భగవంతుని దశావతారాలలో పరిపూర్ణమైంది కృష్ణావతారం. కృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు. దేవకీవసుదేవుల ముద్దుబిడ్డగా శ్రావణకృష్ణ అష్టమినాడు ఈ మహాపురుషుడు జన్మించినందువల్ల ఈ దినాన ‘కృష్ణజయంతి’ని పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఒక సంప్రదాయం అయింది.
శ్రీకృష్ణుడు చిన్నతనంలో నందగోకులంలో పెరిగాడు. వ్యవసాయానికీ, పశుసంపదకూ, పాడిపంటలకూ నెలవైన వాతావరణంలో గోపబాలకుల మధ్య పెరిగిన కృష్ణుడు చిన్నతనాన పాలు, పెరుగు, వెన్న వంటి వాటిని ఆరగించేవాడనీ, గోపకాంతల మధ్య రాస క్రీడలు జరిపే వాడనీ కథలు ప్రచారంలో ఉన్నాయి. భారతీయేతిహాసాలలో ఒకటై, పురాణంగా కూడా ప్రసిద్ధి చెందిన భాగవతంలో శ్రీకృష్ణుని లీలా విశేషాలు విస్తృతంగా వర్ణింపబడినాయి. భూలోకంలో దుష్టుల ఆగడాలు పెరిగిపోయాయి, సాధుజనులను నానా బాధలకు గురిచేశారు. దుష్ట రాజులు ప్రజలను పీడిస్తూ ఇబ్బందులపాలు జేశారు. ఆ సమయంలో దేవతలు వైకుంఠానికి వెళ్ళి భూలోకానికి వచ్చిన ఆపదను నిర్మూలించేందుకు అవతరించాలని మహావిష్ణువును ప్రార్థించారు. వారి ప్రార్థనలను మన్నించిన మహావిష్ణువు తన పరిపూర్ణాంశతో భూలోకంలో కృష్ణునిగా అవతరించి, దుష్ట సంహారం చేసి, మానవాళికి శాంతిని చేకూర్చినాడు. కనుక కృష్ణుని జననం లోకానికి యోగక్షేమదాయకంగా మారింది.
కృష్ణుడు ఒక విలక్షణమైన అవతార పురుషుడుగా సంకీర్తితుడైనాడు. ఉత్తమ మానవునిగా ఎన్నో ఆదర్శాలను చాటి చెప్పడమే గాక, భగవంతునిగా మాయలను చూపి అందరినీ ఆశ్చర్య చకితులను చేశాడు. ద్వాపరయుగంలో క్రూర రాక్షసుల బాధ తీవ్రంగా ఉండేది. ఎందరో రాక్షసులు శకటాసురులుగా, బకాసురులుగా, కంస, చాణూరాది దుష్టపాలకులుగా, పూతనాదులుగా జన్మించి, అమాయకులను హింసించారు. తమ మద గర్వంతో చెలరేగిపోయారు. వాళ్లందరినీ నియంత్రించి, వధించి, భూ లోకానికి క్షేమాన్ని అందించాడు
శ్రీ కృష్ణుడు. దేవకీ గర్భంలో జన్మించినా, యశోదా దేవి ప్రియ పుత్రునిగా పెరిగాడు. అతని లీలలన్నీ పైకి ఆటల వలె కనబడినా, వాటివెనుక పరమార్థాన్ని ప్రబోధించేవిగా ఉండేవి.
బాల్యంలో పాలు, వెన్నలను దొంగిలించి, ఆరగించడంలో సమస్తమూ భగవదర్పణకే అనే పరమార్థం ద్యోతకం అవుతుంది. బాలునిగా మట్టిని తిని, తన
ఉదరంలో సకలలోకాలూ ఉన్నాయనీ, సర్వాంతర్యామిని తానే అనీ చాటి చెప్పాడు కృష్ణుడు. గోపికలందరూ కృష్ణునిలోని భగవంతుణ్ణి చూసి, ప్రేమించారు. అతనితో ఆడి, పాడి ఆనందాన్ని అనుభవించారు. రాసక్రీడల వెనుక గల పరమార్థం భగవంతునిలో తాదాత్మ్యం చెందడమే జీవిత పరమార్థం అనే సత్యం ఆవిష్కృతమైంది.
