సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్! 129 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మహోన్నత సంస్థ, తెలంగాణా కొంగు బంగారంగా, దక్షిణ భారతదేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రధాన బొగ్గు ఇంధన వనరుగా, ఈ ప్రాంతంలోని స్టీలు, సిమెంటు, సిరమిక్, ఎరువులు, మందులు వంటి 2,000కు పైగా పరిశ్రమలకు బొగ్గు సరఫరాదారుగా విశేష సేవలందిస్తూ, రాష్ట్ర ప్రగతిలో, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. గతంలో కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగానే ఉన్న సింగరేణి, 2017 నుండి మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ధ గల స్వంత థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి చేస్తూ, దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న ఏకైక బొగ్గు కంపెనీగా ఖ్యాతి గడిస్తోంది.
సింగరేణి కాలరీస్ కంపెనీకి 13 దశాబ్దాల మహోన్నత చరిత్ర ఉంది. ఒక కథనం ప్రకారం భద్రాచల రామున్ని సందర్శించడానికి వెళ్తున్న భక్తులు మార్గ మధ్యలో వంట కోసం పొయ్యి రాళ్లను ఏర్పాటు చేసుకోగా అవి మండటంతో తొలి సారిగా బొగ్గు ఖనిజం ఉనికి వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నాటి బ్రిటిష్ ప్రభుత్వ జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ విలియం కింగ్ అనే జియాలజిస్ట్ ఇల్లెందు ప్రాంతంలో పరిశోధనలు జరిపి 1871వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలు
ఉన్నట్లు కనుగొన్నారు. నాటి బ్రిటిష్ పాలకుల ఆధ్వర్యంలో 1886లో హైద్రాబాద్ దక్కన్ కంపెనీ అనే సంస్థ ఇక్కడి బొగ్గు తవ్వకాలకు లండన్‌లో హక్కులు పొందింది. 1889వ సంవత్సరంలో ఇల్లెందుకు సమీపంలోని సింగరేణి వద్ధ తొలి బొగ్గు గనిని తవ్వి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుండి 1920 వరకూ హైద్రాబాద్ దక్కన్ కంపెనీ పేరుతోనే బొగ్గు తవ్వకాలు జరిగాయి.
ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న హైద్రాబాద్ దక్కన్ కంపెనీ పేరును ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా మార్చడం జరిగింది. సింగరేణి కాలరీస్ కంపెనీగా నామకరణం చేసుకొన్న ఈ రోజును గుర్తు చేసుకొంటూ, సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది కంపెనీ. 1945 సంవత్సరంలో నాటి హైద్రాబాద్ రాష్ట్ర నిజాం సింగరేణి షేర్లను కొనుగోలు చేసి సంస్థ యాజమాన్యాన్ని స్వీకరించారు. ఈ విధంగా దేశంలో తొలి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది కంపెనీ. దేశ స్వాతంత్య్రానంతరం 1950వ సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యానికి వచ్చింది. 1960వ సం||లో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా మారగా, నాటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా 49:51 షేర్ల భాగస్వామ్యంతో సింగరేణి కొనసాగుతోంది.
ఆరు జిల్లాల్లో బొగ్గు గనులు
గోదావరీ, ప్రాణహిత లోయలో ప్రకృతి ప్రసాదించిన బొగ్గు నిల్వలను దేశ అవసరాలకోసం తవ్వి తీయడానికి గోదావరి నదివెంట వివిధ ప్రాంతాలలో బొగ్గు తవ్వకాలను చేపట్టింది కంపెనీ. తొలుత 1889లో ఇల్లెందు ఏరియాలో బొగ్గు తవ్వకాలు జరిపిన కంపెనీ, తదుపరి 39 సంవత్సరాల తర్వాత 1928లో బెల్లంపల్లిలో బొగ్గు గనులను ప్రారంభించింది. మరో 9 సంవత్సరాల తర్వాత అనగా 1937లో కొత్తగూడెంలో బొగ్గు గనులను తెరిచింది. ఈ మూడు ఏరియాలు స్వాతంత్య్రం రాకముందే ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం తర్వాత 1961లో మందమర్రి, రామగుండంలోనూ బొగ్గు గనులను ప్రారంభించింది. ఆ తర్వాత 14 సంవత్సరాలకు అనగా 1975లో శ్రీరాంపూర్, మణుగూరు ఏరియాలో బొగ్గు గనులకు శ్రీకారం చుట్దింది. కాగా 1991లో భూపాలపల్లి ఏరియాలో బొగ్గు గనులను ప్రారంభించుకొంది. ప్రస్తుతం 11 ఏరియాలో వివిధ రకాల ఆధునిక టెక్నాలజీలతో బొగ్గును ఉత్పత్తి చేస్తోంది.
ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీ అమలు
సింగరేణిలో 2018-19 నాటికి మొత్తం 48 గనులుండగా వీటిలో 30 భూగర్భ గనులు, 18 ఓపెన్ కాస్టుల నుండి బొగ్గు ఉత్పత్తిని నిర్వహిస్తున్నారు. సింగరేణికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే దేశంలో వివిధ అత్యాధునిక టెక్నాలజీలను తొలిసారిగా అమలు జరిపిన కంపెనీగా దీనికి పేరుంది. అంటే మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనను తాను ఆధునీకరించుకొంటూ ముందుకు పోతోందన్నమాట. 1948లోనే జాయ్ లోడర్, షటిల్ కార్లను ప్రవేశపెట్టి యాంత్రీకరణకు శ్రీకారం చుట్టింది. అలాగే అనేక ఆధునిక పరికరాలు, యంత్రాలను తొలిసారిగా ప్రవేశపెట్టిన కంపెనీ సింగరేణియే. ప్రస్తుతం ఓ.సి. గనుల్లో వివిధ రకాల ఆధునిక టెక్నాలజీలతో బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. షవల్ డంపర్ కాంబినేషన్‌తో ఎక్కువ గనుల్లో ఉత్పత్తి సాగుతోంది. అలాగే ఇన్‌పిట్ క్రషర్ అండ్ కన్వేయర్ విధానం, డ్రాగ్‌లైన్ ఎక్విప్‌మెంట్‌తో ఓ.బి. తొలగింపు విధానం, సర్ఫేస్ మైనర్ ద్వారా కాలుష్యరహిత బొగ్గు ఉత్పతి విధానం, హైవాల్ మైనింగ్ విధానం వంటివి అమలు జరుపుతున్నారు.
ఇక భూగర్భ గనుల్లో పాత కాలంనాటి కష్టతరమైన, ప్రమాదావకాశాలు గల తట్టా చమ్మస్ విధానాన్ని క్రమంగా తొలగించి, దీని స్థానంలో సైడ్ డిస్చార్జ్ లోడర్ (ఎస్.డి.ఎల్), లోడ్ హాల్ డంపర్ (ఎల్.హెచ్.డి)లను ప్రవేశ పెట్టి,
ఉత్పత్తిని పెంచడమే కాక, ఫేస్‌లో జరిగే ప్రమాదాలను కూడా దాదాపు పూర్తిగా తగ్గించగలిగింది. అలాగే అధికోత్పత్తి సాధించే కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను, బ్లాస్టింగ్ గాలరీ బొగ్గు ఉత్పత్తి విధానాన్ని కంపెనీ అమలు చేసింది. మరీ ముఖ్యంగా సంపూర్ణ రక్షణతో అధికోత్పత్తి సాధించే లాంగ్‌వాల్ విధానాన్ని అమలు జరుపుతోంది. దీనిలో భాగంగా దేశంలోనే అతిపెద్ద లాంగ్ వాల్ మైనింగ్ యంత్ర విభాగాన్ని రామగుండం-3 ఏరియా పరిధిలోని ఆడ్రియాల లాంగ్‌వాల్ గనిలో ఏర్పాటు చేసింది.
సింగరేణి బొగ్గు ఎవరెవరికి, ఎంతెంత?
బహువిధ టెక్నాలజీలతో సింగరేణి సంస్థ ఏటా 640 లక్షల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. మరి ఇంత బొగ్గును ఎవరెవరికీ సరఫరా చేస్తున్నారు. దీనివలన కలుగుతున్న ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో అధిక భాగం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. ఒక లెక్క ప్రకారం ప్రతీ 600 గ్రాముల బొగ్గుతో 1 యూనిట్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అందించే 652 లక్షల టన్నుల బొగ్గుతో ఎన్ని కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఊహించుకోవచ్చు.
