగ చేయడం విశేషం. ఆ రోజు ప్రత్యేకంగా తయారైన మట్టి ఎడ్లు, వాటితోపాటు పశువుల కాపరి బొమ్మలు అమ్మడానికి వస్తాయి. వాటిని పీటమీద వుంచి పూజిస్తారు. ఈ పూజ కూడా వినాయకుని పూజ వలెనే వుండటం గమనించవలసి విషయం. వినాయకుడు, నందీశ్వరుడు, శివ పంచాయతనంవారేనని గుర్తు చేయడమేమో!
మహారాష్ట్రాలో మట్టి ఎడ్లు కాకుండా కర్రతో తయారైన అందమైన ఎద్దు బొమ్మలకు పూజ చేస్తారు. వాటికి చక్రాలుంటాయి. ఆ చక్రాలతో చిన్నపిల్లలు వాటిని తీసుకొని వెళ్లి దేవాలయంలో ప్రదక్షిణ చేయిస్తారు. అంతేగాక మట్టి గురుగులు, మట్టి కుండల దొంతులు, మట్టి పిడతల ఆట వస్తువులు అన్నీ పూజలో వుంచుతారు.
పొలాలనాడు ఎడ్లకు పెట్టే నైవేద్యం కూడా ప్రత్యేకమైనదే. అప్పాలు, గారెలు, బూరెలు, పాయసం, నెయ్యి తప్పనిసరిగా వుంటాయి. ఈ నైవేద్యాన్ని గోధూళివేళ ఎడ్లు శివాలయం వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత సమర్పిస్తారు.
అలంకరించబడిన ఎడ్లు డప్పుల బాజాలతో శివాలయానికి లేదా ఆంజనేయస్వామి ఆలయానికి సాయంత్రంపూట బయలుదేరుతాయి. ఊరేగింపు అగ్రభాగాన ఆ గ్రామపెద్ద-దేశిపాండే లేదా దేశ్‌ముఖ్‌గానీ పెద్ద భూస్వామికి సంబంధించిన ఎడ్లు ముందు వరుసలో వుంటాయి. తోవకడ్డంగా మామిడాకుల తోరణం కట్టి వుంటుంది. దూరంనుంచే తమతమ ఎడ్లతో ఊరేగింపుగా వస్తున్న రైతులు తోరణం దగ్గరికి వచ్చే సరికి ఇనుమడించిన ఉత్సాహంతో ”హరహర మహాదేవ్’ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలిస్తూ, గ్రామ పెద్ద ఎడ్లతో వచ్చిన వారి పాలేరు ముల్లు గట్టితో ఆ తోరణాన్ని తెంపి ముందుకు సాగిపోతాడు. మిగతావాళ్లందరూ అతన్ని అనుసరిస్తారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత తమతమ ఇండ్లకు చేరుకుంటారు. అప్పటికి దీపాలుపెట్టే సమయమవుతుంది.
ఇంటిపెద్ద ముత్తయిదువ, ఆడపడుచులు మంగళహారతులతో ఎడ్లకు స్వాగతం పలుకుతారు. ఎడ్ల కాళ్లు కడిగి దీపధూపనై వేద్యాలతో పూజిస్తారు. యజమాని తన చేతులతో ఎడ్లకు ఆప్యాయంగా తినిపిస్తాడు. ఈ దృశ్యాన్ని చెప్పడం కాదు. చూసిన అనుభూతి వేరుగా వుంటుంది. చుట్టుపక్కల ఇండ్ల వాళ్లు, తమకు సొంత ఎడ్లులేనివాళ్లు, ఈ ఎడ్లకే పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. మట్టి ఎడ్లపూజ ఎట్లాగూ వున్నదే కానీ నిజమైన ఎడ్లకు పూజించి నైవేద్యం తినిపించడం అనే ఆచారం ఇక్కడివారికే ప్రత్యేకం. ఎడ్ల రుణం తీర్చుకోవడానికి ఇదొక చక్కని అవకాశం.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ఆచారమున్నది కానీ, అది శ్రావణమాసంలో కాకుండా జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమినాడు కాడెద్దులను అందంగా ముస్తాబు చేసి, ఊరేగింపుగా తిరిగివచ్చి దేవాలయం ప్రదక్షిణ చేయించి ఇంటికి తీసుకొనివచ్చి నైవేద్యాలు సమర్పిస్తారు. పొలాల అమావాస్యకువస్తే, ఏరువాక పున్నానికి వస్తుంది. రెండు పండుగల పరమార్థమొక్కటే కానీ సమయాలు వేరు.
పొలాల అమావాస్యను సోమవతి అమావాస్య అని కూడా అంటారు. సోమవంతుడు, సుమేధుడు అనే ఇద్దరు యువకులు సకల విద్యాపారంగతులైనారు. వారికి యుక్త వయస్సు వచ్చింది. కనుక వారి వివాహము చేయడానికి ధనము లేనందున వారి తల్లిదండ్రులు ౖ”మీరు విదర్భరాజు వద్దకు వెళ్లి మీ విద్యచేత వారిని మెప్పించి ధనం తీసుకొని వస్తే మీ వివాహం చేయగలమ”ని చెప్పి పంపినారట.
విదర్భరాణి సోమవారం సీమంతినీ వ్రతంచేస్తూ దంప తులకు ధనకనకాలతో వాయనాలిస్తున్నది. విదర్భరాజు ఈ యువకులను చూసి పరిహాసముతో మీరిద్దరూ దంపతులైతే మీకూ వాయినం దొరికేదని నవ్వులాటగా అంటాడు. సోమవంతుడు స్త్రీ వేషముతో సుమేధుడు పురుషవేషంతో దంపతులుగా నటించి వాయినం తీసుకొని వెళ్లిపోతారు. కానీ ఆ వ్రత మహిమవలన సోమవంతుడు స్త్రీగా మారిపోతాడు. ఈ వ్రతాన్నే సోమవతి వ్రతంగా పేర్కొంటారు.
సామల రాజవర్థన్