chakriతెలంగాణ ముద్దుబిడ్డ, సంగీత స్వర చక్రవర్తి చక్రి ఆకస్మిక మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. ‘వెన్నెల్లో హాయ్‌ హాయ్‌….’ అంటూ సంగీత స్వరాలు కురిపించి, జగమంత కుటుంబం నాది అని ప్రకటించిన చక్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ‘మళ్లి కూయవే గువ్వా….’ అటూ ప్రణయ భావాల్ని పలికించినా, ‘చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే……’ అంటూ యువతను ఉర్రూతలూగించినా, ‘సత్తే ఏ గొడవాలేదు…. పుట్టే ప్రతివాడూ సత్తాడోయ్‌….’ అంటూ జీవిత పరమార్ధాన్ని తన సంగీతంతో అందించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ప్రేమ, ఆధ్యాత్మిక, విషాద గీతా లైనా సంగీతాన్ని స్వరపరిచి సంగీత ప్రియులకు చిరకాలం గుర్తుండి పోయేలా సంగీతంలో తనకంటూ ఒక ట్రేడ్‌ మార్క్‌ రూపొందించుకుని చక్రిగా ప్రసిద్ధుడైన గిల్లా చక్రధర్‌ డిసెంబర్‌ 15 2014న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చక్రి హఠాన్మరణంతో సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.
1974 జూన్‌ 15న వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి గ్రామంలో జన్మించారు. 8వ తరగతి వరకు కంబాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న చక్రి 1987`88లో మహబూబాబాద్‌ కంకరబోడ్‌ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. 1988`90లో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. వరంగల్‌లోని కాకతీయ డిగ్రీ కళాశాలలో 1990`93 వరకు డిగ్రీ చదువుకున్నారు. ఆయన తండ్రి వెంకటనారాయణ టీచర్‌గా పనిచేసే వాడు. తండ్రి ప్రోత్సాహంతో సంగీత ప్రపంచంలోకి అడుగిడిన చక్రిీ అనతికాలంలోనే ఎనలేని కీర్తి ప్రతిష్ఠల్ని ఆర్జించారు.

తండ్రి వెంకటనారాయణ కంబాలపల్లిలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాలంలో బుర్రకథ కళాకారుడిగా కూడా మంచి పేరుంది. దేశభక్తి గీతాలు, వరకట్నం, మద్యపాన నిషేధం లాంటి సామాజికాంశాలపై పాటలు రాసి పాడేవారు. ఈ కారణంగా చిన్నతనం నుంచే చక్రికి సంగీతం పట్ల మక్కువ పెరిగింది. ఆపట్టుదలతోనే ఎనిమిదో తరగతిలోనే ఫ్లూట్‌ వాయిద్యం నేర్చుకున్నాడు. ఇంటర్‌మీడియట్‌లో కర్ణాటక సంగీతం, వయోలిన్‌ నేర్చుకున్నాడు. ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో చక్రి కుటుంబం మహబూబాబాద్‌కు మకాం మార్చారు. డాక్టర్‌ కావాన్న తన తండ్రి కోరికల తో ఇంటర్‌లో బైపిసీ గ్రూప్‌లో చేరిన చక్రి చదువుపై అంతగా శ్రద్ద చూపేవాడుకాదు. అక్కడి స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చేవాడు. తన సొంత అర్కెస్ట్రా బృందంతో వినాయకచవితి, శివరాత్రి పండుగలకు ప్రదర్శనలు ఇచ్చేవాడు. 18 ఏళ్ల ప్రాయంలోనే ‘ఒకే జాతి మనదిరా…. ఒకే బాట మనదిరా….’ అనే గీతాన్ని స్వయంగా రచించి, స్వరాలు సమకూర్చాడు. తన స్నేహితులకు కొన్ని వందల స్వరాల్ని కంపోజ్‌ చేసి వినిపించేవాడు. హైదరాబాద్‌ కు వెళ్లి ప్రయత్నిస్తే పెద్ద సంగీత దర్శకుడివవుతావని స్నేహితులు ప్రోత్సహించడంతో తన కలల సాఫల్యం కోసం 1995లో హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు చక్రి.

2000 సంవత్సరంలో పూరీ జగన్నాథ్‌ ఇచ్చిన అవకాశంతో ‘బాచీ’ సినిమాకు చక్రి తొలిసారిగా సంగీతాన్ని సమకూర్చారు.

ఇటీవల విడుదలైన దాసరి నారాయణరావు చిత్రం ‘ఎర్రబస్సు’ ఆయన చివరి సినిమా. ఈ పద్నాలుగేళ్లలో 85 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. అనేక సినిమాల్లో స్వయంగా పాటలు కూడా పాడారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాలో అందించిన సంగీతంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆతర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు.

