tsmagazineభారతదేశం గర్వించదగ్గ నాయకుల్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రముఖులని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొనియాడారు. మహోన్నత వ్యక్తిత్వం కలవాడని అన్నారు. ప్రపంచ దేశాలలో దేశఖ్యాతిని ఇనుమడింపచేసిన వ్యక్తి అన్నారు. ఎన్ని క్లిష్ట సమస్యలు ఎదురైనా తన వ్యక్తిత్వం, చతురతతో సులువుగా పరిష్కరించేవాడన్నారు.

తెలంగాణ శాసనమండలి సమావేశం సెప్టెంబరు 27న జరిగింది. ఈ సమావేశంలో భారత మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, మాజీ లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ, ధ్వన్యనుకరణ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్‌ల మృతిపై సంతాపం ప్రకటిస్తూ కేసీఆర్‌ తీర్మానాలు ప్రతిపాదించారు. వాటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రతిపక్ష నాయకులు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, బీజేపీ రాంచందర్‌రావులు వారి గురించి మాట్లాడారు. తీర్మానాలను బలపరిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వేణుమాధవ్‌ గురించి, పాతూరి సుధాకర్‌రెడ్డి వాజ్‌పేయి గురించి, కర్నె ప్రభాకర్‌ కరుణానిధి గురించి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమనాథ్‌ చటర్జీ గురించి మాట్లాడారు. అలాగే కొండగట్టు మృతులకు, కేరళ వరద బాధిత మృతులకు కూడా సభ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ వాజ్‌పేయి, కరుణానిధి, సోమ్‌నాథ్‌ చటర్జీ, వేణుమాధవ్‌ల వ్యక్తిత్వం, పరిపాలన పటిమ, వారి కళలను కొనియాడారు.

వాజ్‌పేయి లోక్‌సభలో తన తొలి ప్రసంగంలోనే ఆ నాటి ప్రధాని పండిట్‌ నెహ్రూను ఆకట్టుకొన్నారన్నారు. ఎప్పటికైనా ప్రధానమంత్రి అవుతావని నెహ్రూ వాజ్‌పేయిని అభినందించారంటే ఆయన ప్రసంగం ఎంత ప్రభావితం చేసేదిగా ఉందో అర్దమవుతుందన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయినప్పుడు ఆయన లోక్‌సభలో చేసిన ప్రసంగమే తరువాత వచ్చిన ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చిందన్నారు. ప్రతిపక్ష నాయకులతో కూడా ప్రశంసించబడ్డ నాయకుడు వాజ్‌పేయి అన్నారు. అమెరికా బెదిరింపులకు భయపడకుండా పోక్రాన్‌ అణుపరీక్షలు నిర్వహించాడన్నారు. మన రాష్ట్రానికి వస్తే హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైలు ప్రతిపాదనలు పీఎంగా ఆయనే ఆమోదించారని గుర్తుచేశారు.

tsmagazineతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గురించి కేసీఆర్‌ మాట్లాడుతూ ఆయన ఓటమి ఎరుగని నాయకుడని అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా తను నమ్మిన సిద్ధ్దాంతానికి కట్టుబడి ఉన్నారన్నారు. ఆ సిద్దాంతాలకు కట్టుబడే తన తల్లితండ్రులు పెట్టిన పేరు దక్షిణామూర్తి నుంచి కరుణానిధిగా మార్చుకున్నాడని తెలిపారు. కరుణానిధి పోరాటం వల్లనే ముఖ్యమంత్రులకు స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగురవేసే అవకాశం దొరికిందన్నారు.

tsmagazineమాజీ లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ గురించి మాట్లాడుతు ప్రముఖ పార్లమెంటేరియన్‌గా పేరుతెచ్చుకున్నాడని కొనియాడారు. స్పీకర్‌గా ఉన్నపుడు చట్టసభలపై కోర్టుల పెత్తనాన్ని సున్నితంగా విమర్శించాడన్నారు.

tsmagazineనేరెళ్ళ వేణుమాధవ్‌ తమ తెలంగాణ ముద్డుబిడ్డ అన్నారు. ధ్వన్యనుకరణ ప్రక్రియలో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడన్నారు. వేణుమాధవ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా కూడా ఒక పర్యాయం పనిచేశాడన్నారు. ఆయన ప్రతిభతో మన తెలంగాణ గడ్డకు కూడా పేరు సంపాదించిపెట్టారన్నారు.

వీరందరికీ కేసీఆర్‌ ఘనంగా నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అనంతరం సభ నిరవదికంగా వాయిదా పడింది.

Other Updates