మల్లన్న సాగర్… ఇటీవలి కాలంలో అపోహలు, అనుమానాలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సాగునీటి జలాశయం. నిజాలను దాచి ఊహాగానాలతో ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడంతో ఈ జలాశయంపై సాగిన చర్చ తక్కువేమి కాదు. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సృష్టించిన అపోహలతో ప్రజల్లో అనుమానాలు తలెత్తాయి. దీంతో గందరగోళంలో నెట్టిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కవోని దీక్షతో రాష్ట్రంలోని బీడు భూములను సాగులోకి తేవాలనే లక్ష్యంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రజల్లో నెలకొల్పిన అపోహలు. అనుమానాలు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు సారధ్యంలో ప్రజా ప్రతినిథులు, ప్రభుత్వ అధికారులు చేసిన కృషితో జలాశయంపై నెలకొన్న అపోహలు తొలిగి పోయాయి. దీంతో జలాశయం నిర్మాణానికి తమ భూములను ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. జలాశయంలో ముంపునకు గురయ్యే రైతులు స్వచ్ఛందంగా మందుకు వస్తున్నా.. ఈ జలాశయంపై ఇంకా పౌర సమాజంలో కొందరు అపోహలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ జలాశయంపై వాస్తవాలను పౌర సమాజం ముందుంచడమే వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం.
ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం
మల్లన్న సాగర్ కింద ముంపునకు గురయ్యే బాధితులకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామిని ఇచ్చింది. బాధితులు కోరినట్లుగా నష్టపరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం జారీ చేసిన 123జీవో ప్రకారమైనా, 2013 భూసేకరణ చట్టం ప్రకారమైనా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడంతో బాధితులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని మంత్రి తన్నీరుహరీశ్‌రావు ఇచ్చిన హామితో ప్రజల్లో అనుమానాలు, అపోహలు తొలిగిపోయాయి. దీంతో రైతులు తమ భూములను అప్పగించేందుకు ముందుకు వస్తున్నారు. వివిధ రకాల భూములను 8,892.95 ఎకరాలను మల్లన్న సాగర్ కోసం సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 7,459.80 ఎకరాలను నవంబర్ 15వ తేదీ వరకు సేకరించారు.
1 తక్కువ ముంపు..ఎక్కువ ప్రయోజనం
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అభివృద్ధి పట్ల జరిగిన వివక్ష వల్ల నష్టపోయిన రంగాలలో సాగు నీటిరంగం ప్రధానమైనది. తెలంగాణకు దక్కాల్సిన నీటి వనరులను దక్కకుండా ఆంధ్రా ప్రాంతానికి తరలించుకు పోవడంతో ప్రాంతీయ అసమానతలు తలెత్తి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం సాగింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన నష్టాలను పూడ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించినముఖ్యమంత్రి కేసీఆర్ సాగు నీటి రంగంపై ప్రత్యేక దృష్టిని సారించారు. దీంట్లో భాగంగానే గోదావరి జలాలను తెలంగాణ రాష్ట్రంలో పారించి బీడు పడిన భూములను సాగులోకి తేవాలని నిర్ణయించారు. ఇందు కోసం సమగ్ర సర్వేను నిర్వహింపజేశారు.
2కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా..
