gurukulaluమైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ, కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సెప్టెంబరు 16న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ వ్యవహారాలు చూస్తున్న సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఎకె ఖాన్‌, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌ రావు, శాంతి కుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్‌తో పాటు పలు ఉన్నత విద్యా కోర్సులకు ఎంపికవుతున్నారన్నారు. ఆ పాఠశాలల నిర్వహణపై తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని, మైనారిటీ గురుకుల పాఠశాలలు కూడా అదే ప్రమాణాలతో నడవాలని సీఎం ఆకాంక్షించారు.

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 120 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను ప్రారంభించాలని, గతంలో నిర్ణయించామని, అందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 71 మైనారిటీ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అయితే ఈ విద్యాసంస్థల్లో చేరడానికి మైనారిటీలు ఎంతో ఆసక్తి చూపుతున్నందున వాటి సంఖ్యను పెంచాలని నిర్ణయించామన్నారు. మైనారిటీలకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం ద్వారా వారికి మంచి జీవితం అందించగలుగుతామనేది తనఉద్దేశ్యమని సీఎం అన్నారు. అందుకే రాష్ట్రంలో 160 మైనారిటీ విద్యా సంస్థలు ఉండాలని నిర్ణయించామన్నారు.

మొత్తం 160 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 55 వేల మందికి పైగా విద్యార్థులకు మంచి విద్య, భోజనం, వసతి కల్పించాలని చెప్పారు. ఈ విద్యాలయాలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నియమిస్తామని చెప్పారు. విద్యా సంస్థల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని, కావాల్సిన నిధులను బడ్జెట్లో పెడతామని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ ఏడాది మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన వ్యయాన్ని బడ్జెట్‌ లో తప్పక చేర్చాలని కూడా సీఎం ఆదేశించారు.

నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ పట్టణాల్లో ఆరు చొప్పున (మూడు బాలికలకు, మూడు బాలురకు) మైనారిటీ విద్యాసంస్థ లుండాలన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఖచ్చి తంగా ఉండాలని, ముస్లింలు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో రెండు, మూడు విద్యా సంస్థలు నెలకొల్పాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం 8 విద్యాసంస్థలున్నాయని, మరో 12 విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కూడా ఆదేశించారు. 5, 6, 7 తరగతుల్లో ప్రవేశం కల్పించి, ప్రతీ ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోవాలని సూచించారు. ముస్లింల జనాభాను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణంగా అదనపు విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముస్లిం పిల్లలు మంచి విద్యా వంతులు కావాలని, అందుకోసం ప్రభుత్వం అవసరమైన చేయూతను అందిస్తుందని పేర్కొన్నారు.

మొదటి ఏడాది ప్రారంభించిన మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణ బాగుందని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రభుత్వం నెలకొల్పిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. మైనారిటీ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు చూసి ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి అన్ని విద్యా సంస్థలకు సొంత భవనాలుండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మెడిసిన్లో 40 సీట్లు, బిడిఎస్‌ లో 20 సీట్లు సాధించడంతో పాటు ఉన్నత విద్యకోసం జరిగిన అనేక పోటీ పరీక్షల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్య, భోజనం, వసతి, శిక్షణ అందించడంలో అంకితభావంతో కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ను అభినందించారు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం తప్పక ఫలితం ఇస్తుందని నిరూపించారన్నారు.

ఈ ఏడాది ఎంసెట్లో ఎస్సీ గురుకులాలకు చెందిన 40 మంది విద్యార్థులు ఎంబిబిఎస్‌ లో, 20 మంది విద్యార్థులు బిడిఎస్‌ లో ప్రవేశం పొందే విధంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యాలయాల నుంచి నలుగురైదుగురికి మించి ఎంపికైన సందర్భాలు లేవు. ఇవే విద్యాసంస్థల నుంచి 25 మంది విద్యార్థులు సెంట్రల్‌ యూనివర్సిటీల్లో, ఆరుగురు టిఐఎస్‌ఎస్‌ లో, 11 మంది అజీంప్రేమ్‌ జీ సంస్థలో, 45 మంది ఐఐటిల్లో, నిట్‌లో, ఐదుగురు సిఎ కోర్సులో ప్రవేశం పొందారు. ఎస్టీలకు చెందిన విద్యార్థులు కూడా 9 మంది మెడిసిన్లో, నలుగురు బిడిఎస్‌లో, 50 మంది ఐఐటి, నిట్స్‌ లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందారు.

