మానవ జీవితం భగవంతుడు ప్రసాదించిన అమోఘ వరం. దానిని మనిషి తన జీవితకాలంలో మంచి పనులను చేయడం ద్వారా సార్ధకం చేసుకోవాలి. మనిషి పుట్టుక, చావు రెండూ అతని ఆధీనంలో ఉండవు. కేవలం బ్రతుకుతున్నంతకాలం చేసే కర్మలే అతని ఇష్టాయిష్టాలతో జరగుతుంటాయి. మనిషి ఏది చేస్తే అతనికీ, సమాజానికీ మేలు జరుగుతుందో తెలుపడానికి ఎందరో అవతారపురుషులు ఉద్భవించారు. మహాత్ములు జన్మించారు. జగద్గురువులు ప్రభవించారు. వారు తమ జీవితాలను లోకం కోసం త్యాగం చేసి, వెలుగుదివ్వెల వలె నిలిచిపోయారు. అలాంటి మహనీయులలో ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు ఎంతో ముఖ్యులు. వీరు ఇద్దరూ పరమోన్నతజ్ఞానాన్వేషణలో, పరతత్త్వపరిశోధనలో ఎన్నో సత్యవిషయాలను లోకానికి అందించారు. మానవాళి జ్ఞానతృష్ణను తీర్చి, ఆధ్యాత్మిక శిఖరాధిరోహరణకు సోపానాలు నిర్మించారు. ఫలితంగా ఆది శంకరాచార్యుల సిద్ధాంతం ‘అద్వైతం’గానూ, రామానుజాచార్యుల సిద్ధాంతం ‘విశిష్టాద్వైతం’గానూ లోక ప్రసిద్ధిని గాంచింది.
ఆదిశంకరాచార్యులు క్రీ.శ. 788లో కేరళ రాష్ట్రంలోని ‘కాలడి’లో ఆర్యాంబాశివగురువులకు శివానుగ్రహ ఫలంగా జన్మించారని ఐతిహ్యం. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి క్రీ.శ. 829లో అవతారాన్ని చాలించారని చరిత్ర చెబుతోంది. కారణజన్ములైన ఆదిశంకరాచార్యులు పుట్టిన ఏడాదిలోపే చక్కగా మాటలు నేర్చాడనీ, రెండవ ఏటనే రాయడం, చదవడం ప్రారంభించాడనీ, మూడవ ఏటనే పురాణాలు, కావ్యాలూ, ఇతిహాసాలూ ఆపోశన పట్టాడనీ గాధలు చెబుతున్నాయి. ఇంతటి అపారమేధాశాలికి త్వరగా ఉపనయనం చేయాలని అతని తండ్రి సంకల్పించాడు. కానీ దురదృష్ణవశాత్తు తండ్రి తనువు చాలించాడు. తండ్రి మరణానంతరం ఐదవ ఏట ఆదిశంకరాచార్యులకు ఉపనయన సంస్కారం జరిగింది. ఆ తరువాత అతడు గురుకులానికి వెళ్లి, వేదాలూ, శాస్త్రాలూ చదువుకొన్నాడు. ఎనిమిదేళ్ల వయస్సు వచ్చేసరికి ఆదిశంకరులకు వేదాలూ, శాస్త్రాలూ సమగ్రంగా వచ్చాయి. ఆ తరువాత జ్ఞానాన్వేషణ కోసం సాంసారిక జీవితాన్ని చేపట్టకుండా బాల్యంలోనే సన్యాసాన్ని స్వీకరించాడు. దేశమంతటా పర్యటిస్తూ నర్మదానదీతీరంలో ఉన్నగౌడ పాదాచార్యుని శిష్యుడైన గోవింద భగవత్పాదాచార్యుణ్ణి ఆశ్రయించి ఆయన దగ్గర జ్ఞానాన్ని ఉపదేశంగా పొందాడు. గురువు ఆదేశానుసారం బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించాడు. ఆ తరువాత కాశీనగరానికి చేరుకున్నాడు. అతనిలోని జ్ఞానతేజస్సుకు ఎందరో ఆకర్షితులయ్యారు. కాశీలోనే సనందుడనే శిష్యుడు ఆదిశంకరుల పిలుపుపై నదీ జలాలపై నడుచుకుంటూ వచ్చి పద్మపాదుడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు. ఒక మూగవాడైన శిష్యుడు అతని దరిజేరగా, అతణ్ణి కరతలామలకంతో (అరచేతిలో ఉసిరికపండును ప్రసాదించి) అతనికి మూగతనాన్ని పోగొట్టాడు. అతడే హస్తామలకుడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు. మరొక శిష్యుడైన కాలనాథుడు ఆదిశంకరులను త్రోటక ఛందస్సులో స్తుతించి త్రోటకాచార్యుడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు.
