cm-kcrబంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 3న క్యాంపు కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులు, మాజీ పోలీస్‌ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ముందుగా వారితో కలసి భోజనంచేసిన ముఖ్యమంత్రి, అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మాజీసైనికుల సహకారం కావాలన్నారు.
కరీంనగర్‌ జిల్లా చిన్న ముల్కనూరులో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొనడం ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని తీసుకువెళ్ళిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ సైనికులకు కొన్ని వరాలను సి.ఎం ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు చెల్లిస్తున్న గౌరవభృతిని 3వేల రూపాయల నుంచి 6 వేల రూపాయలకు పెంచుతున్నట్టు సి.ఎం ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన మాజీ సైనికులకు బహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో కొంత శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెంది, ప్రతిభ కనబరిచిన సైనికులను వచ్చే రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ఘనంగా సన్మానిస్తామని కె.సి.ఆర్‌ చెప్పారు. వచ్చే బడ్జెట్లో మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.

మాజీ సైనికులు తన దృష్టికి తెచ్చిన సమస్యలు చాలా చిన్నవని, వాటన్నింటినీ ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని, జిల్లాల వారీగా మాజీ సైనికులు ఇచ్చిన సమస్యలను క్రోడీకరించి ఇవ్వాలని చెప్పారు. భవిష్యత్తులో మాజీ సైనికులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వుండి పనిచేసేందుకు ఆరుగురి పేర్లు సూచించవలసిందిగా సి.ఎం కోరారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమం, తదనంతర పరిణామాలు, తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ముందు గల పరిస్థితులు, ఆ తరువాత రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు.

‘‘ఈ రోజు తెలంగాణ వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు పునాది అవుతుంది. అందుకే ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు గుర్తించింది. సాగునీటి విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో తీరని అన్యాయం జరిగింది. అది సవరించడానికి సరైన ప్రణాళిక ఉండాలి. మన నీళ్ళు మన హక్కు. అవి మనకు వచ్చి తీరాలి. అందుకే నీటిపారుదల ప్రాజెక్టులను రీ డిజైనింగ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడింది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

2018 నాటికి మిగులు విద్యుత్‌ కు రంగం సిద్ధమైందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని, వాటర్‌ గ్రిడ్‌ వంటి మంచి పథకాలకు హడ్కో, నాబార్డు వంటి సంస్థలు నిధులు అందించేందుకు ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి తెల్పారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సందేశాన్ని విన్న మాజీ సైనికోద్యోగులు రాష్ట్ర పునర్‌ నిర్మాణంలో తామూ భాగస్వాములమవుతామని ముందుకు వచ్చారు. అంతకు ముందు జిల్లా నుంచి వచ్చిన ప్రతినిధుల సమస్యలపై మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంత రావు ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాజీ సైనికులకు ఈ విధంగా ఆతిథ్యం ఇచ్చిఆదరించలేదని లక్ష్మీకాంతరావు చెప్పారు. ఈ సందర్భంగా గ్రూప్‌ కెప్టెన్‌ డి.జె.రావు రచించిన ‘బంగారు తెలంగాణ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కెప్టెన్‌ ఎం.ఎస్‌.రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాధన ఉద్యమంలో మాజీ సైనికులు కూడా పాలుపంచుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

ఈ సమావేశంలో డి.జి.పి అనురాగ్‌ శర్మ, సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ కలనల్‌ పి.రమేష్‌ కుమార్‌, సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శ్రీనేశ్‌ కుమార్‌, రిటైర్డ్‌ ఐ.జి వి.భాస్కర్‌ రెడ్డి, సి.రత్నారెడ్డి, తదితరులు కూడా పాల్గొన్నారు.

Other Updates