‘రెండు వందల యేడుల నుంచి చిమ్మ
చీకటుల మ్రగ్గి వెలుతురు రేక గనని
మాకు, ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి వీవు,
కీర్తనీయ! బూర్గుల రామకృష్ణరాయ!
`మహాకవి డా. దాశరథి
శ్రీ జి. వెంకటరామారావు
కత్తినీ కలాన్నీ సరిసమానంగా ప్రయోగించగల కృష్ణరాయ, భోజరాజాదులను మనం చూడలేదు. కాని అట్టి సవ్యసాచిత్వంగల బూర్గుల రామకృష్ణరావుగారిని చూశాం. అతి జఠిలమైన రాజకీయ సమస్యా పరిష్కారంలో నిమగ్నమై ఉంటూనే క్షణం విశ్రాంతి దొరికితే చాలు సాహిత్య వ్యాసంగంలో పడిపోయేవారు. పండితసభలు, సదస్సులు అంటే ఎంతోఉత్సాహం చూపేవారు. ఎన్నో సమస్యలకు ఆలవాలమైన అలనాటి హైదరాబాద్ సంస్థానానికి ముఖ్యమంత్రిగా ఉండడం మాటలుకాదు. మహారాష్ట్రులను, కర్నాటులను, ఆంధ్రులను, మరీ మహ్మదీయవర్గంవారిని, పూర్వపు జాగీర్దారీ తెగవారిని, నాటి అతివాదులను కూడగట్టుకు రావడం మాటలా?
విశేష ప్రజ్ఞాశాలిjైున బూర్గులకు హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, సంస్కృతం వంటి దేశీయభాషలేగాక, పారసీవంటి అన్యభాషల్లో అసమానమైన పరిజ్ఞానం ఉండేది. ఆయన సూఫీ కవుల గురించి రాసిన వ్యాసాలు ఆంధ్రులు మరువలేరు. ఆయన గొప్పవక్త. ఏ భాషలోనైనా అనర్గళంగా మాట్లాడేవారు. హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో ఎవరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేసేవారు. ఆయన అభ్యుదయవాది. పురాతన పండితులంతా యెంకి పాటలను వెక్కిరించిననాడు నండూరి సుబ్బారావుగారి వెన్నుచరచి, మెచ్చుకుని సెభాష్ అని ప్రోత్సహించిన మహావ్యక్తి. యువ కవులంటే ఆయనకు ఎంతో ఇష్టం. సి. నారాయణరెడ్డిగారు ‘నాగార్జునసాగరం’ రాశారని తెలియగానే ‘ష:మంజిల్’ (రాజ్‌భవన్) సభామండపంలో సభ జరిపి సి.నా.రె.చేత కావ్యగానం చేయించారు.
దాశరథిగారి ‘మహాబోధి’ కావ్యాన్ని అంకితం తీసుకుని ఆయనను ఆదరించారు. బూర్గులవారు ఉత్తరప్రదేశ్ గవర్నరుగా లక్నోలో ఉన్నప్పుడు దాశరథిగారి ‘గాలిబ్‌గీతాల’కు పీఠిక రాశారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైనవారు నిజాం నవాబులు లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన వారే. 1952 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మొదటి ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. దానికి బూర్గుల ముఖ్యమంత్రి అయ్యారు. అందుకనే బూర్గులను తొలి ప్రజా ముఖ్యమంత్రి అన్నాము.
సర్దార్ పటేల్, నెహ్రూకు అభిమానపాత్రుడైన బూర్గుల రాష్ట్రానికి సుస్థిర ప్రభుత్వం అందించారు. నాలుగేళ్ల సుదీర్ఘ కాలం అధికారంలోఉన్న తొలి తెలుగు ముఖ్యమంత్రి ఆయనే. కొందరు ఈర్ష్యాపరులు ఆయన్ను పదవినుంచి తప్పించడానికి ప్రయత్నించినప్పుడు నెహ్రూజీ ప్రజాస్వామిక పద్ధతి ప్రకారం రహస్య బ్యాలెట్ నిర్వహించగా మతృ భాషా బేధాలుమాని శాసనసభా సభ్యులు అత్యధికసంఖ్యలో బూర్గులను బలపరిచిన నాడే యావత్తు దేశం ఆశ్యర్యపోయింది. త్రివిక్రముని మహాశక్తి బయల్పడిరది. అంతంతై అఖిలభారత ఖ్యాతినార్జించారు బూర్గుల. డా॥ బూర్గుల రామకృష్ణారావు 1899 సంవత్సరం మార్చి 13వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకా పడకల్ గ్రామంలో తమ మాతామహుల యింట్లో జన్మించారు. ఆయన స్వగ్రామం బూర్గుల. ఇంటిపేరు పుల్లమరాజువారు. పూణేలో చదువుకునే రోజుల్లో మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వూరిపేరే యింటిపేరైంది. అదే స్థిరపడిపోయింది.
