తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ హైకోర్టు ఆవిష్కతమైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తి అయింది. రాష్ట్ర అవతరణ నాటినుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఆటు న్యాయవాదులు ఉమ్మడి హైకోర్టును విభజించాలని అనేక ఆందోళనలు చేపట్టినా, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా, కేంద్ర ప్రభుత్వ సాచివేత ధోరణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ నిరాకరణతో ఉమ్మడి హైకోర్టు విభజనలో ఎంతో జాప్యం జరుగుతూ వచ్చింది. రాష్ట్రానికి సొంత హైకోర్టు కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన సంపూర్ణం కావడంతో ఈ రెండు రాష్ట్రాల హైకోర్టులు 2019 జనవరి 1 నుంచి స్వతంత్రంగా పనిచేస్తాయి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొట్టతిల్ బి. రాధాకష్ణన్‌ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా సి.ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ప్రధాన న్యాయమూర్తుల నియామకంతోపాటు ఉభయ రాష్ట్రాలకు న్యాయమూర్తులను, న్యాయాది óకారులను కూడా కేటాయించారు.
2019 జనవరి 1 నుంచి హైదరాబాద్‌లో ఉన్న న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా సేవలందిస్తుంది. ఈ హైకోర్టు భవనం తెలంగాణకే తలమానికం. మూసీనది తీరంలో, నయాపూల్ బ్రిడ్జి దగ్గరలో ఎరుపు, తెలుపు రాళ్ళతో నిర్మించిన ఈ ఎత్తైన భవనం ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలంలో ఈ భవన నిర్మాణం జరిగింది. 1915 ఏప్రిల్ 15న భవన నిర్మాణానికి శంకుస్థాపన జరుగగా 1919 మార్చి 31 నాటికి నిర్మాణం పూర్తయింది. 1920 ఏప్రిల్ 20న ఏడవ నిజాం ప్రభువు లాంఛనంగా ఆనాడు హైకోర్టును ప్రారంభించారు. 1956 నవంబరు ఒకటిన హైదరాబాద్ రాజధానిగా ఆంద్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఈ భవనంలోనే హైకోర్టు కొనసాగించారు. 1956 నవంబరు 5 నుంచి నూతన హైకోర్టు పనులు ప్రారంభించింది. 2005 నవంబరు నాటికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో స్వర్ణోత్సవాలను కూడా నిర్వహించారు.
ఎత్తైన, విశాలమైన కోర్టు గదులు, ఆవరణలో మహా వక్షాలతో ఉన్న ఈ హైకోర్టు భవనం సందర్శకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సుందర భవనంలో నూతన సంవత్సర వేళ తెలంగాణ హైకోర్టు ప్రారంభం కావడం మనందరికీ గర్వకారణం.