sampadakeeyamపొట్ట చేత బట్టుకుని ఉపాధి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్ళి కాలం గడుపుతున్న వారికి పుట్టిన గడ్డతో ఉన్న అనుబంధం ఎన్నాళ్లయినా చెరగదు. బాల్యంలో పెరిగిన పరిసరాలు, చదువు నేర్పిన బడి వంటి తీపి గుర్తులు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ‘ఉన్న ఊరు, కన్న తల్లి’ అంటూ పెద్దలు అనేమాట ఆ అనుబంధం ఎంత గాఢమైందో స్పష్టం చేస్తుంది.

సొంత రాష్ట్రంలో స్వపరిపాలన సాగుతూ నలభైమాసాలు పూర్తి కావచ్చిన స్థితిలో అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, నెలకొల్పుతున్న సంప్రదాయాలు దూర తీరాల్లోని మన వాళ్లను కదిలిస్తున్నాయి. ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా పుట్టిన గడ్డపై పెంచుకున్న మమకారం వారిని గుక్కతిప్పుకోనివ్వడం లేదు. వీలైనంత త్వరగా సొంత ఊరికి వచ్చి, భావి జీవితాన్ని ఆనందమయంగా గడుపుదామనే భావన వారిలో ముప్పిరి గొంటున్నది.

వరంగల్‌ పరిధిలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు కానున్న వర్తమానం తెలుసు కున్న ప్రవాస తెలంగాణ బిడ్డలు తిరిగి శాశ్వతంగా వచ్చేస్తామని ప్రభుత్వానికి తెలియజేసిన ఘటన, మూలాలతో పెనవేసుకుపోయిన అనుబంధానికి అద్దంపడుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో పక్షపాతం, అణచివేత పడుగు పేకలుగా సాగిన దశాబ్దాల పాలన తెలంగాణ వనరులు ధ్వంసం చేయడానికే పరిమితం కాలేదు. వివిధ వృత్తుల్లో బతుకు వెళ్ళదీస్తున్న వారికి కనీసం ఉన్నచోట జరుగుబాటులేని దుస్థితిని సృష్టించింది. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి వలసలు ప్రారంభమై, లెక్కకుమించిన సంఖ్యలో వేరే చోట్లకు తరలివెళ్ళాల్సిన అనివార్య పరిస్థితి. ఈ విధంగా వ్యవసాయం, చేతి వృత్తుల రంగాలు ఛిన్నాభిన్నమైన దురదృష్టకర పరిణామం సొంత రాష్ట్రం ఏర్పాటయ్యాక కనుమరుగైంది. స్థానిక అంశాల పట్ల సమగ్ర అవగాహన ఉన్న ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభ్యున్నతి లక్ష్యంగా అపూర్వ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా వలస వెళ్ళిన మన బిడ్డల్లో సొంత గడ్డకు తిరిగి రావాలనే ఆంకాంక్ష రెట్టింపైంది. ఈ క్రమంలోనే సూరత్‌ ప్రాంతానికి వెళ్ళిన నేతన్నలు తిరిగి వచ్చేస్తామని నిర్ణయించుకుంటున్నారు. ఇక వలసలకు మషూరైన పాలమూరు ప్రాంతంలో కూడా సొంత గడ్డకు వేలాది కుటుంబాలు తిరిగి వచ్చేశాయి.

సింగూరు ప్రాజెక్టు పరిధిలో సేద్యానికి, చుక్కనీరు అందని దశాబ్దాల కష్టం తీరడంతో రైతన్నలు సొంత గూటికి చేరుకుంటున్నారు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయిగా ఎన్నో ఏళ్ళ క్రితం తయారయిన తెలంగాణా జీవన దృశ్యం క్రమేపీ మారుతున్నది. రాష్ట్ర అభ్యుదయం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న నాయకుడి అంకితభావం కారణంగా బంగారు తెలంగాణ సాకారం కానున్నదనే విశ్వాసం సర్వత్రా ఇనుమడి స్తున్నది. వలసల వాపస్‌ వ్యవహారం ఇందుకు తిరుగులేని రుజువు.

Other Updates