manakuragayalu– చుక్కా వేణుగోపాల్‌

కూరగాయల సాగును ప్రోత్సహించే విధంగా, రైతు పండించే పంటకు నేరుగా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంలో భాగంగా ‘మన కూరగాయలు’ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోంది. ప్రధానంగా మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలానికి తెరదించుతూ, కూరగాయల ధరలను అదుపులోకి తీసుకురావడంతోపాటు రైతు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర కల్పించడం, నాణ్యమైన తాజా కూరగాయలను సరసమైన ధరలకు వినియోగదారులకు విక్రయించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని ఉద్యాన శాఖ, మార్కెటింగ్‌ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న నగర జనాభాకు అనుగుణంగా ప్రజల అవసరాలకు తగిన విధంగా కూరగాయలను అందించడం కోసం ఇంతకు ముందే ప్రవేశపెట్టిన రైతు బజార్లకు సమాంతరంగా కూరగాయల మార్కెటింగ్‌ కోసం ‘మన కూరగాయలు’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ పథకం అమలుకు సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమించింది ప్రభుత్వం.

ఇంతకు ముందు ఉన్న రైతు బజార్లకు, కొత్తగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి ఉన్న ఒకే ఒక్క తేడా, ఈ పథకం ద్వారా రైతులు తాము పండించిన కాయగూరలను నగరంలోని రైతుబజార్లకు తీసుకురాకుండా, వారు నివసించే గ్రామాల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కలెక్షన్‌ సెంటర్లలో విక్రయించుకునే వెసులుబాటు ఏర్పడింది. దీని ఫలితంగా దూరాభారం, ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చుల నుంచి రైతుకు ఉపశమనం లభించింది.

పథకం తీరుతెన్నులు:
ఈ పథకాన్ని రెండు ప్రధాన దశలలో రూపకల్పనచేశారు అవి:
1. కలెక్షన్‌ సెంటర్లు
2. డిస్ట్రిబ్యూషన్‌ మరియు రిటైల్‌ ఔట్‌లెట్‌ సెంటర్లు.

మొదటి దశలో రైతులు పండించిన కూరగాయలను స్థానికంగా కొనుగోలు చేయడానికి గుర్తించిన గ్రామాల్లో కలెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో 22 కలెక్షన్‌ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 9, మెదక్‌ జిల్లాలో 11, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2 చొప్పున ఏర్పాటు చేశారు. కలెక్షన్‌ సెంటర్లలో కూరగాయల గ్రేడింగ్‌/సార్టింగ్‌, తూకం, కంప్యూటర్‌ రశీదులు, భద్రపరిచే ట్రేలు తదితర అవసరాల కోసం కావాల్సిన సామాగ్రిని సమకూర్చింది. ఒక్కో కలెక్షన్‌ సెంటర్‌కు రూ.3 లక్షల చొప్పున ఇప్పటివరకు మొత్తం 60 లక్షలు ఖర్చు చేసింది.

రెండో దశలో కలెక్షన్‌ సెంటర్లలో సేకరించిన కూరగాయలను బోయిన్‌పల్లి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు తరలిస్తారు. ఇక్కడ కూరగాయల సార్టింగ్‌, గ్రేడింగ్‌, స్టోరేజ్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పించారు. ఇక్కడి నుంచి నగరంలోని రైతుబజార్లు, కాలనీల్లో ఏర్పాటు చేసిన రిటైల్‌ ఔట్‌లెట్‌ కేంద్రాలకు కూరగాయలను చేరవేసి నగర వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన కూరగాయలను అందించడం జరుగుతోంది. కలెక్షన్‌ సెంటర్లలో రైతు విక్రయించిన కూరగాయల పరిమాణం, నాణ్యత ఆధారంగా చెల్లింపులను రైతు సమర్పించిన బ్యాంకు ఖాతాలో మార్కెటింగ్‌ అధికారులు జమచేస్తారు.

ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మన కూరగాయలు పథకం మంచి ఫలితాలను సాధిస్తున్నది. ఈ పథకం ద్వారా కూరగాయలను పండించే రైతులు ఆయా గ్రామాల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. జూన్‌ నెల వరకు సుమారు 65,500 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. మొత్తం రూ.8.65 కోట్లను రైతులకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ప్రతి కిలో కూరగాయలకు రైతుకు చెల్లించిన సగటు ధర రూ.11.62 పైసలు అని మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా అన్నదాతల ఆదాయం 25 శాతం నుంచి 64 శాతం వరకు పెరిగినట్లు మార్కెటింగ్‌ శాఖ అధ్యయనంలో తేలింది. ఏవైనా కిలో కూరగాయల ధర రూ.10 అనుకుంటే అందులో రూ.2.50 వరకు మాత్రమే రైతులకు ఇది వరకు అందేది, తెలంగాణ ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖలు చేపట్టిన ‘మన కూరగాయలు’తో వాళ్ళకిప్పుడు సగటున కిలో ఒక్కింటికి రూ.6.40 వరకు గిట్టుబాటు అవుతుంది.. దీంతో ఈ పథకాన్ని తెలంగాణ బ్రాండు పేరుతో విస్తరించాలని మార్కెటింగ్‌ అధికారులు ప్రణాళికను రచించారు.

విస్తరణ బాటలో..
ఈ పథకం మెరుగైన ఫలితాలు సాధించడంతో త్వరలో కొత్తగా వంద ఔట్‌లెట్లను తెరవాలని మార్కెటింగ్‌ అధికారులు నిర్ణయించారు. తొలిదశలో 25 కేంద్రాలు తెరువనున్నారు. ఇవి త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న మార్కెటింగ్‌ శాఖ, అందుకు అనుగుణంగా రెండు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయడం జరిగింది. కలెక్షన్‌ కేంద్రాల నిర్వహణకు ఒక సంస్థ, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నిర్వహణ, రిటైల్‌ ఔట్‌లెట్ల నిర్వహణ కొరకు మరొక సంస్థను ఎంపిక చేయడం జరిగింది. రిటైల్‌ ఔట్‌లెట్‌ సెంటర్లలోనే కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా కూడా కూరగాయలను వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్షన్‌ సెంటర్లు, రిటైల్‌ ఔట్‌లెట్లలోని కూరగాయల ధరలను రోజువారీగా మార్కెటింగ్‌ శాఖ నిర్ణయిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను మార్కెటింగ్‌ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది.

నారాయణగూడ మేల్కొటే పార్కులోని రిటైల్‌ ఔట్‌లెట్‌ను రాష్ట్ర మార్కెటింగ్‌, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జూలై 22న ప్రారంభించారు. ఎల్బీనగర్‌ పరిధిలోని ఇంద్రప్రస్త కాలనీలో మరొకటి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఔట్‌లెట్లలో విక్రయించే కూరగాయలపట్ల వినియోగదారుల స్పందన బాగుంది. వీటిలో అమ్మే కూరగాయలను వివిధ పరిమాణాల్లో (అరకిలో, కిలో) ముందే ప్యాకింగ్‌ చేయడం, కూరగాయల తూకంలో మోసం లేకుండా ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషిన్లు వాడటం, ఏ రోజుకు ఆరోజు తాజా కూరగాయలను అందుబాటులో ఉంచడం , సరసమైన ధరలకే కూరగాయలు లభిస్తుండటం వంటి అంశాల పట్ల వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. రైతులు, వినియోగదారుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు.

రైతులకు ప్రయోజనం – హరీష్‌రావు

రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకే కూరగాయల స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్‌, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో 100కు పైగా కూరగాయల స్టాళ్లను ప్రారంభిస్తామని, రైతులకు ప్రయోజనం చేకూర్చడానికే ఈ స్టాళ్లను ఏర్పాటుచేసినట్లు మంత్రి తెలిపారు.

Other Updates