మా ఇంటి నుంచి రాజేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే రెండు దారులు వున్నాయి. మా ఇంటి నుంచి తూర్పున బద్దిపోచమ్మ గుడి. అక్కడి నుంచి కుడివైపు నుంచి ఒక దారి. ఎడమవైపు నుంచి మరో దారి రాజేశ్వర స్వామి గుడికి.

బద్దిపోచమ్మ దగ్గర కుడివైపు సగరేశ్వర స్వామి దేవాలయం. ఎడమవైపు కొంచెం దూరంలో భీమేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని మేమంతా భీమన్న గుడి అనే వాళ్ళం. ఇప్పటికీ మా ఊర్లో చాలామంది అదే విధంగా పిలుస్తారు. ఈ భీమన్న గుడితో మాకు చాలా అనుబంధం. మాకే కాదు మా ఊర్లో చాలా మందికి అనుబంధం వుంది.

ఆ గుడి ముందు వున్న భవనంలో మిడిల్‌ హైస్కూల్‌ వుండేది. మా బ్యాచ్‌ ఆరవ తరగతి చదువుతున్నప్పుడు ఈ బడిని తీసుకొని వెళ్ళి జిల్లా పరిషత్‌ స్కూల్లో కలిపేశారు.

భీమన్న గుడి మా ఇంటికి చాలా దగ్గర. ఇది చాలా పెద్ద గుడి. ప్రశాంతంగా, గంభీరంగా వుంటుంది. చాలా పెద్ద లింగం. పది పన్నెండు అడుగులు వుంటుంది. మా చిన్న తనంలో యాత్రికులు చాలా తక్కువగా ఈ గుడికి వచ్చేవాళ్ళు. గుడి లోపలికి వెళ్ళడానికి రెండు వైపులా మెట్లు వుండేవి. దాని ముందు భాగంలో విశాలమైన స్థలం. మెట్ల దగ్గర రెండువైపులా ఏనుగు బొమ్మలతో అటువైపు, ఇటువైపు విగ్రహాలు. వాటి మీద కూర్చొని మేం ఆటలు ఆడేవాళ్ళం. వాటి మీద కూర్చోని పిల్లలు మా ఊర్లో లేరంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

గుడిలోపల రెండువైపుల కిటికీలు. అప్పుడు వాటికి తలుపులు వుండేవి కావు. కిటికీ నుంచి బయటకు వస్తూ పిల్లలు ఆడుకునే వాళ్ళు. కొంత మంది అక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళు. పిల్లలకి వేదాలు, మంత్రాలు మా ఊరి బ్రాహ్మలు ఆ కిటికీల దగ్గర కూర్చొని నేర్పేవాళ్ళు. ఆటలు, పాటలు, విద్య ఇట్లా ఎన్నో అక్కడ జరిగేవి. భీమన్న గుడికి మూడువైపులా పెద్ద తోట వుండేది. కుడివైపు తోటలో ఓ జామచెట్టు, ఎడమ వైపు తోటలో మరో జామ చెట్టూ ఉండేది. గుడికి ముందు భాగంలో కుడివైపు పెద్ద బావి వుండేది. దాని ప్రక్కన పెద్ద రామసీతా ఫలం చెట్టు వుండేది. గుడి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ.

భీమన్న గుడితో మా బాల్యం ముడిపడి వుంది. ఒక్క ఆటపాటలకే కాదు. ఆ తోటలో వున్న జామకాయలతో మా అనుబంధం మరీ ఎక్కువగా వుండేది. ఆ జామ కాయలు చాలా తీయగా వుండేవి. వాటికోసం ఆ తోటకి తరుచూ వచ్చేవాళ్ళం.

ఆ తోటకు ఓ తోటమాలి వుండేవాడు. ఆయన పేరు పోచెట్టి. చిన్న దోతీ, దానిమీద బనీనూ, ఇదీ ఆయన వేషం. ఎప్పుడు చూసిన తోటలోని చెట్ల మొదల్లని తవ్వడం చేస్తూ, నీళ్ళు పడుతూ కన్పించేవాడు. ఆ తోటలోని పూలు తెంపి, వాటిని పూలదండగా అల్లి రాజేశ్వర స్వామికి, అమ్మవారికి పంపించడం ఆయన విధి నిర్వహణలో ఓ భాగం.

