bavaఅన్నవరం దేవేందర్‌

పల్లెలంటే అనురాగాల ముల్లెలు. ఒగలంటే ఒగలకు పట్టింపు ఉంటది. ఆపతిల సంపతిల ఆదుకుంటరు. ఊరంత అట్లనే ఉంటది. ఒగలకు ఇంకొకలు ధీమ. అంటే కొట్లాటలు ఉండయా! అంటే అవి సూత అక్కడక్కడ ఉంటయి. మల్ల ఎంటనే కుదురుకుంటయి. తెలంగాణ పల్లెల్ల ఫ్యాక్షనిస్టుల పంచాయితులు ఉండయి. ఊరంత వరుసలు కలుపుకునే పిలుసుకుంటరు. మల్లయ్యను నర్సయ్య ఓ మల్లయ్య బావా అని నోరార పిలుస్తడు. మల్ల ఈయన సుత నర్సయ్యను ఓ వాయి ఏడికి పోతన్నవో.. అని సరసం ఆడుతడు. అట్లనే ఈరయ్య పటేలు సుత కొంరయ్యను ఓ అల్లుడా! అనే పిలుస్తడు. కులమతాలుండయి అందరు సుత ఇట్లనే వరుసల తోనే పిలుసుకుంటరు.

మొగోల్లే కాదు ఆడోల్లు సుత అత్త, శిన్నవ్వ, అమ్మ అని పిలుసుకుంటరు. ఊర్లల్ల మనుసులు ఒగలకు ఒగలు ఉత్తగ పేర్లు పెట్టి పిల్సుకోరు. పేరు ఎనుకనో ముంగట్నో ఓ వరుసను కలిపే పిలుస్తరు. అయితే ఈ వరుసలు ఆ ఊర్లో తాతల కాలం నుంచే వస్తయి. అవే కొనసాగుతయి చిల్లర మల్లరోల్ల నుంచి మొదలు వెడితే భూస్వాములదాకా అట్లనే పిలుసుకుంటరు. అట్లనే మాట్లాడ్తరు. ఇద్దరి మధ్య ఏదైనా పంచాయితీ వస్తే కూడా అట్లనే పిల్సుకుంట పెద్ద మనిషికి ఫిర్యాదు చేసుకుంటరు. ఆ తర్వాత తప్శ అయినంక మల్ల కల్సే ఉంటరు. ఊల్లె ఎవుసంతోని, చేతి వృత్తులతోని, సంబంధం కలెగల్సిన అందరి మధ్యనే ఉంటయి.

ఎవలనైనా అవసరంతోని పిలుసుడు కాదు అనురాగంగనే పిల్సుకుంటరు. ఇగ వరుసైనోల్లు అంటే తాతా మనుమడు, మనుమరాలు, వదినె మరిది, మరదలు, బావ బామ్మర్ది ఇట్లాంటి వరుసోల్ల నడుమ పరాశ్కాలు నడుస్తయి. పరాశ్కాలు అంటే జర సరసహృదయ సంభాషణలు అన్నట్టు. ఊరు పొందిచ్చినప్పుడే ఒక ఇంటి పేరుతోని వచ్చిన కుటుంబాలు ఏరువడి ఇచ్చుక పోయి తీగలాగ విస్తృతం అవుతారు. వాల్లందరి చిన్నతాతోల్లు, పెద్ద తాతోల్లు అని గుర్తింపు కోసం పిలుసుకుంటారు. కొందరు పెద్ద పటేండ్లు, చిన్న పటేండ్లు ఇట్లా మొదలు పెట్టి తర్వాత వరుస కలుపుతరు. సాధారణంగా అన్ని కులాలకు మధ్య సబంధాలు ఉంటయి గని బాగా సంపన్నులైన వాల్లతో ఎక్కువ ఉండయి. అయితే ఇవన్ని శ్రమ సంబంధమైనవి. పనుల కాడ ఎవుసం కాడ కల్సిన మనుసుల మధ్యనే ఉంటయి. పల్లె మనుషుల మధ్య సహజంగా ఏర్పడ్డ ఆత్మీయతలు.

ఇవిగాకుండా ఒగలకు ఒగలు ఇసెరెలు ఇచ్చిపుచ్చుకుంటరు. ఎడ్లు, బండి, అవసరం ఉన్నదనుకో ఇంకొకలు బదలు తెచ్చుకుంటరు. నిజానికి ఊర్లల్ల అన్ని ఇసిరెలు అంటే వస్తువులు అందరి దగ్గర ఉండయి. కాని ఏ వస్తువు ఎవల దగ్గర ఉంటదో అందరికి ఎరుకుంటది. ఇట్లా వస్తువును ఊరంతా వాడుకుంటరు. కచ్రం, నిచ్చెన, కుంచం, బోరెం, పెంటపొనుక, గడ్డపార, పార, పగ్గం, గొడ్డలి తాళ్ళు, పగ్గాలు అవసరం కోసం తీసుక పోవుడు అలవాటుగానే ఉంటది. ఇండ్లల్ల అవసరం ఉన్న కుందెన, రోలు, రోకలి, గంప, బిందె, శాంతాడు బొక్కెన ఇట్ల అరొక్క వస్తువు తెచ్చుకుంటరు ఇచ్చుకుంటరు.

