పార్వతి మల్లయ్య!

ఆయన పేరు పార్వతి మల్లయ్య. నిజానికి ఆయన పేరు మల్లయ్య. పార్వతిగా మారిపోయిన తరువాత ఆయన పేరు పార్వతి మల్లయ్యగా మారిపోయింది. ఆయన పేరు ఎంత విచిత్రంగా వుందో ఆయన వేషధారణ కూడా అలాగే వుటుంది.

ఒ చేతిలో త్రిశూలం. దానికి ఓ గంట. నున్నగా గడ్డం తీసుకున్న మొఖం. రెండు చెంపలకి పసుపు. నుదిటి మీద పెద్ద కుంకుమ బొట్టు. కాలికి వెండి కడియం. కాలి వేళ్లకి వెండి మట్టెలు. మెడలో రాగి గొలుసులు. రెండు చేతులకి వెండి కడియాలు, రాగి గాజులు. మరో చేతిలో ఇత్తడి తాంబాళం. అందులో శివుని ప్రతిమ. అందులో అక్షింతలు. కుడి భుజంకి పెద్ద జోలే. శుభ్రమైన చీరె కట్టులో అతను ఆరడుగుల ఎత్తు, చామన చాయ రంగు. ఇదీ పార్వతి మల్లయ్య రూపం. అతన్ని చూస్తే పిల్లలు భయపడేవారు.

నెలకో, రెండు నెలలకో ఒకసారి మా ఇంటికి బిక్షం కోసం వచ్చేవాడు. ఆయన రాగానే మా అమ్మ పిల్లలందరినీ ఇంటిలోకి ఆయనకు కన్పించకుండా పంపించేది.

ఆయన మా రాజేశ్వరుడిని ఎప్పుడు పెండ్లి చేసుకున్నాడో తెలియదు. అతనిది ఏ వూరో కూడా తెలియదు. తన భర్త రాజేశ్వరుడని అతను చెప్పేవాడు.

మా ఊర్లో మనుషులు దేవున్ని పెళ్ళాడుతారు. అంటే రాజేశ్వరుడిని వివాహం చేసుకుంటారు. స్త్రీలు పెళ్ళాడుతారు. పురుషులూ పెళ్ళాడుతారు. వాళ్ళ వయస్సుతో సంబంధం లేదు. పెళ్ళి కూతుర్లుగా మారి శివున్ని పెళ్లాడి శివ పార్వతులుగా మారుతారు. మా వేములవాడకి భక్తులు దర్శనానికి, మొక్కులు తీర్చుకోవడానికే కాదు రాజేశ్వరున్ని పెళ్లి చేసుకోవడానికీ వస్తారు. అనేక దశాబ్దాలుగా ఈ వివాహాలు జరుగుతున్నాయి. విచిత్రం ఏమంటే ఈ వివాహాలు శ్రీరామ నవమి రోజు జరుగుతాయి. మొదట మా వేములవాడలో దేవుని లగ్గం అంటే శ్రీరామ నవమే. ఆ తరువాత కొంత కాలానికి శివ కల్యాణం చేయడం మొదలు పెట్టారు. శివ కల్యాణం మొదలై దాదాపు 25 సంవత్సరాలు అవుతోంది. అంటే ! మా వేములవాడ హరిహరుల నిలయం. అందుకే ఒకే లగ్గం జరిగేది. అందుకే శివుడిని పెళ్ళి చేసుకోవడం శ్రీరామ నవమి రోజే జరుగుతాయి. ఇప్పటికీ అంతే! భక్తులు దాన్ని దేవుని లగ్గంగా భావిస్తారు.

దేవుని పెళ్ళి రోజు ఊరు ఊరంతా పండుగ వాతావరణం నెలకొని వుంటుంది. ఇనుప త్రిశూలాలు, ఇత్తడి గంటలు, రాగి రింగులు, లింగాలు, శంఖాలు ఒకటేమిటీ సమస్త పెళ్ళి సరంజామా అంతా అమ్మకానికి మా వూరు నిండా సిద్ధంగా వుంటాయి.

దేవుని లగ్గం రోజు కాలి మట్టెలు అమ్మేవాళ్ళు, రాగి కడియాలు, రుద్రాక్షలు అమ్మే వాళ్ళు వూరినిండా కన్పిస్తారు. దేవాలయ ప్రాంగణం, దేవాలయం చుట్టూ ఎటు చూసినా శివునితో పెళ్ళికి సిద్ధం అవుతున్న వ్యక్తులే కన్పిస్తారు.

శివుడిని పెళ్ళి చేసుకోవడం వల్ల తమ బాధలు తీరతాయని కొందరు, ఆరోగ్యం బాగుపడుతుందని మరి కొందరు బాసింగాలు ధరించి దేవునితో పెళ్ళికి సిద్ధమవుతూ వుంటారు. పెళ్ళి చేసుకున్న తరువాత వాళ్ళు పార్వతులు అవుతారు. కొంత మంది వేములవాడలోనే స్థిర నివాసం ఏర్పరుచుకొని బిక్షాటన చేస్తూ, శివున్ని దర్శిస్తూ జీవనం కొనసాగిస్తూ వుంటారు. పాణం మంచిగ లేని పార్వతులు, బీదరికంతో వున్న పార్వతులు వేములవాడలోనే వుండిపోతారు.

