దేశంలోని ఆరు ముఖ్య నగరాలలో హైదరాబాద్ ఒకటి. స్వచ్ఛమైన హైదరాబాద్, శాంతియుత హైదరాబాద్ కావాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలి. మలుచుకుంటే ఈ మహానగరం స్వర్గమే. విస్మరిస్తే నరకప్రాయమవుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హెచ్చరించారు.
స్వచ్ఛ తెలంగాణ – స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమ నిర్వహణపై మే 6న హైదరాబాద్‌లోని హెచ్.ఐ.సి.సి.లో జరిగిన సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
‘‘లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ప్రపంచం ఇప్పుడు ఈ స్థితిలో వుందంటే దానికి ఆశావాద దృక్పథం మూలం. మనుషులు సహజంగా మార్పును కోరరు. కానీ, అభ్యుదయంగా ఆలోచించేవారు మార్పు సాధకులవుతారు. మనమిప్పుడు అనాగరిక జీవితం గడుపుతున్నాం. కలుషిత ఆహారం, కలుషిత నీరు వాడుతున్నాం. దీన్నించి మనం విముక్తి కావాలి. అందరం అనుకుంటే మార్పు కూడా సాధ్యమే. దానికి తెలంగాణ రాష్ట్రం ఓ ఉదాహరణ’’ అని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పేర్కొన్నారు.
‘‘హైదరాబాద్‌లేని తెలంగాణ కావాలనుకుంటే ఎప్పుడో ఏడేండ్ల కిందే వచ్చేది. కానీ తెలంగాణ ప్రజల రక్తంతో నిర్మించిన హైదరాబాద్‌ను వదులుకోమని చెప్పిన. ఒకే ఒక్కడ్ని ప్రారంభించిన కల సాకారమైంది’’ అని సి.ఎం. తెలిపారు.
హైదరాబాద్ నగరానికి అనేక ప్రత్యేకతలు వున్నాయని, 200 ఏండ్ల క్రితమే పరిశ్రమలు వచ్చాయని, హైదరాబాద్‌కు అనేక హంగులు, అవకాశాలు వున్నాయని కె.సి.ఆర్. చెప్పారు.
‘‘తెలంగాణకు అద్భుతమైన పారిశ్రామిక విధానం తయారైంది. అంబానీల స్థాయి ఉన్న పారిశ్రామిక వేత్తలు మెచ్చుకున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. మన పిల్లలకి మంచి ఉపాధి దొరుకుతుంది. అందుకోసం హైదరాబాద్‌ను సిద్ధం చేయాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌ను పరిశుభ్రంగా మార్చుకుందాం. నగరాన్ని 400 విభాగాలుగా మార్చి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, మండలి ఛైర్మన్, ముఖ్య అధికారులు ఒక్కో విభాగానికి బాధ్యత తీసుకుంటారు. మనమందరం కలసి పనిచేస్తే ఏదైనా సాధ్యం. సంఘటిత శక్తిలో గొప్ప బలం వుంది. ఆ శక్తితో ఏమైనా సాధ్యమేనని ముఖ్యమంత్రి అన్నారు.
‘‘ప్రజల్లో వందశాతం మంచి ఉంటుంది. దాన్ని తట్టి లేపేవారు కావాలి. సూరత్‌లో ప్లేగు వచ్చినప్పుడు కూడా ఎస్.ఆర్. రావు అనే కమీషనర్ చొరవతో నగరమంతా శుభ్రంగా మార్చుకున్నారు. రియో డిజినిరో కూడా ఓ గొప్ప నగరంగా మారింది. మనం కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సూచించారు.
‘‘బలహీనవర్గాలవారు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతోనే డబుల్ బెడ్‌రూమ్ ఆలోచన చేశాను. ఐ.డి.హెచ్. కాలనీని మొన్ననే చూశాం. అక్కడి ప్రజలు చాలా సంతోషపడ్డారు. గతంలో కట్టిన సింగిల్ బెడ్‌రూమ్ ఇండ్లవల్ల చాలా గోసపడ్డారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అందుకే హైదరాబాద్‌లో రెండు లక్షల మంది నిరుపేదలకు రాగల మూడు, నాలుగేండ్లలో దశలవారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టుకుందాం’’ అని సి.ఎం. చెప్పారు.
జూలై నెలలో ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 3 కోట్ల మొక్కలు నాటాలని, దీనికోసం బస్తీలవారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్
‘‘విప్రో ఛైర్మన్ అజిత్ ప్రేమ్‌జీ ఇటీవల నన్ను కలిశారు. బెంగుళూరులో పరిస్థితి బాగా లేదని, హైదరాబాద్‌లో తమ సంస్థను విస్తరిస్తున్నామని చెప్పారు. బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి బాగాలేదు. హైదరాబాద్ కూడా అలా కావద్దని చూస్తున్నాం’’ అని సి.ఎం. కె.సి.ఆర్. చెప్పారు.