ఒకచేత వకాలతు వృత్తి చేపడుతూనే మరోచేత రాజకీయాలను నడుపుతూ వచ్చారు బూర్గుల. పి.వి. నరసింహారావు అంతటివారు ఆయనవద్ద జూనియర్‌గా పనిచేసినవారే. ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్ స్థాపనలో బూర్గులది ప్రధానపాత్ర. 1931లో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహించారు. స్వాతంత్య్రోద్యమంలో ఆయన పెక్కుసార్లు అరెస్టయ్యారు. సర్‌మీర్జా ఇస్మాయిల్ ప్రధానిగా ఉన్నప్పుడు బూర్గుల ప్రజ్ఞను గుర్తించి హైకోర్టు న్యాయమూర్తి పదవో, న్యాయశాఖ మంత్రి పదవో ఇవ్వజూపారు.కానీ బూర్గులవాటిని తిరస్కరించి దేశసేవకు అంకితమయ్యారు.
దేశం స్వాతంత్య్రమైంది కానీ హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల దమనరీతి ఎక్కువైంది. మహానాయకులంతా పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. బూర్గుల రాష్ట్రంలోనే ఉండి, ప్రజలకు పెట్టనికోటగా నిలిచారు. ‘పొట్టివాడు గట్టివాడు’ అని కోటానుకోట్ల నోళ్ల కొనియాడబడ్డారు. కనుకనే ఆయన పోటీ కాంగ్రెస్ పెట్టినా ఎవరూ ఈసడిరచుకోలేదు. వెల్లోడి మంత్రివర్గంలో విద్యా, రెవిన్యూశాఖలను నిర్వహించారు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన భూసంస్కరణలను మరే రాష్ట్రంలోనూ, మరే ముఖ్యమంత్రి చేపట్టలేదు. వంద సంవత్సరాలనుంచి అధికారంలోఉన్న ఉర్దూ భాషను తొలగించి, ఆ స్థానంలో తెలుగు, మరాఠి, కన్నడ భాషలను బోధనా భాషలుగా చేసి, పరిపాలనా భాషగా ఇంగ్లీషుకు స్థానమిచ్చినా ఎక్కడా ఏ అలజడి జరుగలేదు.ముఖ్యమంత్రి పదవి విరమించుకున్న తర్వాత కొంతకాలం కేరళ గవర్నరుగానూ, ఉత్తరప్రదేశ్ గవర్నరుగాను పనిచేశారు. నాలుగేళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీలు ఆయనను డాక్టరేటు డిగ్రీలతో సత్కరించాయి.
రామకృష్ణరావుగారి హయాంలో హైదరాబాదు రాష్ట్రంలో సంపూర్ణమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొన్నది. జాగీర్దారు రద్దు సమస్యతో మొదలైన ఫ్యూడల్ ప్రతికూల సమాజస్థాపన, కౌల్దారి శాసనంతో ముందుకుపోయింది. రాష్ట్రంలో విద్యకు చాలా ప్రోత్సాహం ఇవ్వడమేకాకుండా దేశ భాషలకు చాలా దోహదం కలిగించారు. జిల్లాకు ఒక్కొక్క కళాశాల ఉండేలా ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధిలో గొప్ప మలుపు అనవచ్చు. స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంపూర్ణ ప్రజాస్వామ్యం బూర్గుల కాలంలోనే జరిగింది. ఆయన హయాంలో అనేక నూతన శాసనాలు, ఉద్యమాలు తలెత్తాయి. నాగార్జునసాగర్ నిర్మాణానికి రామకృష్ణారావు చాలా పట్టుదలవహించి సానుకూలం కావడానికి తోడ్పడ్డారు.
1967 సెప్టెంబరు 14వ తేదీన రామకృష్ణారావు స్వర్గస్తులయ్యారు. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు దాని చివరి ముఖ్యమంత్రి కావడం విశేషం.