బాయిల కాడ కూడా అవసరమైన వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటరు. ఒగలకు ఇంకొకలు ఆసరవుడు అనేది ఆది నుంచి తెలంగాణ పల్లె సంస్కృతి. ఈ కల్సిమెల్సి జీవించే సంస్కృతి వల్లనే సామూహిక పండగలైన బతుకమ్మ, బోనాలు, దసరా, జాతరలు పారవశ్యంతో నడుస్తయి. ఊరంతా బోనాలు ఎప్పుడు చేస్తాం అనే నిర్ణయానికి వచ్చి అందరు భక్తి పారవశ్యంతో కలుస్తరు. అట్లనే మైసమ్మలకు చేసుడు. పోశమ్మలకు చేసుడు, బీరప్ప పండుగ ఊరి పండుగలన్నీ సామూహికంగా చేసుకునుడు ఆనవాయితీ. ఊర్లల్ల అనాదిగా ఉన్న ఐకమత్యం వల్లనే కొనసాగుతున్నాయి. కులాలు ఉంటయి, కుల కట్టులు ఉంటయి. అందరు కల్సి ఊరంత సంబరంగ పండుగలు చేసుకుంటరు. పల్లెల్లో ఉన్న మానవ సంబంధాలు ఘనమైనవి. రాను రాను పల్లెల మీద పట్నం వాసనసోకి మనుషుల మధ్య అనురాగం కన్పిస్తలేదని ఎన్కటోళ్ళు బాధపడుతుంటరు. ఊర్లల్ల ఇదివరకున్న ప్రేమ వరుసల పిలుపుల సాశీవనంలో ఇప్పుడు కొత్తగా ఆంటీ అంకుల్‌ ఇంకాఅని పిలుస్తున్నారు. లేదా అన్న అంటున్నారు. అన్న అనేది ప్రేమకు సంబంధించినదే. ఇది తెలంగాణ ఉద్యమ వాతావరణంతో ఎక్కువ పాతుకపోయింది. అంతకుముందు ఎన్టీరామారావును అన్న’ అని పిలవడం, ఆ తర్వాత నక్సలైట్‌ ఉద్యమంలో కూడా అన్న, అక్క అనే వ్యవహరించబడటం వల్ల అన్నా, అక్కా అనే పిలుపులు కూడా పట్టణాల్లో ఇతర చోట్లా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా బ్రిటీష్‌ పరిపాలన నుంచి వచ్చిన సార్‌ సంస్కకృతి కూడా అంతటా వంటవట్టింది. తెలంగాణ ప్రాంతంలో ఉపాధ్యాయులను పంతులు అని పిలుస్తరు.

ఆంధ్రలో మాస్టారు అని పిలుస్తారు. ఇప్పుడు అంతటా సార్లు సార్లు అంటున్నరు. లేదా అంతకు ముందు పంతులుగారు అయ్యగారు అని పిలిచేవారు. క్రమంగా సదువు చెప్పేవాల్ల సార్ల పిలుపు ఇప్పుడు మిగతా అందరి ఉద్యోగులను సుత సార్‌ సార్‌ అని పిలుసుడు అలవాటైంది. ఇందులో పొడి పొడి సంబంధమే కన్పిస్తది గని ఆత్మీయత కన్పించదు. ఇగ పోతే శ్రమ జీవన సంబంధం లేని వాళ్ళను రామరావు దొర, మల్లవ్వ దొరసాని అని పిలుసుకుంటరు. ప్రతిగా అవతలి వాళ్ళు వీళ్ళను వేలం పేర్లు పెట్టి మాత్రమే పిలుస్తరు.

పిలుపు పిలుపుల్లోనే అనురాగం కన్పిస్తది. ఏది ఏమైన పల్లె పిలుపు సంబంధాలు ఏ ఊరికి పోయినా అట్లనే కొనసాగుతున్నాయి. అంకుల్‌ ఆంటీ, సార్‌, మేడం, అండీ, గిండీలకన్నా మామా, చిచ్చా, బిడ్డా, బాపు, తమ్మీ ఎంత గమ్మతిగుంటయి.

Other Updates