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇంత గొప్ప ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. విద్యార్థుల చదువు ప్రగతికి మార్గం వేస్తుందని నమ్మే ప్రభుత్వానికి ఈ పిల్లలు సాధించిన విజయం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల విద్యార్థులు సాధించిన విజయాలను చూసిన తర్వాతే మైనారిటీలకు కూడా పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సిఎం చెప్పారు. సమాజంలో అణగారిన వర్గాలకు మంచి విద్య అందించడానికి ప్రభుత్వం మరింత ఎక్కువ కార్యక్రమాలు చేపడుతుందని, ఈ విషయంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని సిఎం చెప్పారు. విద్యార్థులు సాధించిన విజయానికి తాను ఎంతో సంతోషపడుతున్నానని, విద్యా సంస్థలను అంకితభావంతో నడుపుతున్నారని ప్రవీణ్‌ కుమార్‌ కు ముఖ్యమంత్రి ఫోన్‌ చేసి అభినందించారు.

గురుకుల విద్యార్థుల చదువు పట్ల ముఖ్యమంత్రి చూపిస్తున్న శ్రద్ధ, ప్రోత్సాహం కారణంగానే ఈ విజయం సాధ్యమైందని ప్రవీణ్‌ కుమార్‌ ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి అందిస్తున్న స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామన్నారు.

ఎంసెట్‌లో ఎస్సీ గురుకులాలకు చెందిన 40 మంది విద్యార్థులు ఈ ఏడాది ఎంబిబిఎస్‌లో సీట్లు సాధించారు.

20 మంది విద్యార్థులు బిడిఎస్‌లో ప్రవేశం పొందే విధంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.

25 మంది విద్యార్థులు సెంట్రల్‌ యూనివర్సిటీల్లో, ఆరుగురు టిఐఎస్‌ఎస్‌లో, 11 మంది అజీంప్రేమ్‌జీ సంస్థలో, 45 మంది ఐఐటిల్లో, నిట్‌లో, ఐదుగురు సిఎ కోర్సులో ప్రవేశం పొందారు.

ఎస్టీలకు చెందిన విద్యార్థులు కూడా 9 మంది మెడిసిన్లో, నలుగురు బిడిఎస్‌లో, 50 మంది ఐఐటి, నిట్స్‌ లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందారు.

మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మతాల పేరిట ఎన్నడూ విడిపోలేదని, అంతా కలిసే పండుగలు చేసుకుంటారని సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రం గంగా జమునా తెహజీబ్‌ అనడానికి ఇటీవల జరిగిన వినాయక చవితి ఉత్సవాలు తాజా ఉదాహరణ అని ముఖ్యమంత్రి అన్నారు. బతుకమ్మ, దసరా, పీర్ల పండుగలను కలిసి చేసుకునే సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. జమ్మిచెట్టు దగ్గరికి, పాలపిట్టను చూడడానికి అందరూ కలిసే వెళతారని పేర్కొన్నారు. దర్గాల దగ్గరికి కూడా పెద్ద ఎత్తున జనం మతాలకు అతీతంగా వెళతారని, ప్రార్థనా మందిరాలను ప్రజలు, భక్తుల మాదిరిగానే సందర్శిస్తారు తప్ప మత ప్రాతిపదికన కాదని వెల్లడించారు. గణేష్‌ ఉత్సవాల సందర్భంగా కూడా లౌకిక స్ఫూర్తి కనిపించిందన్నారు. చాలా చోట్ల గణేష్‌ మండపాల వద్ద ముస్లింలు పూజలు చేశారని, ఉత్సవాల్లో పాల్గొన్నారని, లడ్డూ వేలంలో పాల్గొని దక్కించుకున్నారన్నారు. అలా కలిసి మెలిసి జీవిస్తున్న ప్రజలంతా బాగుండాలని, అన్ని వర్గాల భావితరాలు బాగుండడం కోసం కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పారు. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల మాదిరిగా మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు నెలకొల్పాలని నిర్ణయించినట్లు వెల్లడించారు

Other Updates