సౖౖెబరాబాద్ షీటీమ్స్‌కు ఏడాది పూర్తి
తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేసిన ”షీటీమ్స్” మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపింది. వారికి తమ రక్షణపై పూర్తి భరోసానిచ్చింది. తాము ఉద్యోగరిత్యా, ఇతర పనుల కోసం రాత్రిళ్ళు బయటకు వెళ్ళినా ఎలాంటి ఆపద వాటిల్లదనే దృఢ నమ్మకాన్ని వారిలో కల్పించింది. ఇలా మహిళలకు ధైర్యాన్ని నింపుతూ తమ కర్తవ్య నిర్వహణలో ఒక వసంతం పూర్తి చేసుకున్న సైబరాబాద్ ”షీటీమ్స్” డిసెంబరు 13న హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అంతకుముందు షీ వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎం.పీ. కల్వకుంట్ల కవిత, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సినీ నటి జయసుధలతో పాటు వందలాది మంది మహిళలు, యువతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగినులకు భద్రత కల్పించడంలో సైబరాబాద్ షీటీమ్స్ సఫలమయ్యాయన్నారు. ఇప్పుడు నగరంలో మహిళలు తాము పురుషులతో సమానంగా ముందుకు దూసుకెళ్ళగలమనే విధంగా ఉద్యోగ, వ్యాపార రంగాలలో ముందుంటున్నారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనడానికి షీటీమ్స్ ఏర్పాటు నిదర్శనమన్నారు. మహిళలు సంతోషంగా ఉన్నపుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాలతో దేశంలోనే మొట్టమొదటిసారిగా షీటీమ్స్ ఏర్పాటుకు తెలంగాణ పోలీసుశాఖ శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ఏర్పాటు మంచి ఫలితాలను సాధించిదన్నారు. మహిళలు, యువతులు తమకు ఇబ్బందులు ఎదురైనపుడు ఎలాంటి సంకోచం లేకుండా షీటీమ్స్‌కు ఫోన్ చేయాలన్నారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ షీటీమ్స్‌ను వారు ఉపయోగించుకుని పోకిరీల భరతం పట్టాలని పిలుపునిచ్చారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో హైదరాబాద్ సేఫ్‌జోన్‌గా పేరు తెచ్చుకుందన్నారు. మహిళలను వేదిస్తూ మూడు సార్లు పట్టుబడితే వారిపై నిర్భయ ఆక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు 120 మందిపై కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. హైదరాబాద్ సేఫ్‌జోన్‌గా భావించి ఎందరో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత హైదరాబాద్‌లో స్థిరపడాలని అభిప్రాయపడుతున్నారంటే ఇక్కడ రక్షణ బాగుందని స్పష్టమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆకతాయిల ఆటకట్టించిన ఐదుగురు మహిళలకు షీ అవార్డులు బహూకరించారు.