సర్వమానవాళి పాపప్రక్షాళనకు అవనిపై అవతరించిన కరుణామయుడిని ఆరాధించే ప్రార్థనా మందిరం… ప్రశాంతతకు నిలయం…
శాంతి, ప్రేమ, అహింస, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం…
కరువు కాలంలో అన్నార్తులను ఆదుకున్న అమృతహస్తం… నిరుపమాన సేవలకు నిలువెత్తు నిదర్శనం…
విదేశీ నైపుణ్యం, కళాత్మక నిర్మాణ కౌశలంతో కనువిందు చేసే అత్యద్భుత కట్టడం… ఎల్లలు దాటి సందర్శకులను ఆకర్షిస్తూ పర్యాటక కేంద్రంగా దినదిన ప్రవర్థమానమవుతున్న ప్రముఖ పర్యాటక కేంద్రం.
అతిసుందర మందిరంగా… ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చర్చిగా… రెండో వాటికన్‌గా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్ చర్చి విశేషాలివి.
నిర్మించి 90 వసంతాలైనా చెక్కుచెదరని అందాలతో సుందర మందిరంగా అలరారుతోంది… మెతుకుసీమకు తలమానికంగా భాసిల్లుతోంది.
సప్తసముద్రాలు దాటి… గోల్కొండ ఓడలో వచ్చి
విఖ్యాత మెదక్ కెథడ్రల్ చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ ఫాస్నెట్. 1870లో ఇంగ్లాండ్ దేశంలోని షఫిల్డ్ అనే నగరంలో జన్మించిన ఆయన అక్క ఎమ్లీ ఫాస్నెట్ ప్రోత్సాహంతో మెథడిస్ట్ సంఘంలో పాస్టర్‌గా అభిషేకం పొందారు. ఏసుప్రభువు అపర భక్తుడుగా మారిన ఫాస్నెట్ సువార్త సేవలందించేందుకు సప్తసముద్రాలు దాటి 1895లో ఇండియాకు వచ్చారు. అప్పట్లో లండన్-మద్రాసు మధ్య రాకపోకలు సాగించే ‘గోల్కొండ’ ఓడలో ఆరు నెలలు ప్రయాణించి మద్రాసు చేరుకున్నారు. అక్కడ కొంత కాలం ఉన్నాక క్రైస్తవ మత ప్రచారం ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్‌కు వచ్చారు. కొన్నాళ్ల తర్వాత గ్రామీణ ప్రాంతంలో సువార్త సేవలందించాలన్న తన అకాంక్ష మేరకు 1897లో ఫాస్నెట్‌ను హైద్రాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ పట్టణంలోని చిన్నదైన చాపెల్ చర్చికి బదిలీ చేశారు. ఈ చర్చి పక్కనే ఉన్న రెండంతస్థుల భవనంలో ఫాస్నెట్ నివాసం ఉండేవారు. ఒక రోజు తన బంగళాపై పచార్లు చేస్తున్న క్రమంలో పక్కనున్న చర్చిని చూసి తన ప్రభువు మందిరమైన చర్చి చిన్నగా ఉండటం… తాను అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న భవనంలో నివసించడం అపరాధంగా భావించాడు. అపుడే ఏసుప్రభువుకు పెద్ద చర్చి నిర్మించాలని సంకల్పించారు.
పనికి ఆహారం ప్రాతిపదికన
అది 1908 సంవత్సరం. అప్పట్లో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు లేవు… పంటలు సాగుచేసే పరిస్థితి లేదు… పనులు లేక ఉపాధి కరువైంది. చేసేందుకు పనులు లేక, తినేందుకు తిండి కరువై వేలాది మంది ప్రజలు ఆకలి దప్పులతో అలమటించారు. ఈ పరిస్థితి చూసి ఫాస్నెట్ చలిం చారు. అన్నార్తులను ఆదుకోవాలని తలంచారు. ఏసుప్రభువుకు పెద్ద ప్రార్థనా మందిరం నిర్మించాలన్న ఆలోచనలో ఉన్న ఫాస్నెట్ ఇటు కరుణామయుడికి ఆలయం నిర్మించడం… అటు కరువు పీడితుల ఆకలి తీర్చడం లక్ష్యంగా చర్చి నిర్మాణానికి పూనుకున్నాడు. బర్మా నుంచి బియ్యం, ఆహార పదార్థాలు తెప్పించి పనికి ఆహారం ప్రాతిపదికన చర్చి నిర్మాణ పనులు జరిపించారు. 1910లో మొదలైన చర్చి నిర్మాణం 1924 వరకు కొనసాగగా అంతకాలం ఎంతో మందికి చేతినిండా పని దొరికింది.
