tsmagazine

ప్రపంచీకరణ ప్రభావం వలన ఆధునిక పోకడలు మారుమూల పల్లెల్లోకి విస్తరించి వ్రేళ్లూనుకొని పోయాయి.గ్రామీణ జీవన విధానం మారింది. పల్లెల రూపురేఖలు మారిపోయాయి. చేతి వత్తులు కళ తప్పాయి. ఇళ్లూ వాడలూ బోసిపోయాయి.ప్రజల జీవితం సంక్షోభం లోకి నెట్టబడింది.పల్లె తన అస్థిత్వాన్నే కోల్పోయింది. ఈ పరిస్థితులలో స్పందించిన కవి హదయం నుండి వచ్చిన అద్భుత కవిత్వం ‘ మల్లెచెట్టు చౌరాస్తా’.

ఈ మల్లెచెట్టు చౌరాస్తాలో తనకు మొలిచిన జ్ఞాపకాలకు ప్రేరణ నిచ్చిన సంఘటనలకు తన కవిత్వంతో అనిలగీతం ఆలపించాడు కవి వేణు.

”నాలుగు గోడల మధ్య క్రొవ్వత్తి లాగా కరిగిపోతూ సమాజానికి వెలుగును పంచే అస్తమయం కాని సూర్యుడు” అంటూ తన వత్తి లో భాగంగా రోజు చూస్తున్న న్యాయ మూర్తిని ”ది జడ్జ్‌” కవితలో కొత్తగా పరిచయం చేసాడు.

”ప్రేమకు చిహ్నంగా నిలిచి అఖండ కీర్తి కండువాను కప్పిన తాజ్‌ మహల్‌ తనువంతా రాయే కదా” అంటూ రాయి గొప్పతనాన్ని చెపుతూ ” పర్యావరణానికి అండగా నిలిచిన కొండల్ని వ్యాపారం పేరిట కనుమరుగు చేస్తున్న తీరును చూసి ”ప్రతి కంట కన్నీరు పెడుతోంది కదరా ” అంటూ తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్త పరుస్తాడు.” అప్పులు తీర్చలేని రైతుల ఆత్మహత్యలు వాస్తవం ” అంటూ రైతు వాస్తవ బ్రతుకులను మన కళ్ళముందు చిత్రించాడు. ”విలువైన దేదో విడచి తడిలేని జీవితానికి వలసపోతున్నాడు ” అంటూ మనిషి యాంత్రిక అసంబద్ధ జీవితానికి కవిత్వరూపమిచ్చాడు. మానవీయ కోణంలో సాగిన వేణు కవిత్వం పాఠకుల హదయాల్లో కదలిక కలిగిస్తుంది.

అభివ్యక్తీకరణలో నూతనత్వం ,కళాత్మక మైన కవితా నిర్మాణంతో మమత వేణు మల్లెచెట్టు పరిమళాలు చౌరాస్తా నాలుగు వైపులా గుభాళిస్తూనే ఉంటాయి.

– గుళ్ళపల్లి తిరుమల కాంతికష్ణ

Other Updates