40 ప్రైవేట్‌ అల్బమ్స్‌, మూడు సినిమాలకు (విడుదల కాలేదు) సంగీతం అందించిన అనుభవం ఉన్న చక్రికి ఆదిత్య మ్యూజిక్‌లో పనిచేసే సత్యదేవ్‌ ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయమే అతన్ని బాచీ చిత్రానికి సంగీత దర్శకుడిని చేసింది. తొలి చిత్రం విజయాన్ని సాధించలేకపోయినా తర్వాతి చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రానికి పనిచేసే అవకాశాన్ని కల్పించాడు పూరి. ఈ చిత్రం విజయవంతం కావడంతో సంగీత ప్రపంచంలో చక్రి జైత్ర యాత్ర ప్రారంభమైంది. సత్యం, ఢీ. ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, సోగ్గాడు, చక్రం, దేవదాసు, దేశముదురు, కృష్ణ, నేనింతే, మస్కా, సింహ, జైబోలో తెలంగాణ వంటి చిత్రాలు సంగీత దర్శకుడిగా చక్రికి మంచి పేరు తెచ్చాయి. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో కలిపి 100 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేశ్‌ మినహా దాదాపు అగ్రహీరోలందరితో పనిచేశారు. చివరగా రవితేజ నటించిన పవర్‌ చిత్రం కోసం బద్మాష్‌ పిల్లా అనే పాటను పాడారు.

ప్రముఖ సంగీత కారుల్లో ఒకరుగా అగ్రస్థానంలో నిలిచి, పేరుగాంచిన దర్శకులు, నటీనటుల సినిమాలకు స్వరాలనందించి ఆయా సినిమాల విజయంలో తన వంతు పాత్ర పోషించారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేకుండా తన సంగీతంతో సినిమాలకు హిట్‌ అందించిన ప్రతిభాశాలి. 2003లో ‘సత్యం’ సినిమాలో ‘‘ఓ మగువా నీతో స్నేహం కోసం….’’ అనే పాటకు ఫిలిం ఫేర్‌ అవార్డు, ‘సింహా’ సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. కొత్త వారిని పరిశ్రమకు పరిచయం చేయాలని, ఎప్పటికప్పుడు కొత్త దనాన్ని కోరుకునే చక్రి ఇప్పటి వరకు దాదాపు అరవై మందిని చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వంద మందిని టాలీవుడ్‌కి పరిచయం చేయాలన్న తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు.

చక్రి సంగీత దర్శకుడనేది ఒకవైపైతే మరో వైపు తన ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎందరికో సహాయం అందించారు. ఎక్కువ సమయం సంగీత వాయిద్యాలతో గడిపే చక్రి ఎందరికో సహాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మంచి స్వరకర్తగా, స్నేహ శీలిగా పేరుగాంచిన చక్రి నలభైఏళ్లకే స్వర్గస్తులయ్యారు. అంతకు ముందు రోజు అర్ధరాత్రి వరకు స్టూడియోలో పని చేశారు. తెల్లవారుజామున శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న చక్రిని గమనించిన ఆయన భార్య శ్రావణి వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే చక్రి మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. తన అభిమానిగా పరిచయమైన శ్రావణిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న చక్రికి ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. చక్రి దంపతులకు పిల్లలు లేరు.

చక్రి సంగీత ప్రస్థానంలో ‘జైబోలో తెలంగాణ’ చిత్రానికి ప్రత్యేక స్థానముంది. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో వచ్చిన ఈ చిత్రం యావత్‌ తెలంగాణ జాతిని లక్ష్యం వైపుగా కార్యోన్ముఖుల్ని చేసింది. చక్రి కెరీర్‌లో చేసిన చిత్రాలన్నీ ఓ ఎత్తయితే ‘జై బోలో తెలంగాణ’ చిత్రం ఒక ఎత్తుగా అభివర్ణించవచ్చు. తెలంగాణ భూమి పుత్రుడిగా ఈ చిత్రానికి స్వరాలందించడం గర్వంగా ఉందని, అమర వీరులకు తాను అందిస్తున్న నివాళి ఇదేనని చక్రి ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక సందర్భంలో చెప్పారు.

2003లో చక్రి ఏకంగా 18సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వాటిలో 13 సినిమాలు విడుదలయ్యాయి. 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రవర్తి తర్వాత ఒక ఏడాది కాలంలో అత్యధిక చిత్రాలు చేసిన ఘనత చక్రికే దక్కడం విశేషం.

సినీపరిశ్రమకు తీరని లోటు: సీఎం కేసీఆర్‌

సంగీత దర్శకుడు చక్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన చక్రి మరణం రాష్ట్రానికి, సినిమా పరిశ్రమకు తీరని లోటని అన్నారు. జై బోలో తెలంగాణ చిత్రంలో తాను రాసిన ‘గారడి చేస్తున్రు…. గడిబిడి చేస్తుండ్రు….’ అనే పాటకు కూడా చక్రి సంగీతాన్ని అందిచారని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ కళాకారులు ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న తరుణంలో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, స్థానం పొంది ఎందరికో మార్గదర్శకమైన చక్రి మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని సీఎం కే. చంద్రశేఖర రావు తెలియజేశారు.

చక్రి మరణంతో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమ ఓ సంగీత ముద్దుబిడ్డని కోల్పోయిందని పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ ఘనంగా నివాళులు అర్పించింది. చక్రి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన, స్వరపరచిన పాటలు, సంగీతం ఉన్నంత కాలం ఆయన సంగీత ప్రియుల మనస్సులో సుస్థిరంగా నిలిచిపోతారు.

Other Updates