పార్వతి మల్లయ్య ఆరోగ్యంగానే వుంటాడు. అతను మా ఇంటికి బిక్షం కోసం వస్తే మా అమ్మ ఎందుకు భయపడేదో మాకు అర్థం కాక పొయ్యేది. అతను రాగానే పిల్లలందరినీ ఇంటిలోపలికి తరిమేసి ఆయనకు దాదాపు అడ్డెడు బియ్యం ఇచ్చేది. ఆ తరువాత రెండు చేతులు జోడించి దండం పెట్టేది.

”చల్లగుండు సత్తెవ్వా” అని ఆశీర్వదిస్తూ వెళ్ళి పోయేవాడు పార్వతి మల్లయ్య.

కిటికీ తలుపు సందుల్లోనుంచి మేం ఇదంతా చూసేవాళ్ళం. అంత బియ్యం ఎవరికీ దానం ఇవ్వగా నేను ఎప్పుడూ చూడలేదు. ప్రొద్దున పూట వచ్చిన వాళ్లకి దోసెడు బియ్యం దానంగా ఇచ్చేది. రాత్రిపూట వచ్చిన వాళ్లకి అన్నం ఇచ్చేది.

చివరికి ఒక రోజు మా అమ్మని అడిగాను.

”అమ్మా! ఇన్ని బియ్యం ఎవరికీ దానం ఇవ్వవు కదా! ఈ పార్వతి మల్లయ్యకి అన్ని బియ్యం ఎందుకు ఇస్తావు”.

”నీకెందుకురా! చిన్న పిల్లవాడివి” అనేది మా అమ్మ.

చివరికి ఓ సారి గట్టిగా అడిగాను.

”ఎందుకు ఆయన వస్తే మమ్మల్ని లోపలికి పంపిస్తావు. భయపడతావు. అన్ని బియ్యం ఆయనకు దానం ఇస్తావు”.

”పార్వతి మల్లయ్య ఎప్పుడో నెలకో రెండు నెలలకో వస్తాడు. అందుకని ఎక్కువ బియ్యం పెడతాను” అంది మా అమ్మ.

”నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు” మా అమ్మని నిలదీశాను. గట్టిగా పట్టుబట్టాను.

ఇక తప్పదని అనుకుందేమో మా అమ్మ, ఇలా చెప్పింది –

”పార్వతి మల్లయ్యకు మంత్రాలు వస్తాయని అంటారు. ఆయనను సంతృప్తి పరచక పోతే మీ ఆరోగ్యం దెబ్బతినేటట్టు మంత్రాలు వేస్తాడని భయం. అందుకే ఆయనకు ఎక్కువ బియ్యం వేసి సంతృప్తి పరుస్తాను. అతను అందరి ఇండ్లల్లోకి వెళ్ళడు. కొంత మంది ఇండ్లల్లోనే బిక్షాటన కోసం వస్తాడు”.

పార్వతి మల్లయ్యకి మా అమ్మ ఎందుకు భయపడేదో, ఎందుకు అన్ని బియ్యం ఇచ్చేదో అప్పుడు బోధపడింది.

దీపావళికి ఒక్క రోజు ముందు వచ్చి మా బాపుకి హారతి ఇచ్చి కానుకలు కూడా తీసుకొని వెళ్ళేవాడు.

అలా కాలం గడిచిపోయింది. వేములవాడ వదిలి చదువుకోవడానికి కరీంనగర్‌కి వచ్చాను.

పార్వతి మల్లయ్య నా స్మృతి పథం నుండి తొలిగిపోయినాడు.

అప్పుడు డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాను.

సెలవులకి వేములవాడకి వచ్చాను. బంగ్లా మీద మిత్రుడు ప్రతాప్‌తో చెస్‌ ఆడుతున్నాను.

సమయం ఉదయం పదకొండు అవుతోంది.

”అమ్మా! సత్యమ్మా! నేను పార్వతి మల్లయ్యను” అన్న మాట విన్పించింది.

ఆటను మధ్యలోనే వదిలి పెట్టి కిందకు పరుగెత్తుకొచ్చాను.

మా అమ్మ నన్ను చూసింది. చిన్నప్పటిలా నన్ను లోపలికి వెళ్లమని గదమాయించలేకపోయింది

కచేరీలోకి వచ్చి నిల్చున్నాను.

పార్వతి మల్లయ్య అట్లాగే వున్నాడు. కొంత వయస్సు మీద పడినట్టు అన్పిస్తోంది.

మా అమ్మ వచ్చి అడ్డెడుతో బియ్యం తెచ్చి ఆయన జోలెలో పోసింది.

మల్లయ్య నావైపు చూస్తూ ”నీ చిన్న కొడుకా” అడిగాడు.

అవునన్నట్లుగా మా అమ్మ తల వూపింది.

పార్వతి మల్లయ్య వెళ్ళి పోయిన తరువాత మా అమ్మ నావైపు చూసి ”నువ్వు ఎందుకు వచ్చావు” అంది.

