తెలంగాణ చరిత్ర సంస్కృతులను గురించి సాధికారిక రీతిలో తెలిపే గ్రంథాలు వ్యాస సంకలనాలు గత దశాబ్ది కాలం నుండి విరివిగా వస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో ఉపేక్షకులోనైన ఇక్కడి చరిత్ర సంస్కృతుల శోధన మరింగా కొనసాగవలసి ఉంది. ఈ క్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం సమన్వయంతో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన ‘తెలంగాణ చరిత్ర-సంస్కృతి’ వ్యాస సంకలనం మరొక చక్కని వాజ్ఞ్మయ ఉపకరణంగా ఉ పయోగపడుతుంది. మూడు వందల పుటలతోకూడిన ఈ సంకలనం జిజ్ఞాసువులకు, పరిశోధకులకు పోటీ పరీక్షల విద్యార్థులకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. సంకలనంలో మొత్తం నలభై వ్యాసాలున్నాయి. వీటిలో మూడు ఇంగ్లీషులో మిగతావి తెలుగులోనూ ఉన్నాయి. సంకలనాన్ని చరిత్ర, భాష, సాహిత్యం, వివిద అంశాలు, ఆర్థికం, భౌగోళికం అన్న విభాగాలుగా తీర్చిదిద్దారు. వ్యాసాలన్నీ సమగ్రతను సంతరించుకున్నాయి.

జి. వెంకటరామారావు, శివనాగిరెడ్డి, రవ్వా శ్రీహరి, కసిరెడ్డి వెంకటరెడ్డివంటి లబ్ధ ప్రతిష్ఠులు సంకలనానికి తమ వ్యాసాలను అందించారు. ఆయా అంశాలలో నిపుణులైనవారిని గుర్తించి వారితో వ్యాసాలను రచింపజేయడంలో సంపాదకులు చూపించిన శ్రద్ధాసక్తులు అభినందనీయమైనవి. సంచిక కూర్పు అందంగా ఉంది. సామాన్య పాఠకులకు సైతం నచ్చేరీతిలో ఛాయాచిత్రాలను చేర్చారు. ముఖ చిత్రం ఆకర్షణీయమైన పద్ధతిలో ఉంది. వ్యాసాలన్నీ తెలంగాణ చరిత్ర సంస్కృతుల అన్వేషణలో మార్గదర్శకంగా ఉంటాయనడంలో అతిశయోక్తిలేదు. పదికాలాలపాటు నిలిచే వ్యాససంకలనాన్ని రూపొందించిన సంపాదకులను ప్రశంసించవలసిందే!

Other Updates