జ్యోతిష్కుడా చేతుల గీతలు చూసి కలిగే భాగ్యం గురించి చెబుతావు
మరి చేతులు లేని మనుషులు కూడ ఉన్నారు, వారికేం చెబుతావు
— గాలిబ్ (ఉర్దూ నుంచి తెలుగు ‘ఆలం హైదరాబాది’)
చేతులు లేని వానికి సాయం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు మానవతను తలుచుకుంటే మహాకవి గాలిబ్ కవిత గుర్తుకు రాక మానదు. భువనగిరికి చెందిన కనకస్వామిది విషాద గాథ. చేతులు లేని మనిషాయన. ఓ ప్రమాదంలో రెండు చేతులు పోయాయి. పాములపర్తిలో బంధువుల ఇంటికి వచ్చాడు. హఠాత్తుగా ఆ ఊరికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాకడ విషయం తెలిసింది. కేసిఆర్ సభకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కృత్రిమ చేతులు పెట్టించాలని వేడుకున్నాడు. దానితో చలించిపోయిన సీఎం వెంటనే అవి పెట్టించడానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించి తనతో పాటు కనకస్వామిని కాన్వాయ్‌లో తీసుకెళ్లారు. మరో ఇద్దరు వికలాంగుల భార్యలు బోయిని సావిత్రి, వడ్ల మమత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు.
అనుకోని అతిథిలా వచ్చారు
అడిగినవన్నీ ఇచ్చారు..
మెదక్ జిల్లాలో అది ఒక పల్లెటూరు. గజ్వేల్ నియోజకవర్గం లోనిది. పేరు పాములపర్తి. ఆ ఊరి వారి ఊహకు అందని రీతిలో అనుకోని అతిథి తమ గ్రామానికి రావడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఆయన ఎవరో కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ముఖ్యమంత్రి వర్గల్ మండలంలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారని పాములపర్తి జనానికి తెలిసింది. మే 9న మర్కూక్ గ్రామంలో పర్యటించి పాములపర్తి పక్కనుంచే వెళుతున్నారని తెలిసి ‘‘సార్! మా ఊరికి కూడా రాండ్రి’’ అంటూ ఆ ఉరోళ్లంతా కలిసి కార్లనాపి సిఎం కేసిఆర్‌తో విన్నవించుకున్నరు.ఆయన యధావిధిగా ‘‘వస్తనే’’ అనుకుంటూ పక్కూరికి పయనమయ్యారు.
నిత్యం పకడ్బందీగా భారీ బందో బస్తులో తిరిగే సిఎం తాము అడగంగనే వస్తడా అనుకున్న పాములపర్తి వాసులకు నమ్మకం కుదురలేదు.ఎటొళ్లు అటు ఎళ్లిపోయిండ్రు. మాట మీద నిలబడే మనిషి కనుక సీఎం మాట నిలబెట్టుకుని అన్నంత పని చేశారు.
నిజానికి ఆరోజు మిట్ట మధ్యాహ్నం. పిట్టల అలికిడిలేదు, పశువుల గిట్టల చప్పుడు లేదు. మరో వైపు ఎర్రటి ఎండ మండి పోతుంది. పొలం పనులు లేకపోవడం ఆ ఊరి జనం సాంతం ఇంటి పట్టునే ఉండి పోయారు. ఊరి పెద్ద మనుషులు ఎటూ తొయ్యక ఆ ఊరిమధ్యలో ఉన్న కచ్చీరు కాడికి చేరి బాతాఖానిలో మునిగిపోయారు.
ఆ ఇంటమ్మ ఈ పొరిగింటమ్మ కలిసి వడియాలు, వరుగులు, తొక్కులు పెట్టుకోవడంలో మునిగి పోయారు. దూరంగా కార్ల చప్పుడు వినపడడంతో ఒక్కసారి నోరు వెళ్లబెట్టి ముక్కున వేలేసుకున్నారు. ఉన్నట్టుండి ఆ ఊరుకి ఎన్నడూ ఊహించని అతిథి యాళ్లకానీ యాళ్లలో రావడంతో ఊరు ఊరంతా పట్టలేని సంతోషం పాలైంది. సరిగా మే10న మధ్యా హ్నం 2:30 గంటలకు సీఎం కేసిఆర్ ఆ ఊరికి వచ్చారు. ఒక చెట్టునీడ చూసుకుని కుర్చీలో కూర్చుని జనంతో మాట ముచ్చట మొదలు పెట్టారు. 45 నిమిషాలు అది సాగింది. ఆ ఊరి జనమంతా తమ ఊరి కష్టాలన్నిటినీ చెప్పుకున్నారు. ఒక్కొక్కటే శ్రద్ధగా విన్న కేసీఆర్ అన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. అక్కడికక్కడే పశు వైద్యశాల, రూ. 50 లక్షలతో కమ్యూనిటీ హాల్, ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణం. రూ. 10 లక్షలతో వైకుంఠధామం. రెండు అంగన్ వాడి కేంద్ర భవనాల నిర్మాణం, సీసీ రోడ్లు, మురుగు కాల్వల కోసం నిధులు మంజూరు చేశారు.మూడు బోర్లు, పంపుసెట్ల బిగింపు, పంచాయితీ భవనానికి రెండు అదనపు గదుల నిర్మాణం, రెండు హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, బస్‌షెల్టర్, పోచమ్మ, బీరప్ప, ఆలయాల వరకు మట్టి రోడ్ల నిర్మాణంతోపాటు పాతూరులో పైపులైన్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే ఊరిలో 150 ఇండ్లతో బలహీన వర్గాలకు కాలనీ నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘‘మీరు కోరిన పైకం ఇస్తున్న ఊరును బాగు చేసుకునే జిమ్మేదారి మీదేనని’’ అక్కడి జనం తో స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్.