manasa-sarovaramఊహించి రాసేవాటికన్నా వున్నదున్నట్లు రాయడమనేది చాలా క్లిష్ఠమైన సంగతని తెలుసు. తేదీలు, సమయం, ప్రయాణం, బస, సందర్భం, సంఘటనలు వగైరాలన్నీ బాగా గుర్తుపెట్టుకుని రాయాలి కాబట్టి అనుకున్నంత యీజీకాదు. తన కుటుంబం, బంధుమిత్రులు, బాల్యం, విద్య, ఉద్యోగంలాంటి అన్ని విషయాలతో యింతకుముందే రెండు పుస్తకాలు ప్రచురించి ప్రశంసలు పొందిన కన్నోజు మనోహరాచారి తన మూడవ పుస్తకంగా, తాను ఆగస్టులో సందర్శించిన అద్భుత మానస సరోవరయాత్ర గురించి ‘కైలాస మానస సరోవర యాత్ర-నా జ్ఞాపకాలు’ అనే మరో కృతిని ప్రచురించడం… ఆ యాత్ర చేయాలనుకునే వారికి చక్కటి గైడ్‌గా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. రోడ్డు ప్రయాణంలో సమయం, సమస్యల గురించి తెలుపుతూనే, డాక్టర్‌ ఉమాదేవిగారి పర్యవేక్షణలో తమ బృందంలోని పదకొండుమంది జరిపిన 15 రోజుల యాత్ర గురించి సవివరంగా తెలుపడం జరిగింది. ఒకప్పుడు మనదేశంలో నిదే అయినా ప్రస్తుతం చైనాలో అంతర్భాగమైన కైలాస పర్వతం, మానస సరోవరం దర్శనమనేది – చూస్తే బావుండుననుకున్నంత సులభంకాదు, ప్రయాణం చేయడమనే సంగతి గురించి తన పుస్తకంలో చక్కగా తెలుపడం జరిగింది. విమానం, హెలికాఫ్టర్‌, టెంపో, జీప్‌, జడలబర్రె, గుఱ్ఱాలు, కాలినడక వగైరా అన్నింటి గురించి థ్రిల్లింగ్‌గా రాస్తూ తమ గైడ్‌ ద్వారా ఏర్పాటు చేయబడిన హోటల్స్‌, బస, విడిది, షెడ్స్‌ గురించి గూడా పేర్లతో సహా తెలుపడం జరిగింది.

నేపాల్‌, ఖాట్మండ్‌, పశుపతి సోమనాథ దేవాలయం, సిమికోట్‌ హిల్సా, సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌, టక్లాకోట్‌, రాక్షస్‌స్థల్‌, దార్చెన్‌, యమద్వార, గౌరీదేవి ఆలయం, బ్రహ్మపుత్రానది, దిరాపుక్‌ వగైరాల సందర్శన, స్థలాల వివరణతోపాటు ఉషోదయంలో స్వర్ణకాంతులీనుతూ అనిర్వచనీయమైన అనుభూతి కలిగించే అద్భుతమైన కైలాస పర్వత దర్శనం, పరిక్రమ, మానస సరోవరం, హంసల సొబగుల గురించిన రాసిన మరెన్నో విషయాలు చదువుతున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తూ అవన్నీ చూస్తున్నామేమోననే భ్రాంతి కలుగుతుంది. ప్రయాణం చేయాలనుకునేవారు పాస్‌పోర్ట్‌ ఫొటోతోపాటు ఏయే వస్తువులు సమకూర్చు కోవాలనే విషయం గూడా సూచించడం జరిగింది. అమ్మానాన్నలకంకితమిచ్చిన 65 పేజీల అందమైన యీ పుస్తకంలో 65 కలర్‌ ఫొటోలు కూడా వుండడం వల్ల యీ పుస్తకం దృశ్యకావ్యంగా అనిపిస్తుంది మరి!

-విశిష్ట

Other Updates