సమాజంలో సగంగా ఉన్న మహిళల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు కల్పించింది. మహి ళలకు భద్రత కల్పించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఈవ్ టీజింగ్, యాసిడ్ దాడులవంటి సంఘటనలు కలవరపరుస్తున్నాయి. అందుకే మహిళల భద్రత, రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ విషయంలో సూచనలకోసం ప్రభుత్వం మహిళా అధికారులతో ఒకమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనలు కూడా చేసింది. అలాగే, హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతకోసం, ఈవ్‌టీజింగ్ అరికట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.
మహిళల భద్రతకోసం చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 10 కోట్లు కేటాయించారు.
గర్భిణీలు, బాలింతలు, శిశువుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 221 కోట్లు కేటాయించారు. ఇది సమైక్య రాష్ట్రంలో ఓట్ ఆన్ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కంటే 300 శాతం అధికం. పి.సి.డి.ఎస్. పథకం క్రింద రూ. 1103.88 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
గ్రామీణ ప్రాంత పేద మహిళలు అందరికీ ఎల్.పి.జి. కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లు ప్రతిపాదించారు.