గోదావరి నదిపై కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ నుంచి టన్నెల్ ద్వారా నీటిని తరలించి మల్లన్న సాగర్ వద్ద 50 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ఈ జలాశయం కింద సిద్దిపేట, మెదక్ ,సిరిసిల్ల జిల్లాలలో 1.25లక్షల ఎకరాలకు సాగునీటిని అందింస్తారు. ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ రెవెన్యూ డివిజన్‌లోని పాములపర్తి వద్ద నిర్మించే కొండపోచమ్మ సాగర్ జలాశయానికి 7టీఎంసీలు , నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో గంధమల్ల జలాశయానికి 9.5టీఎంసీలు, బస్వాపూర్ జలాశయానికి 11.3టీఎంసీల నీటిని తరలిస్తారు. దీంతో పాటు సింగూర్ ప్రాజెక్టుకు మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో అనుసంధానించి నీటిని సరఫరా చేస్తారు. దీనివల్ల సింగూరు ప్రాజెక్టు కింద నున్న ఆయకట్టుకు రెండు పంటలకు నీరందుతుంది. అక్కడి నుంచి ఎస్సారెస్పీకి నీరు ఖర్చు లేకుండానే నీటిని సరఫరా చేసేందుకు మల్లన్నసాగర్ జలాశయానికి డిజైన్ చేశారు. 50 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించే జలాశయం కింద ముంపుకు గురయ్యే రెవెన్యూ గ్రామాలు ఎనిమిది మాత్రమే. పులిచింతల, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు జలాశయాలతో పొల్చితే మల్లన్న సాగర్ జలాశయం కింద ముంపుకు గురయ్యేది చాలా తక్కువ. పైగా ఆ జలాశయాల్లో నిల్వ ఉండేది మల్లన్న సాగర్ జలాశయంలో ఉండే నీటి కంటె తక్కువ నీరు కావడం గమనార్హం. అంతే కాక మల్లన్న సాగర్ ద్వారా దీనికింద ఉన్న భూములకే కాక, కొండపోచమ్మ, గందమల్ల, బస్వాపూర్, సింగూరు రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై తమ సా్వర్థప్రయోజనాల కోసం కొందరు ప్రజల్లో అపోహలను, అనుమానాలను సృష్టించి వారిలో ఆందోళనలకు కారణమయ్యారు.
ఇంతకు ముందు రూపొందిన ప్రాజెక్టులతో ఎక్కువ భూములు ముంపుకు గురవడమే కాక, తక్కువ నీటిని నిల్వ చేసే విధంగా ఉండడంతో వాటి నమూనాను సమూలంగా మార్చాలని నిర్ణయించారు. తక్కువ భూమి ముంపునకు గురై , ఎక్కువ నీటిని నిల్వ చేయడం ద్వారా అత్యధికవిస్తీర్ణంలోని భూములకు నీటిని అందించాలని నిర్ణయించారు. దీని ఫలితమే సాగు నీటి ప్రాజెక్టుల రీడిజైన్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సారధ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు రీడిజైన్ చేశారు. ఇలా రూపొందించిన ప్రాజెక్టుల్లో భాగమే కొమురవెళ్లి మల్లన్న సాగర్ జలాశయం. తక్కువ గ్రామాలు ముంపునకు గురవుతూ, ఎక్కువ నీటిని నిల్వ చేసే విధంగా రూపొందించిన జలాశయం ఇది కావడం విశేషం.
3మల్లన్న సాగర్ ప్రాధాన్యత
పులి చింతల సామర్ధ్యం45టీఎంసీలు..
ముంపుకు గురయ్యేది28గ్రామాలు
ఎల్లంపల్లి సామర్థ్యం20టీఎంసీలు..
ముంపుకు గురయ్యేది19గ్రామాలు
మిడ్‌మానేరు సామర్థ్యం25టీఎంసీలు..
ముంపుకు గురయ్యేది
11గ్రామలు పూర్తిగా, 4 పాక్షింగా ముంపుకు గురవుతున్నాయి
మల్లన్న సాగర్ సామర్ధ్యం 50టీఎంసీలు..
ముంపకు గురయ్యేది. ఎనిమిది గ్రామాలు మాత్రమే.
వీటిలో అయిదు రెవెన్యూ గ్రామాలు పూర్తిగానూ, మూడు రెవెన్యూ గ్రామాలుపాక్షికంగా ముంపుకు గురవుతున్నాయి.
పై పోలికతో మిగిలిన జలాశయాలలో ఏర్పడని అపోహలు, అనుమానాలు
కేవలం మల్లన్న సాగర్ జలాశయం విషయంలోనే ఎందుకు ఏర్పడ్డాయనేది సులభంగానే అర్థం చేసుకోవచ్చు.