20వేల కోట్ల రూపాయల వ్యయంతో త్వరలో హైదరాబాద్‌లో సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ సిస్టం తయారు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘రాబోయే మూడేండ్లలో మార్పు వస్తుంది. హైదరాబాద్‌లో అక్రమార్కులకు, అస్తవ్యస్తానికి కళ్లెం పడాలి. నగరాన్ని అందంగా తీర్చిదిద్దుదాం. మాస్టర్‌ప్లాన్ ప్రకారం తయారు చేద్దాం’’ అని సి.ఎం. పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పాల్గొన్న వారందరితో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రతిజ్ఞ చేయించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహణకు కార్యాచరణను ప్రకటించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంపై జి.హెచ్.ఎం.సి. కమీషనర్ సోమేష్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, టి. హరీష్‌రావు, పద్మారావు, చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
నెలకోసారి పేదల బస్తీలకు వెళ్దాం
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పొల్గొన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ధన్యవాదాలు తెలిపారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ పై మే 28న సమీక్ష సమావేశం నిర్వహించారు.శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, స్వచ్ఛ హైదరాబాద్ బృందాలు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రారంభోపన్యాసం చేశారు. జిహెచ్‌ఎంసి కమీషనర్ సోమేష్ కుమార్ ఐదు రోజులపాటు జరిగిన కార్యక్రమాన్ని వివరించారు. కవి, గాయకుడు, ఓ.ఎస్.డి. దేశపతి శ్రీనివాస్ సమావేశ సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఆయన పాడిన పాటలు అలరించాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చాలా గొప్ప స్ఫూర్తిని నింపిందని, పట్టుదలతో కలిసి పనిచేస్తే తప్పక ఫలితం వుంటుందని ఈ కార్యక్రమం నిరూపించిందని చెప్పారు. తమ బతుకులు బాగు పడతాయనే నమ్మకం ప్రజలకు కలిగిందన్నారు. ప్రభుత్వం ప్రజల కోసమే వుందనే అభిప్రాయం కలిగిందని, ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇళ్లల్లో, షాపుల్లో, పనిచేసే ప్రాంతాల్లో పుట్టే చెత్త నగరంలో ఎక్కడా పేరుకుపోకుండా, నగరం అవతలకే తరలించే కార్యక్రమం తీసుకుంటామన్నారు. ప్రతీ ఇంటికీ తడి, పొడి చెత్త సేకరించడానికి రెండు ప్లాస్టిక్ చెత్త బుట్టలు ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. ఇళ్ల నుంచి చెత్త సేకరించడానికి రిక్షాల బదులు, ఆటో ట్రాలీలు ఏర్పాటుచేస్తామన్నారు. దాదాపు రెండు వేల ఆటో ట్రాలీలు కొని, స్థానిక యువకులకే వాటిని ఇస్తామన్నారు. దీని వల్ల యువకులకు ఉపాధి కూడా దొరుకుతుందని చెప్పారు.
ఆటో ట్రాలీలు చెత్తను నేరుగా నగర శివార్లకు తీసుకెళ్తాయని, అక్కడి నుంచి లారీల ద్వారా విద్యుత్ ప్లాంట్లకు, కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రానికి తరలిస్తామన్నారు. దీని వల్ల నగరంలో ఎక్కడా చెత్త కనిపించడన్నారు. రెండు నెలల్లోగా ఈ సానిటేషన్ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
నగరంలో చాలా చోట్ల హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఇండ్లపై నుంచి పోతున్నాయని, వీటివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ వైర్లను తరలించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. చాలా ప్రాంతాల్లో మంచినీరు, మురుగునీరు కలిసిపోతున్నాయని, ఇలా కలవకుండా వెంటనే చర్యలు ప్రారంభించాలని చెప్పారు.
నగరంలో మొత్తం 77 నాలాలు ఉన్నాయని, వాటిలో ఐదు నాలాలు హుస్సేన్ సాగర్‌లో కలుస్తున్నాయని, 72 ముసీ నదిలో కలుస్తున్నాయన్నారు. అయితే కట్టడాలు రావడం వల్ల చాలా చోట్ల నాలాలు మూసుకుపోయాయని, నాలాలపై ఆక్రమణల తొలగింపు కోసం ఓ విధానం ఖరారు చేస్తామని సిఎం చెప్పారు. నాలాలలో పేరుకు పోయిన చెత్తను, పూడికను తొలగించాలన్నారు. నగరంలో ఎక్కడికి వెళ్లినా, పేదలు తమకు ఇండ్లు కావాలని కోరారని, దశల వారీగా నగరంలో రెండు లక్షల ఇండ్లు కడతామన్నారు. ప్రభుత్వ స్థలాల్లో వాటిని కడతామని, అవసరమైతే భూమి కొనైనా ఇండ్లు కడతామని చెప్పారు.
