తెలుగు సాహిత్యంలో దీర్ఘకావ్యాలు కొత్తేంకాదు. తన తాత్విక పునాదిని ఒక వివరణాత్మకమైన విస్తృతమైన భావచిత్రాలతో తనివితీరా వ్యక్తీకరించడానికి ఉపయోగించుకొనే ప్రక్రియే లాంగ్ పోయమ్.
తెలంగాణ ఉద్యమం ఉద్యమాలలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గది. గాంధేయ మార్గపోరాటం తన లక్ష్యం సాధించగలదని తెలంగాణ ఉద్యమం నిరూపించింది.
ఇంత మహత్తరమైన ఉద్యమావేశాన్ని చిత్రించడానికి తనివితీరా పాఠకునికి పంచడానికి లాంగ్ పోయమ్ ఒక వాహిక కావడం ఒక అనివార్యమైన పరిణామం. కాబట్టే తెలంగాణ ఉద్యమంలో లాంగ్ పోయమ్‌లు అసంఖ్యాకంగా వచ్చాయి. సాహిత్యంలో ఉద్యమాన్ని ప్రతిపలించే లాంగ్ పోయమ్‌లు ఎన్నో వచ్చాయి.పాశ్చాత్య దేశాల్లో ఉద్యమ లేక రాజకీయ దీర్ఘకావ్యాల్లో చెప్పుకోదగ్గవి నెరుడా కాంటో జనరల్, ఐరిష్ కవి ఈట్స్ పొలిటిక్స్ లాంటివి. దీర్ఘకావ్యాల్లో కవి అమూలగ్రతనూ వెలువరిస్తాడు. చరిత్ర మానవసంబంధాలు, ఉద్యమం, ఉద్యమ లక్ష్యాలు లాంటివి ఆస్వాంతమూ చర్చించవచ్చు. తన కాన్వాసుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవచ్చు.
వనపట్ల సుబ్బయ్య కావ్యంలో ఇవన్నీ కనిపిస్తున్నాయని చెప్పలేం కాని ఒక అలుసులేని పోరాటాన్ని చిత్రించే కవితా భాగస్వామ్యంతో వచ్చిన యాతన కనబడుతుంది. బిగించిన పిడికిలిలో దాచిన ఉద్యమావేశం కనబడుతుంది. వెరసి దాన్ని కవిత్వీకరించేటపుడు ఆయన ఒడుపుదనం కనబడుతుంది.వస్తువును తనతో మమేకం చేసుకొని , ప్రతిపాదికలతో రచనను ప్రణాళికా బద్ధంగా కొనసాగించడం ఆయన ప్రత్యేకత.
మశాల్ అంటే వెలిగే దివిటీ. మంచి నూనె ఉపయోగంతో దీర్ఘకాలం మండడం దీని లక్ష్యం.ఈ కవి తెలంగాణ ఉద్యమం దీర్ఘకాలపు కొనసాగింపు లక్ష్యం ప్రతీకతో దీన్ని రాశాడు
వెయ్యి దుశ్శాసనుల మధ్య నా బతుకమ్మ బోనమెత్తుకొని నడవగలదా అంటూ కావ్యారంభంలోనే ప్రకటించాడు ఈ కవి. ఇంక మీ నీడను కూడా మేం తొక్కలేం. మీ గాలిని కూడా మేం పీల్చుకోలేం. మాకిప్పుడు పది జిల్లాల తెలంగాణే కావాలి అంటూ తన కవితా లక్ష్యాన్ని ప్రకటించాడు.
వనపట్ల కావ్యాన్ని డిసెంబర్ 9న అప్పటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి వెనక్కి తీసుకున్న విషయ ప్రస్థావనతో ప్రారంభించాడు. వెయ్యిమందికి మరణ శాసనమైన, నాలుగున్నర కోట్లమందికి కన్నీటి శాపమైన ఆ రాజకీయ ప్రకటనను దాన్ని వెనక్కి తీసుకోవడాన్ని ఆయన ప్రశ్నించాడు. తెలంగాణ సగటు పౌరుడు పరిమిత వసతితో తృప్తిగా జీవిస్తాడు. గత ప్రభుత్వాలు ఆర్థిక మండలాలు అతన్ని కొల్లగొట్టాయి. జలయఙ్ఞాలు, రచ్చబండలు, ప్రజాయాత్రలు, అమ్మ హస్తం, నగదు బదిలీ, ఇదంతా బద్మాష్‌పాలన, అని తెలంగాణ వాది కనిపెట్టాడు. తెలంగాణా వాదమే లేదని ఒకడు సెంటిమెంట్ తగ్గిందని ఒకడు, ప్రకటించిన అవకాశ వాదాన్ని నిరసించాడు. సుబ్బన్న వాడిన ప్రతీకలు సామాన్య మధ్యతరగతి దైనందిన జీవితంలోనివే. తెలంగాణ పోరాటాన్ని జీవితాన్ని బహుజన, స్త్రీ కోణంలో వ్యాఖ్యానించడం ఒక కొత్త వ్యూహం.
తెలంగాణ వీరకవులకు పుట్టిల్లు. ఒక రామదాసు (రామున్ని నిస్సంకోచంగా తూలనాడడం) తరువాత దాశరథి. కాళోజి. లాంటి కవులెందరో ధిక్కార స్వరం వినిపించారు. సుబ్బయ్య కూడ ఆ వరుసలో చేరదగిన కవి. ప్రపంచ తెలుగు మహసభలు
మహసభల మెర్క్యురి వెలుగుల్లో
మెరుస్తున్న లద్దె పురుగుల్లారా.. గర్భశోకంలో తల్లి కుమిలి పోతూంటే సన్మానాలకు భుజాలు దించుతారా అంటూ ధర్మాగ్రహం ప్రకటించాడు.
కవిత్వీకరించే ఏ సంఘటననైనా చారిత్రక ప్రసిధ్ది పొందుతుంది. సుబ్బయ్య కావ్యంలో ప్రతి పలించిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. భావి సాహిత్యతరాలకు సమాంతర సామాజిక అసంతృప్తిని కవిత్వీకరించే బాధ్యత ఎంత అనివార్యమో గుర్తు చేస్తుంది.
– డా. కాంచనపల్లి