భీమన్న గుడికి వెళ్లడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. కానీ తోటలోకి వెళ్ళాలంటే మాత్రం పోచెట్టి అనుమతి అవసరం. ఆ తోటలో రెండు పాము పుట్టలు కూడా వుండేవి. నాగుల చవితి లాంటి పండుగలప్పుడు మాత్రం తోటలోకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చేవాడు. అయితే శుభ్రంగా వుంచమని గట్టిగా చెప్పేవాడు.

మా భీమన్న గుడికి ఎడమవైపున ఓ చిన్న గుడి. అందులో ఆంజనేయ స్వామి. దాని ముందు పెద్ద రావి చెట్టు, దాని మీద లెక్కలేనన్ని గబ్బిలాలు. కొంత కాలం తరువాత ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన ఓ చిన్న గద్దె కట్టారు. అక్కడ కవిసమ్మేళనాలు జరిగేవి. నాటకాలు కూడా వేసే వాళ్ళు. మా భీమన్న గుడిలోకి ఒక్కరే వెళ్ళాలంటే మా చిన్నప్పుడు భయంగా వుండేది. నాగుం పాము లింగం దగ్గరికి అప్పుడప్పుడు వస్తుందని అనే వాళ్ళు.

మేమైతే ఎప్పుడూ చూడలేదు.

తోటలోకి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. పోచెట్టి కళ్ళుకప్పి వెళ్ళాల్సిందే. పోచెట్టి ఎప్పుడూ ఆ తోటని కాపలా కాసేవాడు. ఆ తోటలోని జామకాయలు చాలా తీయగా వుండేవి. వాటిని తెంపుకొని తిన్నప్పుడు మరింత రుచికరంగా అన్పించేవి. జామకాయల కోసం తరుచుగా భీమన్న గుడికి వచ్చేవాళ్ళం.

సెలవు రోజుల్లో, పోచెట్టి నిద్రపోతున్నప్పుడు నేనూ, నా స్నేహితులం కలిసి జామకాయలు తెంపుకునేవాళ్ళం. చెట్ల అలికిడి విన్పించగానే ‘ఎవడ్రా’ అని గట్టిగా అరిచేవాడు పోచెట్టి. తెంపుకున్న జామకాయలను నిక్కరు జేబుల్లో వేసుకొని పరుగు పరుగున బయటకు పరుగెత్తుకొని వచ్చేవాళ్ళం. గుండెలు దడదడలాడేవి. ఒకటి రెండు జామకాయలు క్రింద కూడా పడిపోయేవి. ఎవరూ దొరకకపోవడం వల్ల ఆనందంతో మా మనస్సు ఎగిరి గంతేసేది. పోచెట్టి గమనించినప్పుడు కొంత గడువు ఇచ్చి మళ్ళీ జామకాయలు తెంపుకునే వాళ్ళం. ఇలా చాల సార్లు చేశాం. పోచెట్టికి దొరకకుండా జామకాయలు తెంపుకొని అతనికి మూడు చెరువుల నీళ్ళు త్రాగించేవాళ్ళం.

మమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలని పోచెట్టి అనుకున్నాడు. జామ చెట్టు దగ్గర్లో వున్నచెట్ల దగ్గర దాక్కునాడు. ఆ రోజు నేనూ, రాజేందర్‌ జామకాయల కోసం వచ్చాం. మేం చెట్టు ఎక్కి జామకాయలు తెంపుతున్నామో లేదో పోచెట్టి చెట్టు కింద ప్రత్యక్షమయ్యాడు. మా ప్రాణాలు పైపైనే పోయాయి. అలాగే చెట్టు మీదనే వుండి పోయాం.

”నన్నే మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తారా? కిందికి దిగండి మీ సంగతి చెబుతా” అంటూ హుంకరించడం మొదలు పెట్టాడు.