ఆ విద్యుత్తు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహంలేదు. 2018-19లో జరిగిన 676.82 లక్షల టన్నుల బొగ్గు రవాణాలో విద్యుత్తు సంస్థలకే 556.70 లక్షల టన్నులు అనగా 82 శాతం సరఫరా అయింది. కాప్టివ్ విద్యుత్ కేంద్రాలకు 37.05 (5 శాతం) లక్షల టన్నులు, సిమెంట్‌కు 29.35 (4 శాతం) లక్షల టన్నులు, స్టీలు తదితర పరిశ్రమలకు 20.37 (9 శాతం) లక్షల టన్నులు సరఫరా అయింది. ఈ విధంగా సింగరేణి బొగ్గు ఈ ప్రాంతంలోని 2000 పరిశ్రమలకు ప్రధాన ఆధారంగా ఉంటూ అభివృద్ధిలో ప్రధాన భూమిక నిర్వహిస్తోందని చెప్పొచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అత్యద్భుత అభివృద్ధి, మహారత్న కంపెనీల ధీటుగా వృద్ధి
తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గడచిన ఐదేళ్ల కాలంలో (2013-19) అత్యద్భుత ప్రగతిని సాధించి రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకే తలమానికంగా నిలిచింది. ముఖ్యంగా అమ్మకాలు, లాభాలలో తన చరిత్రలోనే ఆల్ టైం రికార్డుగా అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసి దేశంలోని 8 మహారత్న కంపెనీలు సాధించిన దానికన్న ఎంతో ఎక్కువ సాధించి తన సత్తాను చాటుకొంది.
సింగరేణి సంస్థ అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని కనపరిచింది. 2013-14లో 11,928 కోట్ల రూపాయల అమ్మకాలు జరపగా 2018-19 నాటికి ఇవి రెండు రెట్లను దాటి 25,828 కోట్ల రూపాయల ఆల్ టైం రికార్డుకు చేరుకొన్నాయి. అంటే 116.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అలాగే 2013-14లో 419 కోట్ల రూపాయల నిఖర లాభాలు గడించగా 2018-19 నాటికి ఇవి నాలుగు రెట్లు పెరిగి 1,600 కోట్ల రూపాయలకు చేరుకొన్నాయి. అంటే లాభాల్లో 282 శాతం వృద్ధిని కంపెనీ సాధించిందన్నమాట! పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమ్మకాలు : 2013-14లో 11,928 కోట్ల రూపాయల అమ్మకాలు జరుపుకొన్న కంపెనీ 2014-15లో రూ. 14,079 కోట్లు, 2015-16లో రూ. 16,325 కోట్లు, 2016-17లో రూ. 17,823 కోట్లు, 2017-18లో 21,323 కోట్ల రూపాయలు, 2018-19లో 25,828 కోట్ల రూపాయల అమ్మకాలు జరుపుకొని తన చరిత్రలో సరికొత్త మైలు రాళ్లను దాటింది.
లాభాలు : 2013-14లో 419 కోట్ల రూపాయల లాభాలను సాధించిన కంపెనీ 2014-15లో 490 కోట్లు, 2015-16లో 617 కోట్లు, 2017-18లో 1,213 కోట్లు, 2018-19లో 1,600 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించగలిగింది.
లాభాలు, అమ్మకాలలో ముందున్న సింగరేణి
దేశంలో గల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మేటిగా పేర్కొనే 8 భారీ సంస్థలను మహారత్న కంపెనీలుగా కేంద్రం గుర్తించింది. వీటిలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, ఓ.ఎన్.జి.సి, ఎన్.టి.పి.సి., గెయిల్ (ఇండియా) లిమిటెడ్, స్టీల్ ఆథారిటి ఆఫ్ ఇండియా లిమిటెడ్, బి.హెచ్.ఇ.ఎల్.లు ఉన్నాయి.
గత ఐదేళ్ల కాలంలో ఈ మహారత్న కంపెనీలు లాభాలు, అమ్మకాలలో సాధించిన వృద్ధి రేటుతో పోలిస్తే సింగరేణి వీరెవరికీ అందనంత ఎత్తున నిలబడి ఉంది. లాభాలలో వృద్ధిని పరిశీలిస్తే మహరత్న కంపెనీలలో అగ్రగామి సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ గడచిన ఐదేళ్లలో 104.5 శాతం వృద్ధిని, గెయిల్ (ఇండియా) 49 శాతం వృద్ధిని, ఓ.ఎన్.జి.సి. 36.5 శాతం వృద్ధిని, భారత పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ 31.2 శాతం వృద్ధిని, కోలిండియా లిమిటెడ్ 0.6 శాతం వృద్దిని సాధించగా సింగరేణి ఏకంగా 281.9 శాతం వృద్ధిని నమోదు చేసి లాభాల్లో అత్యున్నత శిఖరంపై నిలిచింది.