200 నమూనాలు
చర్చిని చాలా పెద్దగా, సుందరంగా నిర్మించాలని తలంచిన ఫాస్నెట్ సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం చర్చి నిర్మాణ నమూనా రూపకల్పన కోసం ఇంగ్లాండ్ వెళ్లి ఇంజనీర్ అయిన తన మిత్రుడు బ్రాడ్‌షాను కలిసి తన ఆలోచనను ఆయన ముందుంచాడు. ఈ మేరకు బ్రాడ్‌్‌షా తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో సృజనాత్మకంగా ఆలోచించి చర్చి నిర్మాణానికి 200 నమూనాలు గీసి ఇచ్చాడు. వాటిని తీసుకుని మెదక్ తిరిగి వచ్చిన ఫాస్నెట్ ఏ నమూనా ప్రకారం చర్చి నిర్మించాలన్న ఆలోచనలో పడిపోయాడు. ఒకరోజు చర్చి నిర్మించాలనుకుంటున్న ప్రదేశంలో ఒక ఎత్తయిన గుట్టపై 200 నమూనాలు ఉంచి ఏసుక్రీస్తును ప్రార్థించాడట. అతను ప్రార్థన ముగించే సరికి
గాలికి నమూనా కాగితాలన్నీ ఎగిరిపోయి చివరకు ఒక నమూనా మాత్రమే అక్కడ మిగిలిందట. అది దైవకృపగా భావించి, ఆ ఏసు ప్రభువే ఆ నమూనాను ఎంపిక చేశారని తలంచి దాని ప్రకారం చర్చి నిర్మాణం ప్రారంభించారు.
173 అడుగుల ఎత్తు
చర్చిని 180 అడుగుల ఎత్తుతో నిర్మించాలని ఫాస్నెట్ తలంచారు. ఈ మేరకు చర్చి నిర్మాణ అనుమతి కొరకు నిజాంకు దరఖాస్తు సమర్పించారు. కాగా నిజాం రాజ చిహ్నంగా ఉన్న హైద్రాబాద్‌లోని చార్మినార్ ఎత్తు 175 అడుగులు కాగా అంతకంటే ఎక్కువ ఎత్తులో చర్చి నిర్మించేం దుకు అనుమతించలేదు. దీంతో 173 అడుగుల ఎత్తుతో చర్చి నిర్మించేందుకు ఫాస్నెట్ నిర్ణయించారు. చర్చి ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగులు కాగా వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగులు ఉంది. చర్చి పూర్తిగా రాతితో డంగుసున్నం వినియోగించి ఎంతో పటిష్టంగా నిర్మితమైంది.
గోతిక్ శైలి: చర్చి అంతర్భాగం ప్రాచీన రోమ్ నిర్మాణ శైలి అయిన గోతిక్ శైలిని పోలి ఉంటుంది. విశాలమైన ప్రధాన ప్రార్థనా మందిరం పైకప్పు, ప్రాకారాలు, ప్రధాన వేదిక, ఎత్తైన స్తంభాలు, ప్రవేశ ద్వారాలు వాస్తు శిల్పి థామస్ ఎడ్వర్డ్ , దేశ, విదేశీ నిర్మాణ రంగ నిపుణుల పర్యవేక్షణలో కళాత్మకంగా నిర్మితమయ్యాయి. చర్చిలోపల నేలపై ఆకర్షణీయమైన ఫ్లొరింగ్ కోసం ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ, నలుపు రంగు రాళ్లను వేశారు. ఏ కాలంలో అయినా చల్లగా ఉండటం, అడుగుల శబ్దం కూడా రాకపోవడం ఈ బండరాళ్ల ప్రత్యేకత. మహాదేవాలయంలో ప్రధాన వేదికపై పరిశుద్ధ బల్ల వెనుక గోడకు అమర్చిన పాలీష్ స్టోన్‌ను ఇటలీ నుంచి తెప్పించారు. చర్చిలో ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అటంకం కలుగకుండా ఉండేందుకుగాను రీసౌండ్ రాకుండా రబ్బరు, పత్తి, పలు రకాల రసాయనాలు వినియోగించి చర్చి కప్పును ఎకో ప్రూఫ్ చేయించడం విశేషం.
