రంగ కృష్ణమాచార్యులు – జి. యాదగిరి

అగాధమైన జలనిధిలో ఆణిముత్యం, మట్టిలో మాణిక్యం బయటపడినప్పుడు గానీ సమాజంలో రాణించాలంటే ఆయనకు సంబంధించిన వర్గం, స్తోత్ర బృందం వగైరా సహకరించాల్సిందే. ఎల్లమ్మ రంగాపురంలాంటి కుగ్రామాల్లో ప్రతిభా పాండిత్యాలకు కొదవ లేని కవులెందరో ఉన్నారు. ప్రచారం లేకపోతే అనామకులౌతారు. తెలంగాణలోని అలాంటి అజ్ఞాత కవులనెందరినో అనేక వ్యయప్రయాసలకోర్చి ”గోలకొండ కవుల సంచిక”గా వెలుగులోనికి తెచ్చిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి సదా స్మరణీయులు, అనుసరనీయులు. మళ్ళీ నేడు అలాంటి ప్రయత్నం ‘స్వేచ్ఛా తెలంగాణ’లో జరుగవలసిన అగత్యం వుంది. జిజ్ఞాసువులు అన్వేషిస్తే తెలంగాణ పల్లెల్లో అశేష అముద్రిత గ్రంథ సంపద లభ్యం కాగలదు.

సరిగ్గా ఇలాంటి మరుగునపడిన కవే మరింగంటి కృష్ణమాచార్యులు. కృతులెన్ని రచించినా, ప్రతిభా పాటవాలెన్నున్నా వాటిని ముద్రించుకొని వెలుగులోనికి తెస్తేనే గదా వాటికి సార్ధకత! దైనికావసరాలకు సైతం ఇబ్బంది పడే మరింగంటి రంగ కృష్ణమాచార్యులు తాను రచించిన ఆరు పుస్తకాల్లో ఒక్కదాన్నయినా ప్రచురించుకో లేకపోయారు. తన అశక్తతకు బాధ పడేవాడు. ఐతే ఒక విషయంలో ఆయనను మనం ప్రశంసించాల్సిందే. తాను ఎలాగూ ప్రచురించుకోలేక పోయాననే నిరాశా నిస్పృహల్లో పడిపోయి రచనా వ్యాసంగం నుండి మాత్రం విరమించు కోలేదు. మరింగంటి వంశ కవుల్లో తమ ‘కృతులను ‘నరాంకితం’ చేయని సంప్రదాయాన్ని అసిధారావ్రతంగా ఆచరించడం వలన వారి రచనలు జనాదరణకు నోచుకోలేదు.

రంగాపురంలో ఉద్దండ సంస్కృత కవి, పండితుడయిన మరింగంటి జగన్నాథాచార్యుల నల్వురు కుమారుల్లో జ్యేష్ఠపుత్రుడైన రంగ కృష్ణమాచార్యులు 1908 సంవత్సరం, కీలక పిత్రమావాస్యనాడు జన్మించారు. బాల్యం నుండి తండ్రి వద్దనే సాంప్రదాయ విద్యాభ్యాసంలో సంస్కృతాంధ్రాలు అభ్యసించి, కవితా రచనలో తండ్రి మొప్పును పొందారు.

వీరి రచనలు :

1. శ్రీయాదగిరి లక్ష్మీ నృసింహ స్తోత్ర తారామాల

2. కృష్ణలీలా తరంగిణి నాటకము

3. మదన విజయము (హరికథ)

4. సౌగంధికా సంగ్రహం (యక్షగానం)

5. పాశుపతాస్త్రము (యక్షగానం)

6. భజన రత్నావళి – కీర్తనలు

ఇవన్నీ అముద్రితాలే. వీనిలో 3,5 సంఖ్య కృతులు లభించలేదు. కవి తన పరిచయంలో…

కం|| ఇలలోపల మఱిగంటన్‌

కుల మందుల రంగ కృష్ణ గురునామమునన్‌

వెలసితి రంగపురంబున

గల శ్రీహరి! నన్ను బ్రోవు కరుణాళుడవై.

అని చెప్పుకున్నాడు.

శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్తోత్ర తారామాలను ‘యాదగిరి వాసా భక్త చింతామణీ అనే మకుటంతో 14 శార్ధూల విక్రీడిత పద్యాలు. 14 మత్తేభ విక్రీడిత పద్యాలతో రంగకృష్ణమాచార్యులు 1950 పూర్వం రచించారు.

వీరు రచించిన ‘కృష్ణలీలా తరంగిణి’ రంగస్థల నాటకం పరిణత రచనా కౌశలం, శైలీ గలిగి వీరికి చిరకీర్తిని కలిగించేది. ఆయన స్వహస్తాలతో లిఖించిన ఈ పొత్తం వందపేజీలది. పాత్రోచిత సంభాషణా పాటవంతో వృత్త, జాతి,

ఉపజాతి ఛందస్సుల నుపయోగించిన పద్యాలతో, పఠితృ హృదయాహ్లాదిగా నాటకం ప్రదర్శిస్తే ప్రేక్షక జనరంజకంగా ఈ నాటకం రాజిల్ల గలదు. కంస వధ ఇందలి ప్రధాన ఇతి వృత్తం. ఇది అయిదు అంకాల నాటకం. 14 రంగాలున్నాయి. ఆయన శైలీ విన్నాణానికి మచ్చుకు ఒక పద్యం. ప్రాణ భయంతో పసి నిసుంగును చంపడానికి ఉద్యుక్తుడైన కంసుని అతని చెల్లెలు దేవకి వద్దని వారించే సందర్భంలోనిదీ పద్యం. – కరుణ రసాత్మకం !

దేవకి : అన్నా! నాపై కరుణింపుము.

సీ|| అన్నశమింపుమీవకట ! యీ బాలను

జంపబూనుట నీకు జనదటన్న!

కోమలీ పడుచుపై కోపంబు వలదన్న!

అల్లుడు గాడు దీనరయుమన్న !

స్త్రీ హత్య, శిశుహత్య శిష్ట మార్గముగాదు

సత్కీర్తి జగమందు జాటుమన్న !

అన్న! నీ సోదరి నడుగులపై దల

నొంచి వేడితి దయ గాంచుమన్న !

తే|| పుణ్య పురుషుల సమ్మతి బోవుమన్న !

శిశువు హత్యను చేసి సిరులు గల్గ

వన్న పుత్రిక దానంబు నర్థినయ్యి

యడిగితిని దాతవై నివ్వుమన్న నాకు.

ఆంధ్ర మహా భారతంలోని (అరణ్య పర్వం-3.312-376)లో గల సౌగంధికా సంగ్రహ వృత్తాంతాన్ని గ్రహించి రంగ కృష్ణ మాచార్యులు సౌగంధికా సంగ్రహం అనే యక్షగానాన్ని రచించాడు. సూత్రధార నటీ సంభాషణలో కవి పరిచయం చేశాడు. స్వాతంత్రోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వీర గాథను ప్రదర్శింపదలచి విద్యార్థులడుగగా కవి దీనిని టంగుటూరి ప్రకాశం పంతులు సంస్మరణగా రచించినట్లు తెలుపుకొని తనకు గల దేశభక్తిని చాటినాడు. నాడు నిజాం రాజుపై గల భయభక్తులతో యక్షగానాల్లో స్థానికంగా ప్రాచుర్యంలో ఉన్న ఉర్దూ భాషను రాజప్రవేశ సందర్భంలో ప్రవేశపెట్టేవారు, ఎలాగంటే…

దర్వు-ఏకతాళం

ధర్మరాజ్‌ కా సవారి ఆయా, దర్భార్‌ కరో జాల్‌ మియా

నిర్మల్‌ మణిమయ నిజసింహాసన్‌ – సబ్‌లోగ్‌ ఆకర్‌ సలామ్‌ కర్నా

పటేల్‌, పట్వారి పహరాజవాన్‌ పట్‌కీ సర్కార్‌ హుకుంలేదేవ్‌

దేర్‌న¬ అతాహై దేవల్‌కో నాపూర్‌ దేఖ్‌నేకే జరూర్‌ ||ధర్మరాజ్‌||

కల్వకుర్తి, దేవరకొండ, మెదక్‌ ప్రాంతాల్లో ఈ యక్షగానం మంచి ప్రచారం పొందింది. యక్షగాన ప్రదర్శన జానపదుల సంతోషం కొరకే. అందుకే ప్రజల భాష, యాస, కవిగారు సందర్భానుకూలంగా ప్రయోగించారు.

తెలంగాణలో కీర్తన రూపంలో భజన సాహితిని రచించిన వారిలో రామదాసు పేరుతో ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న ప్రథమ గణ్యుడు. ఇతని తర్వాత తూమునర్సింహ కవి, ఎడ్ల రామదాసు, రాకమచెర్ల వెంకటదాసు, మన్నెము కొండ హనుమద్దాసు మొదలగు ప్రఖ్యాత సంకీర్తనాచార్యుల ప్రభావంతో రంగకృష్ణమాచార్యులు తన కవితా పాటవంతో ‘భజన రత్నావళి’ అనే కీర్తన సాహిత్యాన్ని రచించాడు. ఇందులో 66 కీర్తనలున్నాయి. ప్రతి కీర్తనచివర ఒక పద్యం చెప్పాడు. కృతి ప్రారంభంలో మహాత్మా గాంధి, భరతమాతల ఆత్మ సంతృప్తికి కీర్తనలు చెప్పవలసిందని బాల బాలికల కోరికపై ఈ కీర్తనలను స్వాతంత్య్ర లబ్ధి కాలంలో దైవ భక్తి, దేశ భక్తి పెనవేసుకున్న కృతిగా సిద్ధం చేసి రచయితలకు ఆదర్శప్రాయుడైన రంగ కృష్ణమాచార్యులు తెలంగాణ సాహిత్యాకాశంలో తారగా ప్రకాశిస్తూనే వుంటారు. వీరి సాహిత్యాన్ని తెలంగాణ సారస్వత పరిషత్తు వెలుగులోకి తెస్తే బావుంటుంది. మరింగంటి కృష్ణమాచార్యులు 03-01-1987న జీవయాత్ర చాలించారు.

Other Updates