గటిక విజయ్‌ కుమార్‌

  • ఉభయ తారకంగా గోదావరి – కృష్ణల అనుసంధానం
  • తెలంగాణ – ఆంధ్రలో బంగారు పంటలే లక్ష్యం

‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ భూభాగం నుంచి ప్రతీ ఏటా సగటున మూడు నుంచి నాలుగు వేల టిఎంసిల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సాగునీరు లేక లక్షలాది ఎకరాలు బీడుపడి ఉన్నాయి. వేలాది గ్రామాల్లో లక్షలాది జనం మంచినీరు లేక అలమటిస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. అన్ని ప్రాంతాలకు సాగునీరు, అన్ని ఇండ్లకు మంచినీరు రావాలి. బేసిన్లనే లెక్కలు కాదు, ప్రజల అవసరాలు తీరాలి” ఇదీ గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ఆలోచనకున్న నేపథ్యం.

నిజానికి తెలంగాణ, ఆంధ్ర భూభాగం ఎక్కువ ప్రాంతం గోదావరి, కృష్ణా నదుల మధ్యనే ఉంటుంది. అందుకే వేద మంత్రాల్లో సైతం జంబూద్వీపే, భరతఖండే, భరతవర్షే, మేరోః దక్షిణ దిగ్భాగే, కృష్ణా – గోదావరీ మధ్యదేశే అస్మకం అని ఉచ్చరి స్తారు. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న పునీతమైన ప్రాంతంగా ఈ ప్రాంతానికి పేరుంది. అయితే తలాపున సముద్రమున్నా, చేప దూపకేడ్చినట్లు అటు గోదావరి, ఇటు కృష్ణా నదులున్నప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సాగునీటికి, తాగునీటికి దశాబ్దాల తరబడి గోస తప్పడం లేదు.

తెలంగాణ వైశాల్యం 1,12,077 చదరపు కిలోమీటర్లు (2,76,94,829.8 ఎకరాలు) అయితే, అందులో వ్యవసాయ యోగ్యమైన భూమి కోటి ఆరు లక్షల ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలయ్యే ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైశాల్యం 1,60,205 చదరపు కిలోమీటర్లు (3,95,87,517 ఎకరాలు) అయితే, అందులో వ్యవసాయ యోగ్యమైన భూమి 1,83,30,277 ఎకరాలు. ఇందులో 88,51,314 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించే ప్రాజెక్టులున్నాయి.

రెండు రాష్ట్రాల పరిధిలో కృష్ణా, గోదావరి బేసిన్లలో అనేక ప్రాజెక్టులు కట్టినప్పటికీ ఆంధ్రలోని రాయలసీమ ప్రాంతానికి, తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు మాత్రం నీరు రాలేదు. దీంతో ఈ ప్రాంతాలు ఎప్పుడూ దుర్భిక్ష ప్రాంతాలుగానే మిగిలిపోయాయి.

కృష్ణా బేసిన్‌కు గోదావరి నీరే శరణ్యం

ఈ రెండు ప్రాంతాలకు ప్రధానంగా కృష్ణా నది నుంచే నీరు రావాలి. అయితే వివిధ కారణాల వల్ల కృష్ణా నదిలో నీటి ప్రవాహం ప్రతీ ఏటా తగ్గుతూ వస్తున్నది. దీంతో కృష్ణా నది బేసిన్లలో ఉన్న భూములకు కూడా గోదావరి నుంచి నీటిని తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం (పట్టిసీమ) లాంటి ప్రాజెక్టుల ద్వారా అక్కడి ప్రభుత్వం గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌ కు అందించే ప్రయత్నం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా కృష్ణా బేసిన్‌లో

ఉన్న నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నది. అయితే ఈ ప్రయత్నాలు అటు రాయలసీమకు, ఇటు మహబూబ్‌ నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు పూర్తి న్యాయం చేయడం లేదు. గోదావరి నదిని పూర్తి స్థాయిలో కృష్ణాకు అనుసంధానం చేస్తే తప్ప ఈ ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీటి సమస్యకు పరిష్కారం లభించదు.

కేంద్ర జల సంఘం (సి.డబ్ల్యు.సి.) నిర్ధారించిన లెక్కల ప్రకారం, గోదావరి నది ద్వారా పోలవరం పాయింట్‌ నుంచి ప్రతీ ఏటా సగటున 3,083 టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తున్నది. 2019 వర్షకాలం సీజన్లోనే ఇప్పటి వరకు 3,099 టిఎంసిల నీరు సముద్రంలో కలిసింది. ఇలా వృధాగా పోతున్న నీటిని కృష్ణా బేసిన్‌ కు తరలించడమే నదుల అనుసంధానం ప్రధాన లక్ష్యం.