ఆ తరువాత కర్మమార్గం ఒక్కటే గొప్పదని వాదించే కుమారిలభట్టుతో వాదించడానికి ఆదిశంకరులు సిద్ధం కాగా, కుమారిల భట్టు కోరికపై అతని శిష్యుడైన మండన మిశ్రునితో వాదించడానికి ఆదిశంకరులు పూనుకున్నారు. అనేక దినాలపాటు జరిగిన వాదప్రతివాదాలతో మండన మిశ్రుణ్ణి ఓడించి అతనికి సురేశ్వరాచార్యుడు అనే పేరుపెట్టి తన ప్రధాన శిష్యునిగా స్వీకరించాడు. ఇలా తన సిద్ధాంతానికి చేరువైన నలుగురు శిష్యులు, పద్మపాద – హస్తామలక – త్రోటక – సురేశ్వరాచార్యులను నాలుగుదిక్కులలో నాలుగు పీఠాలకు అధిపతులుగా చేసి, తాను ప్రతిపాదించిన అద్వైతమార్గాన్ని విశ్వవ్యాప్తం చేశాడు.
ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతానికి బ్రహ్మసత్యం, జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నా పరః, అనే మూడు సూత్రాలు ప్రాణ ప్రదాలు. ‘బ్రహ్మ సత్యం’ అంటే ఈ విశ్వమంతా నిండి ఉన్నది బ్రహ్మమే అనీ, ఆ బ్రహ్మం ఒక్కటే సత్యమనీ, శాశ్వతమనీ అర్థం. ‘జగన్మిథ్యా’ అంటే ఈ కనబడే జగత్తు అంతా మాయ అనీ, అది ఉన్నట్టు కనపడుతున్నా, దానికి శాశ్వతత్వం లేదనీ అర్థం. ‘జీవోబ్రహ్మైవ నాపరః’ అంటే జీవుని రూపంలో ఉన్న మనిషి బ్రహ్మలోని భాగమే కానీ వేరుకాదు అని అర్థం. ఈ మూడు సిద్ధాంతాలే ప్రధాన భూమికలుగా అద్వైత వేదాంతాన్ని ఆదిశంకరాచార్యులు విస్తరించారు. ఈ జగత్తు అంతా ‘రజ్జుసర్పభ్రాంతి’ (తాడును చూచి పాము అనుకొని భయపడినట్లు) ఉంటుందని ఆదిశంకరులు అంటారు. మసక చీకటిలో దారిలో కనబడిన తాడును చూచి, బాటసారి పాముగా భావించి, భయంతో పరుగు తీస్తాడు. కానీ, ఒక లాంతరు తెచ్చి, దాని వెలుగులో చూచినప్పుడు అది పాముకాదనీ, తాడు అనీ తెలుసుకొంటాడు. అప్పుడు అతనిలోని భయం పోతుంది. అలాగే కళ్లకు కనబడే ఈ ప్రపంచం కూడా శాశ్వతంగా ఉంటుందని భ్రాంతి కలుగుతుంది. కానీ, కొన్ని యుగాల తరువాత అదంతా ప్రళయంలో అంతరించిపోయిన తరువాత దృశ్యం మారిపోతుంది. కనుక జగత్తు సత్యం కాదనీ, అశాశ్వతమనీ, బ్రహ్మపదార్థం ఒక్కటే నిత్య సత్యమనీ ఆదిశంకరుల సిద్ధాంతం. ఇదే అద్వైతమతంగా లోకంలో వ్యాప్తి చెందింది.
ఆదిశంకరులు మనిషికి రెండు విధాలుగా ముక్తి లభిస్తుందని ప్రతిపాదించాడు. మనిషి జీవించి ఉండగానే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటే జీవన్ముక్తుడు అవుతాడు. అలా జీవితకాలంలో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత మరణించిన వాడికి విదేహముక్తి (మళ్లీ దేహరూపంలో జన్మలేకుండా) లభిస్తుందనీ, అప్పుడు జీవుడు బ్రహ్మలో లీనం అవుతాడనీ చెప్పాడు.
ఇంతటి అపూర్వజ్ఞానాన్ని అద్వైత సిద్ధాంతరూపంలో లోకానికి అందించిన ఆదిశంకరులు తన 32వ ఏట హిమాలయాలకు పయనమై కేదారనాథ క్షేత్రంలో తనువు చాలించి, బ్రహ్మలో లీనం అయ్యారని ప్రసిద్ధి. ఆదిశంకరులు సాక్షాత్తూ శంకర స్వరూపులే అని ‘శంకరః శంకరః సాక్షాత్’ అని లోకం అంతా ప్రస్తుతిస్తోంది!