అద్దాల కిటికీల్లో క్రీస్తు జన్మవృత్తాంతం
చర్చి నిర్మాణంలో నేటి ఇంజనీర్ల ఊహకందని నిర్మాణ నైపుణ్యాలు ఒక ప్రత్యేకత అయితే, అద్దాల కిటికీలు మరో ప్రత్యేకత. క్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఎంతో కళాత్మకంగా కళ్లకు కట్టేలా అద్దాల కిటికీల్లో పొందుపరచడం విశేషం. ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఓ. సాలిస్ బరి స్టేయిన్ గ్లాస్ ముక్కలతో ఈ కిటికీలకు రూపకల్పన చేశారు. మూడు దశల్లో వీటిని ఏర్పాటు చేశారు. ముందుగా 1927లో చర్చిలో ఎదురుగా ఉన్న వేదికపై ఉన్న కిటికీ అద్దాల్లో క్రీస్తు ఆరోహణకు సంబంధించిన దృశ్యాలు పొందుపర్చారు. ఆ తరువాత 1947లో చర్చిలో కుడివైపున ఉన్న కిటికీ అద్దాల్లో ఏసుప్రభువు జననానికి సంబందించిన దృశ్యాలు, 1958లో క్రీస్తు శిలువపై వేలాడుతున్న దృశ్యాలు పొందుపరిచారు.బయటి నుంచి సూర్యకాంతి ప్రసరించినపుడు మాత్రమే చర్చిలోపల నుంచి చూస్తే కిటికీ అద్దాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు అగుపించడం ప్రత్యేకత.
కలప పనితనం… కళాత్మకం
కరుణామయుడి మందిరంలో ఆర్చీలు, పైకప్పు, ఫ్లోరింగ్ మాత్రమే కాదు… వేదికపై బల్లలు, కుర్చీలు సైతం ఎంతో కళాత్మకంగా ఉంటాయి. ప్రధాన వేదికపై ఉండే ప్రభు భోజనపు బల్ల రంగూన్ టేకుతో కళాత్మకంగా తయారుచేయబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పఠన వేదిక దేవదారు కర్రతో పక్షిరాజు రూపంలో ఎంతో అద్బుతంగా మలచారు. జెకొస్లొవేకియా దేశానికి చెందిన కలప పనివారు చాలా రోజుల పాటు శ్రమించి దీనిని అసలైన పక్షిని తలపించేలా రూపొందించడం వారి పనితనానికి నిదర్శనం. గురువులు ఆసీనులయ్యే బల్లలు, కుర్చీలు గులాబీ కర్రతో తయారు చేశారు.
ఏడుగురు బిషప్‌లు
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్‌ఐ) పరిధిలో మొత్తం 22 డయాసిస్‌లు ఉన్నాయి. అందులో మెదక్ డయాసిస్ ఒకటి. 1947 సెప్టెంబరు 30న ఇది ఆవిర్భవించింది. దీని పరిధిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మెదక్ బిషప్‌లుగా ఏడుగురు పనిచేశారు. తొలి బిషప్ రెట్ రెవరెండ్ ఫ్రాంక్ విటకర్ కాగా ఏడవ బిషప్‌గా టి.ఎస్.కనకప్రసాద్ 2012 వరకు పనిచేశారు. ప్రస్తుతం సి.ఎస్.ఐ. డిప్యూటి మాడరేటర్ రెట్ రెవరెండ్ దైవాశీర్వాదం మెదక్ డయాసిస్ ఇంచార్జి బిషప్‌గా కొనసాగుతున్నారు.
అంగరంగవైభవంగా క్రిస్మస్ సంబరాలు
1924 డిసెంబర్ 25న ఆసియాఖండంలోనే అతిపెద్ద చర్చిగా పేరొందిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా క్రైస్తవ సోదరులు తరలివచ్చి రక్షకుడి ఆగమనం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.