భయం భయంగా ఇద్దరమూ క్రిందికి దిగాం.

దొరికిన వాళ్ళని చెట్టుకు కట్టేసి కొడతాడని మేం విన్నాం. ఇంట్లో చెబుతాడని భయపడ్డాం.

మా ఇద్దరిని గుర్తుపట్టాడు పోచెట్టి. మా బాపు మా వేములవాడలో చాలా పేరున్న డాక్టర్‌. రాజేందర్‌ వాళ్ళ బాపు రాజన్న గుడి మీద షేకదార్‌గా పని చేస్తున్నాడు.

”మీరా?” అన్నాడు పోచెట్టి.

ఆ మాటతో మాకు కొంచెం ధైర్యం వచ్చింది.

”మీరెందుయ్యా! ఇలా చేస్తున్నారు. కావాలని చెబితే నేనే తెంపి ఇచ్చేవాడిని కదా” అన్నాడు.

మా భయం పూర్తిగా తగ్గిపోయింది. గుండెలు కొట్టుకోవడం కూడా తగ్గిపోయింది.

”మల్లా ఇట్లా చేయకండి” వార్నింగ్‌ ఇచ్చి పంపించాడు. మా జేబుల్లో వున్న జామకాయలను తీసుకోలేదు.

ఏమీ మాట్లాడకుండా బయటకు పరుగెత్తుకొచ్చాం. ఈ విషయం పెద్దవాళ్ళ దాకా పోలేదు. మా మనస్సులు కుదుట పడ్డాయి. ఈ విషయం మా మిత్రులకి చెప్పాం. వాళ్లు ఆనందపడ్డారు.

ఈ సంఘటన జరిగిన తరువాత మళ్ళీ మేం జామకాయలు తెంపుకోవడానికి వెళ్ళలేదు. కానీ మా మిత్రులు ఒకటి రెండు సార్లు జామకాయలు దొంగతనంగా తెంపుకొచ్చారు. మేం వద్దని వారించాం. మేమే అనుకొని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం పోచెట్టి చేయలేదని మా మిత్రులు అన్నారు.

అప్పుడప్పుడూ పూలబుట్టతో పోచెట్టి మాకు బజార్లో కన్పించేవాడు. భయం భయంగా ఆయన వైపు చూసేవాళ్లం. కాలం అలా గడిచిపోయింది.

కాలక్రమంలో భీమన్నగుడి సంఘటన మా స్మృతి పథం నుండి మరుగున పడింది. కానీ మరిచిపోలేదు. వయస్సు పెరిగిన కొద్దీ భీమన్న గుడితో మా బంధం తగ్గిపోయింది.
వేములవాడ నుంచి నా ప్రయాణం కరీంనగర్‌, హైదరాబాద్‌ల వైపు కొనసాగి, కొంత కాలానికి న్యాయవాదిగా సిరిసిల్లకి వచ్చాను. మా వేములవాడకి సిరిసిల్ల 12 కిలోమీటర్ల దూరం. కరీంనగర్‌ 35 కిలోమీటర్ల దూరం. కరీంనగర్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పటికీ నా ఆఫీస్‌ సిరిసిల్లలో పెట్టాను. రెగ్యులర్‌గా సిరిసిల్ల కోర్టులో, అప్పుడప్పుడు కరీంనగర్‌, జగిత్యాల కోర్టులకి వెళ్ళేవాడిని.

నా ఆఫీసులో బాలమల్లు అనే క్లర్క్‌ వుండేవాడు. టైపింగ్‌ నుంచి అన్ని కోర్టు పనులు అతనే చూసేవాడు. ఉదయం తొమ్మిది గంటలకి వచ్చేవాడు. సాయంత్రం ఆరేడు గంటలకి వెళ్ళి పోయేవాడు.

ఓ రోజు సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో బాలమల్లు లోపలికి వచ్చి –

‘ఎవరో పోచెట్టి అట. మీ కోసం వచ్చాడు సార్‌’
అన్నాడు.

