tsmagazine
మన రాష్ట్రంలో ఐటీరంగం దినదిన ప్రవర్ధమానమవుతోంది.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కె. తారకరామారావుల ప్రత్యేక చొరవతో అనేక సంస్థలు దేశంలోనే మొదటిసారిగా తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించి వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాయి. తెలంగాణ ప్రభుత్వం నాలుగున్నరేండ్లలో చేపట్టిన అనేక చర్యలతో దేశవిదేశాలలోని ఎన్నో కంపెనీలు,హైదరాబాద్‌ లో తమ కంపెనీలను నెలకొల్పడానికి తరలివస్తున్నాయి. ఇందుకు మరో తార్కాణం ప్రముఖ సెమీ కండక్టర్‌ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన మైక్రాన్‌ టెక్నాలజీ సంస్థ త్వరలోనే హైదరాబాద్‌లో భారీ ఎత్తున తన కార్యకలాపాలను చేపట్టనున్నది.

ఈ సంస్థ ఇప్పటికే చైనా, జపాన్‌, మలేషియా,సింగపూర్‌, తైవాన్‌ లలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఇపుడు భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌తో, మైక్రాన్‌ సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ డ్రేక్‌, డైరెక్టర్‌ అమరేంద్‌ సిధూలతో కూడిన ప్రతినిధి బృందం సమావేశమైంది. హైదరాబాద్‌లో రూ.300 కోట్ల పెట్టుబడితో 1,000మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్టు వివరించారు. ఈ కంపెనీ విస్తరణ కోసం మాదాపూర్‌లో సుమారు 1.80 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. మైక్రాన్‌, క్రూసియల్‌, బాలిస్టిక్‌ వంటి అనేక గ్లోబల్‌ బ్రాండ్లను తమ కంపెనీ కలిగి ఉన్నదని, మెమొరీ ఆధారిత టెక్నాలజీలు తమ సొంతమని ఈ బృందం వివరించింది. రానున్న రోజుల్లో తమ కంపెనీ నూతన టెక్నాలజీని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, అటానమస్‌ వెహికిల్‌ రంగాల్లో విస్తృతంగా వినియోగించుకొనేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నది.

తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా, వేగంగా పనిచేస్తున్న తీరు, పెట్టుబడి స్నేహపూర్వక విధానాలు, తాము హైదరాబాద్‌నే కేంద్రంగా ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణాలు అని బృందం సభ్యులు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌, టీహబ్‌, టీవర్క్‌ ్సతో కలిసి పనిచేస్తామని మైక్రాన్‌ ప్రతినిధులు వెల్లడించారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికకు క్రియాశీలంగా స్పందించిన తీరుపై కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

మైక్రాన్‌ సంస్థ తమ కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడంపై మంత్రి కేటీఆర్‌ వారికికృతజ్ఞతలు తెలిపారు. సంస్థ కార్యకలాపాల నిర్వహణకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Other Updates