తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నిర్మించతలపెట్టిన అంతరాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగిన పూర్తి చేసుకోవాలని తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ణయించుకున్నారు. ముంబాయిలోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రులు ఇద్దరూ ఫిబ్రవరి 17న సమావేశమయ్యారు. మంత్రులు టి. హరీష్‌రావు, జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, వేణుగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎంపీలు బి. వినోద్‌కుమార్, బిబి పాటిల్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇఎన్‌సి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య వున్న నీటిపారుదల ప్రాజెక్టులు త్వరితగిన పూర్తి చేసుకొని రెండు రాష్ట్రాల్లో రైతులకు సాగునీరు అందిచాలని, ప్రజలకు తాగునీరు అందించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి గోదావరి నదీ జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తీర్మానించుకున్నారు. భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు, కోర్టు కేసుల పరిష్కారం, ముంపు ప్రాంత ప్రజల అభ్యంతరాలు తదితర అంశాలను చర్చించి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడానికి వీలుగా రెండు రాష్ట్రాల నిపుణుల కమిటీని నియమించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
లెండి ప్రాజెక్టుకు సంబంధించి 2003 లోనే కుదిరిన అవగాహన మేరకు పనిచేసుకుని ఆరు టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రెండు రాష్ట్రాల రైతులకు మళ్లించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. మహారాష్ట్రలో 12 గ్రామాలు ముంపునకు గురవుతుండగా అందులో 11 గ్రామాల్లో భూసేకరణ
పూర్తయ్యిందని, 6 గ్రామాల్లో నష్ట పరిహారం కూడా చెల్లించామని అధికారులు చెప్పారు. మిగతా గ్రామాల్లో కూడా భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు త్వరగా పూర్తి చేయాలని కెసిఆర్ కోరారు. నష్ట పరిహారానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి త్వరితగతిన తాము చేయాల్సిన పనులు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలనే డిమాండ్‌ను కూడా తాము ఒప్పుకుంటున్నామని, ఇప్పటికే రూ. 500 కోట్లను కూడా వెచ్చించామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు.
లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. రెండు రాష్ట్రాలలో ఎంతో ఉపయోగమైన ఈప్రాజెక్టువల్ల కొంత అటవీ భూమి ముంపునకు గురవుతుందని, నష్టపరిహారంగా మరోచోట భూమి ఇవ్వాలని కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. రాజాపేట, రుభా, పివర్డ్‌ల వద్ద బ్యారేజ్‌లు కట్టడానికి అంగీకారానికి వచ్చారు.
ప్రాణహిత`చేవెళ్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. దీనికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గోదావరి నదిలోని 160 టిఎంసిల నీటిని తెలంగాణ వాడుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే గడ్చిరౌలి, చంద్రాపూర్ జిల్లాల్లోని దాదాపు 30 గ్రామాల్లో 740 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతున్నదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు.
దీనికి స్పందించిన తెలంగాణ సీఎం కెసిఆర్ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత`చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ సరిగా లేదని, ముంపు ముప్పు ఎక్కువగా లేకుండానే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు వెల్లడిరచారు.
ఆ తరువాత ముఖ్యమంత్రులిద్దరు రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రక్కప్రక్క రాష్ట్రాలైన తెలంగాణ`మహారాష్ట్రలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరి స్తాయని మహారాష్ట్ర సిఎం చెప్పారు. మూడు ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామని, పరస్పరం సంప్రదించుకుంటూ ముందుకు పోతామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆకాంక్షలు, అవసరాలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని, నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని ప్రక టించారు. పొరుగు రాష్ట్రాలతో ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణపూరిత వాతావరణం కొనసాగించేది లేదని చెప్పారు. ముంపును తగ్గించుకుంటూ, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకుంటూ తెలివిగా వ్యవహరించాల్సిఉందన్నారు. అంతరాష్ట్ర ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసే విషయంలో సాను కూలంగా స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
పుట్టినరోజు వేడుకలకు పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకోసం కెసిఆర్ ముంబాయిదాకా వచ్చారని ఫడ్నవీస్ అభినందించారు. మహాశివరాత్రి పండుగనాడు కూడా రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించు కోవడంకోసం సమయం కేటాయించినందుకు ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ముంబయిలో కె.సి.ఆర్. జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముంబయిలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోది ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ట్విట్టర్‌లో కూడా కె.సి.ఆర్.కు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు.
గవర్నర్ నరసింహన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉదయాన్నే ఫోన్ చేసి కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు దంపతులు కేక్ తెప్పించి కెసిఆర్‌తో కట్ చేయించారు.
ముఖ్యమంత్రి గౌరవార్థం తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందానికి గవర్నర్ లంచ్ ఏర్పాటు చేశారు. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ముంబయిలోని ప్రసిద్ద సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబయిలో కెసిఆర్‌కు మంత్రులు హరీష్ రావు, జోగురామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, పాటిల్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, నీటిపారుదల శాఖ కార్యదర్శి జోషి, ఇఎన్‌సి మురళీధర్, రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి తదితరులు స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు.