తమకింతటి జీవితాన్ని ప్రసాదించిన కూకటివ్రేళ్ళని మహావృక్షాలు తలచుకుంటాయో లేదో తెలియదు కానీ మహాత్మాగాంధీ పిలుపునందుకుని తను రాజకీయాలలో ప్రవేశించినట్లు పుచ్చలపల్లి సుందరయ్య ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే గ్రంథంలో చెప్పుకున్నారు. కాంగ్రెస్ అంటే గిట్టని కమ్యూనిస్టులకు ఇది కనువిప్పు. సుందరయ్య 1913లో నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా అలగానిపాడులో జన్మించాడు.
సుందరయ్య విద్యార్థి దశలోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న సుందరయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికి ఆయన ఇంకా బాలుడే. అందువల్ల రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన ప్రభుత్వం ఆయనను తంజావూరు, తిరుచురాపల్లి, రాజమండ్రి బోర్‌స్టల్ పాఠశాలలో నిర్బంధించింది. సోవియట్ విప్లవంతో ప్రభావితమైన సుందరయ్య కమ్యూనిస్టుపార్టీలో చేరిపోయాడు. 1934లో ఆంధ్రలో కమ్యూనిస్టుపార్టీని స్థాపించాడు. దక్షిణాదిలో కమ్యూనిస్టుపార్టీ వ్యాప్తికి కృషి చేసిన మొదటి నాయకుడు ఆయన. తనకు లభించిన ఆస్తినంతటిని తెగనమ్మి ప్రజా ఉద్యమానికి ఖర్చుపెట్టి ఆంధ్రలో మహోన్నత త్యాగ సంప్రదాయాన్ని సుందరయ్య నెలకొల్పాడు. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టుపార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేశాడు.
1943లో సుందరయ్య మహారాష్ట్ర మహిళ, లీలను వివాహం చేసుకున్నాడు. సంతానం కలిగితే ప్రజా సేవకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన వేసక్టమీ చేయించుకున్నాడు. 1946-48 సంవత్సరంలో నిజాం నిరంకుశత్వానికి, ఫ్యూడల్ శక్తులకి వ్యతిరేకంగా ఉధృత స్వరూపం ధరించిన తెలంగాణ సాయుధ పోరాటానికి సుందరయ్య సారథ్యం వహించాడు.
ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి వస్తుందని ప్రపంచమంతా భావించిన 1955 మధ్యంతర ఎన్నికలలో నాయకత్వం వహించేందుకు సుందరయ్య రాజ్యసభ వదిలి శాసనసభకు పోటీ చేశాడు. గన్నవరం నుంచి ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ ఎత్తులు, కమ్యూనిస్టుల వ్యూహాల లోపాలవల్ల అనుకున్న విజయం లభించకపోయినా 30 శాతానికిపైగా ఓట్లతో కమ్యూనిస్టుపార్టీ ప్రభావశీల శక్తిగా ఆవిర్భవించింది. సుందరయ్య ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ జరుగలేదు. సుందరయ్య శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని మూడు చెరువుల నీళ్లు తాగించేవాడు. ఏదైనా లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వాధినేత చెప్పలేకపోయిన వివరాలు కూడా అప్పటికప్పుడు చెప్పి కంగు తినిపించేవాడు. అజ్ఞాతవాసాలు, జైలు జీవితాలు సుందరయ్య ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీశాయి. 1962లో చికిత్సకోసం మాస్కో వెళ్తున్న సుందరయ్య అప్పటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఏదైనా కోరుకోమంటే, ఇంకా జైల్లో వున్న ఆఖరి తెలంగాణ ఖైదీలను విడుదల చేయించమని అడిగిన మహానేత ఆయన. 1985 మే 19న ఆయన మరణించారు.
జి. వెంకటరామారావు