‘లోపలికి రమ్మని చెప్పు’. బయట ఎందుకు వెయిట్‌ చేస్తున్నాడు’ అన్నాను.

కాస్సేపటికి పోచెట్టి వచ్చాడు. ఎవరో పోచెట్టి అనుకున్నాను. నాకు బాగా తెలిసిన పోచెట్టి అని అతన్ని చూసిన తరువాత అన్పించింది. భీమన్నగుడి పోచెట్టి. తోటమాలి. మమ్మల్ని భయపెట్టిన పోచెట్టి.

వినయంగా నిల్చోనున్నాడు. తెల్లటి షర్ట్‌ వేసుకున్నాడు. కూర్చోమని రెండు సార్లు చెప్పినా అతను కూర్చోలేదు.

కొన్ని కుశల ప్రశ్నల తరువాత అతను నా దగ్గరికి రావడానికి కారణం అడిగాను.

ఏదో భూమి సమస్య గురించి చెప్పాడు. కొన్ని కాగితాలు రెవిన్యూ ఆఫీసు నుంచి తీసుకొని రమ్మని చెప్పాను. అవి తీసుకొచ్చిన తరువాత కేసు దాఖలు చేద్దామని చెప్పాను.

ఫీజు గురించి అడిగాడు. అవసరం లేదని చెప్పాను.

కోర్టు ఖర్చులు మా క్లర్క్‌కి కాగితాలతో బాటు ఇవ్వమని చెప్పాను. కాగితాలు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాడు.

ఓ వారం రోజుల తరువాత సంబంధింత కాగితాలు తీసుకొని పోచెట్టి మళ్ళీ వచ్చాడు. కాగితాలు అన్నీ చూసి సరిగ్గానే వున్నాయని చెప్పాను.

మా క్లర్క్‌ ఆయన సంతకాలని తీసుకున్నాడు. టైప్‌ చేసిన తరువాత మళ్ళీ ఒకసారి వచ్చి సంతకాలు పెట్టాల్సి వుంటుందని కూడా చెప్పాడు.

పోచెట్టి అలాగే నిల్చున్నాడు.

‘ఏమిటీ’ అన్నట్టుగా నేను అతని వైపు చూసాను.

‘మీ ఫీజు’ అంటూ ఓ చిన్న తువ్వాలు, మూటని బయట నుంచి తెచ్చి నా ముందు వుంచాడు. ఆ మూట మీద కొన్ని వందల రూపాయలు కూడా వున్నాయి.

ఆ మూటలో జామకాయలు వున్నాయని చెప్పాడు.

గతమంతా నా స్మృతి పథంలో మెదిలింది.

భీమన్న గుడి, జామకాయల దొంగతనం, పోచెట్టి మమ్మల్ని పట్టుకోవడం అన్నీ గుర్తుకొచ్చాయి.

నేను ఆలోచనల్లో వుండగానే ”ఇవి మన భీమన్న గుడి తోటలోనివే సార్‌!” అన్నాడు పోచెట్టి గొంతు పెగుల్చుకొని.

అతని ముఖంలో కొంత ఆందోళన, కొంత సంతోషం.

నాకు ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగాయి.

అందులో నుంచి ఓ జామకాయ తీసుకొని తిన్నాను.

చిన్నప్పుడు దొంగిలించిన కాయలకన్నా ఆ కాయ తియ్యగా అన్పించింది. నా బాల్యాన్ని నా దోసిట్లో పెట్టినట్టు అన్పించింది. అదే విషయం పోచెట్టికి చెప్పాను.పోచెట్టి ముఖం వెలిగిపోయింది.
ఫీజు డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాను. మిగిలిన జామకాయలు ఇంటి లోపలికి పంపాను.

భీమన్న గుడి
కాలక్రమంలో భీమన్నగుడి సంఘటన మా స్మృతి పథం నుండి మరుగున పడింది. కానీ మరిచిపోలేదు. వయస్సు పెరిగిన కొద్దీ భీమన్న గుడితో మా బంధం తగ్గిపోయింది.

Other Updates