నదుల అనుసంధానంపై కేసీఆర్‌, జగన్‌ దృష్టి

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే వ్యవహరిస్తామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలిరోజునే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విస్పష్టంగా ప్రకటించారు. దానికి అనుగుణంగానే గడిచిన ఐదేళ్లలో సరిహద్దు రాష్ట్రాలతో సఖ్యత కోసం త్రికరణ శుద్ధితో అడుగులు వేశారు. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాలతో సంబంధాలు గణనీయంగా మెరుగయ్యాయి. కానీ, ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్రంతో మాత్రం గడిచిన ఐదేళ్లలో వివిధ కారణాల వల్ల సంబంధాలు మెరుగుపడకపోగా, మరింత దారుణంగా దెబ్బతిన్నాయి. 2019 ఏప్రిల్‌ మాసంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా నదుల అనుసంధానం జరగాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో 2019 జూన్‌ నెల 28 తేదీన విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. ఈ సమావేశం లో జరిగిన చర్చలకు అనుగుణంగా రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు గోదావరి నది నీటిని కృష్ణా బేసిన్‌కు ఎలా తరలించాలనే విషయంపై ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ ప్రతిపాదనలపైనే ఇద్దరు ముఖ్యమంత్రులు 2019 సెప్టెంబర్‌ 23న

మరోసారి సమావేశమై ప్రధానంగా చర్చించారు.

నదుల అనుసంధానం ప్రతిపాదనలు గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎలా తరలించాలి అనే విషయంపై అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ నుంచి గోదావరి నదీ జలాలను రివర్స్‌ పంపింగ్‌ చేయడం ద్వారా ఎగువకు పంపుతున్నట్లే కృష్ణా నదిలో కూడా నీటిని రివర్స్‌ పంపింగ్‌ చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఏ పాయింట్‌ అయితే బాగుంటుందనే అంశంపై ప్రతిపాదనలు తయారు చేశారు.

ప్రతిపాదన 1:

పోలవరం పాయింట్‌ వద్ద ప్రతీ ఏటా 3వేల టిఎంసిలకు పైగా నీటి లభ్యత ఉన్నందున, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజికి నీటిని తరలించాలి. ప్రకాశం బ్యారేజి నుంచి నాగార్జున సాగర్‌కు, నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి నీటిని పంపాలి. శ్రీశైలం రిజర్వాయర్‌ ను ఎప్పటికప్పుడు నింపి ఉంచడం ద్వారా అటు రాయలసీమకు, ఇటు మహబూబ్‌ నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు పుష్కలంగా నీరు అందించవచ్చు. ఈ ప్రతిపాదన తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాదు, నదుల ద్వారానే నీటిని తరలించడం వల్ల భూసేకరణ కూడా పెద్దగా అవసరం పడదు.

ప్రతిపాదన 2:

భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం నుంచి నాగార్జు సాగర్‌ కు నీటిని తరలించాలి. అక్కడి నుంచి శ్రీశైలానికి రివర్స్‌ పంపింగ్‌ చేయాలి.

ప్రతిపాదన 3:

దుమ్ముగూడెం పాయింట్‌ నుంచి నేరుగా శ్రీశైలం రిజర్వాయర్‌ కు నీటిని తరలించాలి.

ప్రతిపాదన 4:

తుపాకుల గూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న బ్యారేజి ప్రాంతం నుంచి నీటిని నాగార్జున సాగర్‌ తరలించాలి. అక్కడి నుంచి శ్రీశైలం పంపాలి.

ప్రతిపాదన 5 :

తుపాకుల గూడెం నుంచి నేరుగా శ్రీశైలం పంపాలి. ప్రతీ రోజు 2 టిఎంసిల నీటిని గోదావరి నుంచి కృష్ణాకు పంపాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనల్లో అమలుకు ఏది సులభంగా

ఉంటుంది? తక్కువ ఖర్చు, తక్కువ భూసేకరణతో ఎక్కువ ప్రయోజనం కలిగించే విధానం ఏదీ? అనే అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. మరోసారి అధికారులు, నిపుణులతో కూర్చుని సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నీటి వినియోగానికి సంబంధించి ఒప్పందం చేసుకుంటారు.

విద్యుత్‌, ఇతర అంశాలపై చర్చలు

నదుల అనుసంధానం అంశంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్‌ బకాయిలు, విద్యుత్‌ ఉద్యోగుల విభజన అంశాలపై కూడా ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించారు. పోలీసు, రవాణా, ఇతర అంశాలపై కూడా చర్చించారు. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సుదీర్ఘ సరిహద్దు కలిగిన ఇరుగు పొరుగు రాష్ట్రాలు కనుక, కలిసి పనిచేస్తేనే ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు.

Other Updates