”నీ భయాలు అర్థరహితం అమ్మ. ఈ రోజుల్లో మంత్రాలు ఏమిటి?” నా విజ్ఞానాన్ని అమ్మ మీద గుమ్మరించాను.

అమ్మ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

పార్వతి మల్లయ్యతో మాట్లాడాలని అన్పించింది. వెంటనే బట్టలు మార్చుకొని గుడివైపు బయల్దేరాను. ప్రతాప్‌ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు.

అప్పటికే పార్వతి మల్లయ్య కనుచూపులో కన్పించకుండా వెళ్ళిపోయాడు.

అతను వుండేది గుడిమీదే. చెరువు దగ్గర వుంటాడని గుర్తు. అందుకని అక్కడికి బయల్దేరాను.

ధర్మగుండాన్ని ఆనుకొని చెరువు. చెరువు కట్ట దగ్గర అతను కన్పించాడు. అతని చుట్టూ ఓ పది మంది పార్వతులు.

నేను అక్కడికి దగ్గరగా వెళ్ళాను.

నన్ను చూసి పార్వతి మల్లయ్య ఆశ్చర్యపోయాడు.

అతన్ని ఏమని పిలవాలో నాకు అర్థం కాలేదు.

చివరికి ఇలా పిలిచాను.

”పార్వతి మల్లయ్యా!”

”ఏం కావాలి” అన్నట్టు నా వైపు చూశాడు.

”ఓసారి మీతో మాట్లాడాలి” అన్నాను.

పార్వతి మల్లయ్య మళ్ళీ ఆశ్చర్యపోయాడు.

తన జోలెని, తాంబాలాన్ని అక్కడపెట్టి నా దగ్గరికి వచ్చాడు.

అతన్ని అంత దగ్గరగా చూడటం అదే మొదటి సారి

”చెప్పుబాబూ!” అమ్మ ఏమైనా చెప్పమన్నదా?” అడిగాడు.

”అదేం లేదు. నేనే మీతో మాట్లాడదామని వచ్చాను. చిన్నప్పుడు మీరు మా ఇంటికి రాగానే మా అందరినీ ఇంటిలోపలికి పంపించేది అమ్మ. మీకు మంత్రాలు వస్తాయని అమ్మ అనేది. ఊర్లో కూడా అందరూ అంటూ వుంటారు. నిజమేనా?”

పార్వతి మల్లయ్య చిన్నగా నవ్వాడు.

”అవును బాబూ! అందరూ అలాగే అనుకుంటారు. నాకు మంత్రాలు వచ్చని భయపడి నాకు నేను అనుకున్న దాని కన్నా ఎక్కువ బియ్యం దానం చేస్తారు. నాకు ఎక్కువ బియ్యం వెయ్యకపోతే వాళ్ళ పిల్లలకు మంత్రం వేస్తానని, దాని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వాళ్ళ భయం”.

”మంత్రాలు ఏమీ లేవు. ఇది సైన్సు చెబుతోంది. నిజంగా మీకు మంత్రాలు వచ్చా, రావా?” అమాయకంగా అడిగాను.

”అవన్నీ నాకు తెలియవు. ఒక్కటి మాత్రం నిజం. నాకు మంత్రాలు రావు. ఆ భయంతో ఎక్కువ బియ్యం వస్తున్నాయని నాకు మంత్రాలు రావని ఎవ్వరికీ చెప్పలేదు. ఈ ప్రశ్నని నన్ను ధైర్యంగా ఇప్పటికి వరకు అడిగిన వాళ్ళు లేరు. నువ్వే మొదటి వాడివి. అందుకే నీకు నిజం చెప్పాను” చెప్పాడు పార్వతి మల్లయ్య.

మళ్ళీ ఇలా చెప్పాడు.

”నాలాగా శివపార్వతులు ఈ వూర్లో చాలా మంది వున్నారు. చాతకాని వాళ్ళు, అనారోగ్యంతో వున్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, నడువగలిగి వున్న ముసలితనం వల్ల నడువలేని వాళ్ళు ఎక్కువ మంది వున్నారు. వాళ్ళు భిక్షాటనకు పోతే వాళ్ళకు ఓ గుప్పిడో, ఓ దోసెడో బియ్యం వేస్తారు తప్ప అడ్డెడు, మాణికడు వేయరు. నాకు వచ్చిన బియ్యంలో నాకు అవసరమైన మేర వుంచుకొని మిగతావి అన్నీ వాళ్ళకు ఇస్తాను”.

తన దగ్గరికి వచ్చిన శివపార్వతులని నాకు చూపించాడు.

ఏం మాట్లాడాలో నాకు తోచలేదు.

పార్వతి మల్లయ్యలో నాకు శివుడు కన్పించలేదు. అన్నపూర్ణ కనిపించింది.

ఆనందమో

పరవశమో

కళ్ళలోంచి కన్నీరు పొంగుకొచ్చింది.

మా వూర్లో తరుచూ వినపడే మాట ‘భిక్షంలో భిక్షం రాజేశ్వరుని భిక్షం’.

– జింబో

Other Updates