బస్తీల్లో పర్యటించిన సందర్భంగా ఎదురైన అనుభవాలను అధికారులు సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన జిహెచ్‌ఎంసి కమీషనర్ సోమేష్ కుమార్, సిబ్బందిని సిఎం అభినందించారు. ప్రజలతో మమేకమైన గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ వ్యాప్తంగా స్వచ్ఛ హైదరాబాద్‌కు మంచి పేరు వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నారు, ప్రజలు కలిసి వచ్చారు, నెలకోసారి మళ్లీ బస్తీలకు వెళదాం. 15 మందితో బస్తీ కమిటీలు వేసుకుందాం, చాలా ఆక్రమణలు, అగ్గిపెట్టెలు పేర్చినట్లు ఇండ్లు కట్టారు. చెట్లు పెడతామంటే కూడా జాగాలేదు, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఓ కాలేజీ పెడతామంటే జాగా లేదు. అక్కడ 8`10 వేల మంది పేదలకు ఇండ్లు కావాలి. దానికి జాగాలేదు. బస్తీల్లో చాలా అవసరాలున్నాయి. నగరంలో చాలా చోట్ల దురాక్రమణలున్నాయి. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూడా అన్నీ అక్రమాలే ఉన్నాయి. వీటన్నింటిని క్రమబద్దీకరించాలని సిఎం చెప్పారు.
‘‘నగరంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా మరింత మెరుగు పరచాలి. బస్తీల వారీగా వచ్చిన సమస్యలన్నింటినీ క్రోడీకరించి పరిష్కరిద్దాం. మురుగునీటి వ్యవస్థను, మంచినీటి సరఫరాను మెరుగుపరచాలి. దీనికోసం నిధులు కేటాయిస్తాం. నగరంలో కూడా ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందిస్తాం. గోదావరి, కృష్ణా ద్వారా నగరానికి మంచినీరు అందిస్తాం. దాదాపు 35 టిఎంసిల నీరు తెచ్చుకుందాం. జిహెచ్‌ఎంసి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా పరిస్థితి మెరుగవ్వాలి. వంద మార్కెట్లు, స్మశానవాటికలు, పార్కులు, బస్ బేస్ మెరుగవ్వాలి. వంద మార్కెట్లు, 50 ` 60 చోట్ల మల్టి లెవెల్ పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేస్తాం. మొదటి రెండు నెలలు ప్రజలను భాగస్వాములను చేసే అంశంపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత జనాభా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి.’’ అని సిఎం అన్నారు.
‘‘జిహెచ్‌ఎంసి ఉద్యోగులు, సఫాయి కర్మచారీల వేతనాలు పెంచుకుందాం. నాతో పాటు నగరంలో ఎవరి పోస్టర్లు, రాజకీయ పార్టీల పోస్టర్లు, గోడలపై లేకుండా చేయాలి. వాటన్నింటిని తొలగించాలి. డిజిపి సహా పోలీసులంతా పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. పవర్ కేబుల్ వైర్లు అండర్ గ్రౌండ్స్‌లో వుండే విధంగా రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దాలి. భవన శిథిలాలు మైనింగ్ గుంతలలో వేయాలి. కరెంట్, మంచినీరు లాంటి సానుకూల ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రజలు కూడా నమ్ముతారు. మన కార్యక్రమాలకు సహకరిస్తారు. హరిత హారం కోసం కూడా ప్రణాళికలు సిద్దం చేయాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ముఖ్యమంత్రికి గవర్నర్ అభినందనలు:
మంత్రులు, అధికారులు చాలా మంచి చొరవ చూపారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రజలను కదిలించింది. ప్రజల నుంచి అనేక సమస్యలు వచ్చాయి వాటిని పరిష్కరించుకోవాలి. దానికోసం ముఖ్యమంత్రి వద్ద ప్రణాళికలు వున్నాయి. వచ్చే ఆరు నెలల్లో కొత్త హైదరాబాద్‌ను చూస్తాననే నమ్మకం నాకుంది. వర్షపు నీరు రోడ్ల పైకి రాకుండా కూడా ప్రభుత్వం పని చేస్తుందని నమ్ముతున్నా. కూరగాయల మార్కెట్లు, పార్కింగ్ ప్లేస్‌లు కూడా రావాలి. వాటికోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జిహెచ్‌ఎంసి కూడా బాగా పనిచేస్తున్నది. దీని వల్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుంది’’ అని ఈ సమావేశంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ చెప్పారు.