అమ్మకాలలో కూడా సింగరేణే నెంబర్-1
గత ఐదేళ్ల కాలంలో అమ్మకాలలో ”మహారత్న కంపెనీ”లతో పోలిస్తే సింగరేణి సాధించిన వృద్ధి ఎంతో ఎంతో ఎక్కువ. అమ్మకాలలో కోలిండియా 55.1 శాతం వృద్ధి, ఓ.ఎన్.జి.సి. 30.9 శాతం వృద్ధి, గెయిల్ (ఇండియా) లిమిటెడ్ 28.6 శాతం వృద్ధి, ఎన్.టి.పి.సి. 26.5 శాతం వృద్ధి, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ 24.4 శాతం వృద్ధి, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ 23.8 శాతం వృద్ధి, బి.హెచ్.ఇ.ఎల్. 2 శాతం వృద్ధినీ నమోదు చేయగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏకంగా 116.5 శాతం వృద్ధిని నమోదుచేసి 8 మహరత్న సంస్థల కన్నా ఎంతో ఉన్నత స్థాయిలో నిలబడింది.
కెసిఆర్ చొరవతో అద్భుత ప్రగతి
తెలంగాణా రాకపూర్వం రెండుసార్లు దివాలా దిశకు చేరి, చివరికి అతి కష్టం మీద ఒడ్డుకు చేరిన సింగరేణి సంస్థ, తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావించాక, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చొరవ, దిశా నిర్దేశంతో అనూహ్య ప్రగతిని సాధిస్తూ ముందుకు పోతోంది.
2014లో అధికార బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ తెలంగాణా ప్రాంత ఐ.ఎ.ఎస్. అధికారి సింగరేణి సంస్థకు చైర్మన్‌గా ఉంటే బాగుంటుందని భావించి, ఎన్.శ్రీధర్ ఐ.ఎ.ఎస్.ను సి.ఎం.డిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్రీధర్ సింగరేణిని ప్రగతి పథంలో దూకుడుగా నడిపిస్తూ ఉన్నత శిఖరాలకు చేర్చి జాతీయ స్థాయిలో నెంబర్-1 కంపెనీగా నిలపడంలో సఫలీకృతమయ్యారు.
ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులపై ప్రత్యేక అభిమానంతో వారితో రెండుసార్లు సమావేశమై అనేకానేక వరాలు కురిపించారు. వాటిని సింగరేణి తక్షణమే అమలు చేయడంతో కార్మికుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. లాభాల బోనస్ వంటివి గతంలో కార్మికులు థర్నాలు, సమ్మెలు చేస్తేనే లభించేవి. కానీ ముఖ్యమంత్రి ఇటువంటివి ఏమి అవసరం లేకుండానే గతం కన్న ఎక్కువ శాతం లాభాల బోనస్ ప్రకటించాడు. 2013-14లో 18 శాతం ఉన్న లాభాల బోనస్, 2014-15లో 21 శాతానికి, 2015-16లో 23 శాతానికి, 2016-17లో 25 శాతానికి, 2017-18లో 27 శాతానికి పెంచి ఇచ్చారు. ఈ చర్యలు కార్మికులకు ఎంతో ఉత్సాహన్ని కల్గించాయి.
ఇవేకాక ముఖ్యమంత్రి ఆదేశంపై కొత్త గనుల ప్రారంభం, కారుణ్య నియామకాల ద్వారా వారసులకు ఉద్యోగాలు, స్వంత ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న 10 లక్షల రూపాయల రుణంపై వడ్డీ చెల్లింపు, మృతి చెందిన కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటు 10 రెట్లు పెంపు, కొత్త కార్టర్లు, క్యాంటీన్ల ఆధునీకరణ, వంటి పనులు అనేకం చేపట్టడం జరిగింది.
ముఖ్యమంత్రి ఆదేశానుసారం సి.ఎం.డి. ఎన్.శ్రీధర్ ప్రత్యేక శ్రద్ధతో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో హైద్రాబాద్‌కు చెందిన ప్రధాన ఆసుపత్రుల నుండి సూపర్ స్పెషాలిటీ వైద్య బృందాలను రప్పించి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు సేవలను అందింపచేశారు. కాలనీల సమస్యల పరిష్కారానికి మీ కోసం, మీ చెంతకు కార్యక్రమం, నిరుద్యోగ
యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించడానికి సింగరేణి ఆణిముత్యాలు మెగా జాబ్‌మేళా, కార్మికుల ఆరోగ్య పరిరక్షణ ఉద్దేశంతో అన్ని ఏరియాల్లో యోగా సెంటర్ల ఏర్పాటు, పెద్ద ఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవాల నిర్వహణ వంటివి చేపట్టారు. వీటికి వేశేష స్పందన లభించింది.