శ్రీకృష్ణుడు కేవలం బాల్య క్రీడలతోనే తన అవతార లక్ష్యాన్ని ముగించలేదు. లోకంలో అధర్మ వర్తనులను నిర్మూలించి, ధర్మ మార్గ ప్రవర్తకులను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. దుష్టులైన కౌరవులు ధర్మవర్తనులై పాండవుల సంపదలను కపటంతో అపహరించి, వారిని అడవుల పాలు చేసినప్పుడు కృష్ణుడు వారికి అండగా నిలిచి, ధర్మాన్ని కాపాడాడు. ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్న పాండవులకు చేయూతనందించి, దుష్టులకు శాస్తి చేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మంవైపే నిలిచి, పాండవుల విజయానికి కారణమైనాడు.
సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపే విధంగా భగవద్గీతను అర్జునునికి బోధించి, మ¬పకారం చేశాడు. శ్రీకృష్ణుడు బోధించిన గీత నేటికీ ప్రపంచ మానవాళికి నిత్య పఠనీయ గ్రంథం అయిందంటే అంతా శ్రీకృష్ణుని అనుగ్రహమే.
శ్రీకృష్ణాష్టమి నాడు ప్రపంచ వ్యాప్తంగా వైష్ణవాలయాలలో విశేష పూజలు జరుగుతాయి. బాల బాలికలందరూ కృష్ణ వేషధారులై, గోపికా వేషధారులై కృష్ణ లీలలను ప్రదర్శిస్తారు. పాలు, పెరుగులను నింపిన ఉట్లను కట్టి, వాటిని కొడుతూ, కృష్ణుని లీలా వినోదాలను గుర్తు చేసుకొంటారు. భక్తి గీతాలతో నృత్యగానాదులతో కృష్ణ భక్తిని ప్రకటిస్తారు. పన్నెండు మంది ఆళ్వార్లు కృష్ణ భక్తులే. వారిలో కులశేఖరుడనే రాజు కూడా ఉన్నాడు. అతడు అకుంఠిత కృష్ణ భక్తుడు. ఆయన రచించిన ‘ముకుందమాల’ అద్భుత కృష్ణ స్త్రోత్రంగా ఆదరింపబడుతున్నది. అందులోని ఒక శ్లోకం కృష్ణునిపై సర్వ విభక్తుల సంబోధనతో కూడినదై, అందరినీ ఆకట్టుకొంటున్నది –
‘కృష్ణో రక్షతు నో జగత్ త్రయగురుః కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మైనమః
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేత దఖలం హే కృష్ణ! రక్షస్వమామ్
కృష్ణుని మురళీగానం వలె అతని రూపం జగన్మోహనం. నెమలి పింఛాన్ని తలపై దాల్చి, కౌస్తుభాది హారాలను దాల్చి, తన ఆట పాటలతో ప్రపంచాన్ని అలరింపజేసిన కృష్ణుడంటే అందరికీ ఒక ఆకర్షణ! అతని వేణుగానంలో సకల భువనాలూ తన్మయత్వంలో ఓలలాడేవని ప్రాచీన గాథలు చెబుతున్నాయి.
ధర్మపక్షపాతిగా, జగద్రక్షకునిగా, మోహనాకారునిగా తత్త్వోపదేష్టగా, నీతి మార్గ సంధాయకునిగా, ఆదర్శ మిత్రు నిగా, ఇష్ట సఖునిగా, ఆపదుద్ధారకునిగా, వనితామాన సంరక్షకునిగా, యోగిగా కృష్ణుడు ఈ లోకానికి అనేక విషయాలలో మార్గదర్శకుడై చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు.
గోపాలకునిగా అతని రూపం సాధుజన సంరక్షక పాత్రను ప్రకటిస్తుంది. సకల జీవకోటిని చల్లగా కాపాడిన అవతారమూర్తి శ్రీకృష్ణుడు. అతని జన్మదినాన్ని జన్మాష్టమి అని కూడా పిలవడం పరిపాటి. కృష్ణుడు అందించిన ఆదర్శాలను అనుసరించడమే కృష్ణునికి మానవాళి అర్పించే నివేదన!
తిగుళ్ళ అరుణ కుమారి