తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తయారుచేయడమే తమ లక్ష్యమని, 2018-19 సంవత్సరం నాటికి 24,272 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని విద్యుత్‌శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై అక్టోబరు 5న శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు విద్యుత్‌శాఖామంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కోసం వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ. 91,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.
విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో చర్చ జరగలేదంటే అది టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతగా ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచితే రైతులపై భారం పడుతుందని తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన ఘనత కేసీఆర్‌దే నని ఆయన అన్నారు. పదవుల కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యంగా భావించి ఆనాడు పదవిని తృణప్రాయంగా వదులుకున్న కేసీఆర్ ఈరోజు రైతుల కోసం నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం కృషి వల్లనే ప్రస్తుతం రాష్ట్రంలో కోతలులేని కరంటు అందుబాటులోకి వచ్చిందన్నారు.
వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ను అందించేందుకు 2015-16 సంవత్సరానికి గాను రూ. 4,257 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం సమకూర్చినట్లు తెలిపారు. రాబోయే ఏప్రిల్ నుంచి రైతులకు 9గంటల కరెంటు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్క సంవత్సర కాలంలోనే ప్రభుత్వం నుంచి ఈక్విటీ మద్దతుతో ప్రభుత్వ రంగంలో 5,880 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు రానున్నాయన్నారు.
2018-19 ఆర్థిక సంవత్సరానికల్లా రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 24,272 మెగావాట్లు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో అందరికీ విద్యుత్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,116 కోట్లు మంజూరీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాలలో 400 కేవీ సబ్‌స్టేషన్లు 18, 220 కేవీ సబ్‌స్టేషన్లు 34, 132 కేవీ సబ్‌స్టేషన్లు 90 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు మాసాలలోనే టీఎస్ జెన్‌కో పీఎల్‌ఎఫ్‌ను 74 శాతం నుంచి 80శాతానికి మెరుగుపరచడం జరిగిందని తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కోసం పవర్‌రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు 16.83 శాతం నుంచి 15.98 శాతానికి తగ్గాయన్నారు. 24 గంటలు దశలవారీ లోడ్ రిలీఫ్ వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. గతంలో పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోవడానికే ఏండ్లు గడచిపోయేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డు సమయంలో అనుమతులు తెప్పించగలి గారన్నారు. అలాగే గ్రిడ్ అనుసంధాన ప్రక్రియ విషయంలో కూడా దృష్టి సారించారని తెలిపారు. తాము కరెంటు విషయంలో ఎంతో చేశామని, అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 24 గంటలు నిరంతరాయంగా కరెంటు ఇవ్వడంతో పాటు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలపాల్సివుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో దాన్ని సాధించితీరుతామని స్పష్టం చేశారు.