అంతేకాదు కోట్లాది రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గనుల్లోకి కార్మికులు నడిచివెళ్లి వచ్చే భారాన్ని తగ్గించడానికి అన్ని గనుల్లో మ్యాన్‌రైడింగ్ సిస్టంలను ఏర్పాటు చేయడం జరిగింది. పాతకాలం నాటి బాత్‌రూంల స్థానంలో ఆధునిక బాత్‌రూంలు, పిట్‌మీద రెస్టు షెల్టర్లు, లాకర్ల ఏర్పాటు జరుగుతోంది. అన్ని ఆసుపత్రులను ఆధునీకరించి, ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చడంతో పాటు వార్డులన్నింటినీ ఎ.సి. వార్డులుగా మార్చడం జరిగింది. అన్ని ఏరియాల్లో అందమైన పార్కుల నిర్మాణం, స్విమ్మింగు ఫూల్స్, జిమ్స్, యోగా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగ
యువతకు సింగరేణి సేవా సమితి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశ శిక్షణలు అనేకం ఇప్పించడం జరుగుతోంది. ఏరియాల్లో ఇచ్చే శిక్షణలతో పాటు హైద్రాబాద్‌లో ఆర్.టి.సి. డ్రైవింగ్ సెంటర్లో హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ శిక్షణ, జి.ఎం.ఆర్. కంపెనీలో సోలార్ ప్యానల్ టెక్నీషియన్ ట్రైనింగ్, ఎస్.సి. కార్పోరేషన్ ద్వారా ఇచ్చే వివిధ రకాల శిక్షణలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటి వలన అనేకమంది యువకులు, యువతులు శిక్షణ పూర్తి చేసుకొని ఉపాధి పొందుతున్నారు. మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ప్రారంభించుకొని లభ్ధిపొందుతున్నారు.
ఇదిలా ఉంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి ఆదేశంపై సింగరేణిలో గల వివిధ రకాల ఖాళీలను గుర్తించి డైరెక్టు రిక్రూట్‌మెంటును, కేవలం ప్రతిభ ఆధారిత, రాత పరీక్ష ద్వారా చేపట్టడం జరిగింది. అలాగే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడం జరిగింది.
9,597 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వీరిలో ఎక్స్‌టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,025 మంది, డిపెండెంటు, కారుణ్య నియామకాల ద్వారా 6,572 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇవే కాక ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా 2,501 మందికి పదోన్నతులు కల్పించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్ట మొదటి సారిగా ఉద్యోగావకాశాలు కల్పించిన సంస్థగా సింగరేణి గుర్తింపు పొందింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత యువ ఉద్యోగులు సింగరేణిలో చేరడంతో గనుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది.
జాతీయ, అంతర్జాతీయ అవార్డులు
సింగరేణి సంస్థ ఉత్పత్తిలో సంక్షేమంలో పర్యావరణహిత చర్యలో చేపడుతున్న కృషిని గుర్తించిన ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కొన్ని అనేక అవార్డులను ప్రకటించాయి. ఆసియా ఫసిఫిక్ ఎంటర్ ప్రైన్యూర్‌షిప్ అవార్డు, అవుట్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు, ఎక్స్‌లెన్ ఇన్‌కాస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు, బెస్ట్ సేవా అవార్డు, బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు, ఏసియాస్ మోస్ట్ ట్రస్ట్‌డ్ కంపెనీ అవార్డు, ఎక్స్‌లెన్స్ ఇన్ ఫర్ఫార్మెన్స్ అవార్డు, అత్యధిక జి.ఎస్.టి. పేఈ అవార్డు, పర్యావరాణ చర్యలకు గుర్తింపుగా ఇనోవేటివ్ గోల్డెన్ పీకాక్ అవార్డులు లభించాయి.
13 దశాబ్దాల చరిత్రగల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన స్వంత రాష్ట్రమైన తెలంగాణాను బంగారు తెలంగాణాగా రూపుదిద్దడానికి తన వంతు బాధ్యతగా తగినంత బొగ్గు, తగినంత విద్యుత్తును అందిస్తూ సహకరిస్తూ రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా వ్యాపార విస్తరణతో పైకెదుగుతూ, దేశంలోని పరిశ్రమలన్నింటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ తెలంగాణా కీర్తిని దశదిశాల వ్యాపింపజేస్తూ ముందుకు పోతోంది.