మహిళల క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందించారు. హైదరాబాద్ చేరుకున్న మిథాలీ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువా కప్పి మిథాలీని సన్మానించారు. కోచ్ ఆర్.ఎస్.ఆర్. మూర్తిని కూడా ముఖ్యమంత్రి శాలువాకప్పి సన్మానించారు. మిథాలీని అద్భుత క్రికెటర్ గా తీర్చిదిద్దారంటూ ప్రశంసించారు.
”ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారు. ఫైనల్ దాకా వచ్చారు. ఫైనల్లో కూడా గెలవడం ఖాయం అనుకున్నాం. దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో ఓడిపోయాం. అయినప్పటికీ మీ జట్టంతా అద్భుతంగా ఆడింది. దేశమంతా మీ ఆట చూసింది. నేను కూడా చూశాను. అంతా మీకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా నువ్వు ఈ టోర్నీలో బాగా ఆడావు. అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాం. అద్భుత ప్రతిభ కనబరిచావు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి నువ్వు గర్వకారణం. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలి. వ్యక్తిగతంగా నా తరుఫున, తెలంగాణ ప్రజల తరఫున మనసారా అభినందనలు. నీకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది” అని మిథాలీతో ముఖ్యమంత్రి అన్నారు.
మిథాలీ రాజ్ కు ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. మిథాలీకి బంజారాహిల్స్‌లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కోచ్ మూర్తికి రూ.25లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మిథాలీరాజ్ తల్లిదండ్రులు లీలారాజ్, దొరై రాజ్, డిజిపి అనురాగ్ శర్మ, సిపి మ్రహేందర్ రెడ్డి, అడిషనల్ డిజి అంజన్ కుమార్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి దినకర్ బాబు, స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.