రామానుజులు
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అందించిన రామానుజాచార్యులు క్రీ.శ. 1017లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జన్మించారు. చిన్నతనంలోనే కాంచీపురంలోని యాదవ ప్రకాశుని దగ్గర వేదాంత విద్యను అధ్యయనం చేశాడు. ఆ తరువాత తన సిద్ధాంతంతో అతణ్ణి ప్రభావితుణ్ణి చేశాడు. అనంతర రామానుజాచార్యులు కంచిలో పెరియనంబి అనే గురువు దగ్గర వేదాంతాన్ని అధ్యయనం చేశాడు. వివాహానంతరం కొంతకా లానికి విరక్తి చెంది సంసారాన్ని పరిత్యజించి, సన్యాసాన్ని స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడ గోష్ఠిపూర్ణుడనే ఆచార్యుణ్ణి ఆశ్రయించి, తనకు తారకమంత్రాన్ని ఉపదేశించుమని కోరాడు. అయితే గోష్ఠిపూర్ణుడు ఒక షరతుపై తారక మంత్రోపదేశం చేస్తానన్నాడు. అదేమంటే – ‘తాను ఉపదేశించే తారకమంత్రాన్ని ఇతరులెవ్వరికీ ఉపదేశించకూడదు’ అని. ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే నరకానికి పోతావని హెచ్చరించాడు. రామానుజాచార్యులు అందుకు అంగీకరించి, తారక మంత్రోపదేశాన్ని పొందాడు. కానీ, గురువుకు ఇచ్చిన వాగ్దానాన్ని భంగంచేసి, శ్రీరంగంలోని రంగనాథాలయం దగ్గర తారకమంత్రాన్ని అందరికీ బహిరంగంగానే ఉపదేశించాడు. అప్పుడు గురువు మండిపడగా – ‘స్వామీ! నేను చేసిన ఈ మంత్రోపదేశం వల్ల ఈ జనులందరూ వైకుంఠానికి వెళ్లే అవకాశం లభించింది కదా! నేను ఒక్కణ్ణి నరకానికి పోతే నష్టం ఏమిటి?’ అని సమాధానం చెప్పి, లోకాన్ని ఉద్ధరించాడు. గురువు అతని లోకోపకారదృష్టికి ఆశ్చర్యచకితుడైనాడు.
ఆ తరువాత రామానుజాచార్యులు నలభై సంవత్సరాలు శ్రీరంగంలోనే రంగనాథాలయానికి అధిపతిగా సేవలను అందించి, యావత్ భారతదేశాన్ని పర్యటించి, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నాడు. రామేశ్వరం నుండి బదరీనాథ్ వరకు అన్ని దిక్కులా జనపదాలను పర్యటించి, తన జ్ఞాన ప్రబోధంతో మేల్కొలిపాడు. ఈ కాలంలోనే బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యాన్ని రచించాడు. ఇది విశిష్టాద్వైతసిద్ధాంతానికి పరమప్రామాణికంగా భాసిస్తున్నది. ఆ తరువాత భగవద్గీతాభాష్యాన్ని రచించాడు. వేదాంత సారం, వేదాంతదీపం, శరణాగతిగద్యమ్, వైకుంఠగద్యమ్ వంటి ఉత్తమ రచనలు చేసి, లోకానికి మార్గదర్శనం చేశాడు.
రామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతంలో బ్రహ్మ సత్యమేకానీ, జగత్తూ, జీవాత్మలూ మిథ్యకాదని ప్రబోధించాడు. బ్రహ్మం, జీవాత్మ, జగత్తూ ఈ మూడూ సత్యపదార్థాలే అనేది రామానుజుల సిద్ధాంతం. జీవాత్మ-పరమాత్మలు చిత్‌స్వరూపాలే. అయినా జీవాత్మవేరు. పరమాత్మ వేరు. పరమాత్మ సూర్యునిలాంటివాడు. జీవాత్మ సూర్యునిలోని కిరణంలాంటివాడు. సూర్యుణ్ణి విడిచి కాంతి కిరణాలు నిలువలేవు. అలాగే పరమాత్మను విడిచి జీవాత్మ నిలువలేదు. పరమాత్మ సర్వస్వతంత్రుడు. అతడు ఎవరి అధీనంలోనూ ఉండడు. జీవాత్మ పరతంత్రుడు. అతడు స్వయంగా ఏదీ చేయలేడు. పరమాత్మకు అధీనుడై కర్మలు చేస్తాడు.
రామానుజులు భక్తి మార్గాన్ని విశేషంగా ప్రచారం చేశారు. భక్తి ఒక్కటే మోక్షానికి సాధనం అనీ, కర్మజ్ఞానాలు భక్తి మార్గాన్ని సుగమం చేస్తాయనీ ప్రవచించాడు. భక్తిలేని కర్మజ్ఞానాలు వృథా అని రామానుజుల సిద్ధాంతం.
రామానుజులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతంలోని ప్రధాన సూత్రాలు మూడు – ఒకటి చిత్తు. రెండవది అచిత్తు. మూడవది ఈశ్వరుడు. చిత్తు అణురూపంలో ఉంటుంది. దానినే ఆత్మ అనీ, జీవాత్మ అనీ అంటారు. దేహంకంటే, ఇంద్రియాల కంటె, మనస్సుకంటె భిన్నమైంది జీవాత్మ. మనిషిలో ‘నేను’ అనే చైతన్యమే ఆత్మ. జీవాత్మ స్వతంత్రుడు కాదు. పరమాత్మకు అధీనుడు. జీవాత్మలోని అజ్ఞానం అతణ్ణి వివిధ కర్మల ఆచరణకు పురికొల్పుతుంది. అలా చేసే కర్మలలోని లోపాలవల్ల, దోషాలవల్ల జీవాత్మ మళ్లీ మళ్లీ పుడుతూ, మరణిస్తూ ఈ సంసార చక్రంలోనే తిరుగాడుతూ ఉంటాడు. సుఖదుఃఖాలకు బద్ధుడైపోతాడు. అచిత్తు అంటే ప్రకృతి. జగత్తుకు ఇది సూక్ష్మరూపమై భాసిస్తుంది. పరమేశ్వరుని మాయతో ఇది స్థూల రూపాన్ని ధరిస్తుంది. నామరూపజగత్తుగా ఆవిర్భవిస్తుంది. ఈ ప్రకృతి సత్త్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలతో కూడి ఉంటుంది. మొదట మహత్తు, దాని నుండి అహంకారం, మనస్సు పుడతాయి. వాటినుండి పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు ఏర్పడుతాయి. జీవాత్మ ప్రకృతికి శరీరం అయితే ఈ రెండు ఈశ్వరునికి శరీరం అవుతాయి.
ఈశ్వరుడు వైకుంఠంలో దివ్యమంగళ విగ్రహుడై ఉంటాడు. అతడే మహావిష్ణువు. శేషతల్పంపై పడుకొని యోగ నిద్రాముద్రలో ఉంటాడు. శ్రీదేవి, భూదేవి అతని భార్యలు. అతణ్ణి నవవిధ భక్తులతో కొలిస్తే మోక్షం లభిస్తుంది. శ్రవణం (భగవత్కథలు వినడం), కీర్తనం (భగవన్మహిమలను గానం చేయడం), స్మరణం (భగవన్నామాన్ని స్మరించడం), పాదసేవనం (భగవంతుని పాదాలను మొక్కడం, అర్చించడం), అర్చనం (వివిధోపచారాలతో పూజించడం), వందనం (భగవంతునికి ఎల్లప్పుడూ నమస్కరించడం), దాస్యం (భగవంతుని దాసునిగా భావించుకొని సేవలు చేయడం), ఆత్మనివేదనం (శరణాగతితో మనస్సును భగవంతునికి అర్పించడం) అనేవి నవవిధ భక్తి మార్గాలు. భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి ఒక్కటే సులభోపాయం. భక్తికి తోడ్పడేది ప్రపత్తిమార్గం. ప్రపత్తి అంటే శరణాగతి. అన్నింటినీ భగవంతునికే అర్పించి, అతణ్ణే కాపాడుమని కోరడమే శరణాగతి భగవద్గీత కూడా – ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః’ అని ఈ ప్రతిపత్తి మార్గాన్నే ప్రబోధించింది. ఇలా రామానుజుల విశిష్టాద్వైతం లోకరంజకమై జీవాత్ములను తరింపజేస్తున్నది.
ఆదిశంకరులు, రామానుజులు ఇద్దరూ తమ తమ సిద్ధాంతాలతో లోకుల మనస్సులను ఆకట్టుకొన్నారు. ఈ భవబంధాలనుండి మానవులను తరింపజేశారు. ఈ మహనీయులు ఇద్దరూ వైశాఖమాసంలోనే జన్మించడం విశేషం. వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరుల జన్మదినం కాగా, వైశాఖ శుద్ధ షష్ఠి రామానుజుల జన్మదినం. ఈ ఇరువురు జగద్గురువులనూ లోకం ఇలా స్తుతించింది.
ఆదిశంకరస్తుతి
శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్
నమామి భగవత్పాదశంకరం లోకశంకరమ్
రామానుజ జయంతి
యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే
అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే!
ఈ ఇద్దరు జగద్గురువులకూ వందనం! అభివందనం!!
– డా|| అయాచితం నటేశ్వర శర్మ