స్వప్న పరీక్షలకోసం నిరంతరం చదివి తన సర్వశక్తులు ధారపోసింది. స్నేహితులు లేరు. ఇంట్లో వాళ్ళంటె పట్టదు. ఒక్కటేె లక్ష్యం. ఎలాగైనా సరే ఈసారి ఉద్యోగం సంపాదించాలి. అందరికీ జవాబు చెప్పాలి. తానేంటో అందరికీ తెలియాలి. తన గురించి మాట్లాడిన వాళ్ళకి.. తన విజయం గుణపాఠం కావాలి. అని పదేపదే అనుకునేది.
కానీ, మనసులో ఓ మూల తనకు ఉద్యోగం రానట్టు.. తను విపరీతమైన నిరాశలో కూరుకపోయినట్టు; తను బాధతో ఉన్నట్టు… మదిలో దృశ్యం పదేపదే కన్పిస్తుండేది.
రమణ తను అనుకున్న లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం.. దానికోసం నిర్దుష్ట ప్రణాళిక వేసుకున్నాడు. నిపుణుల సలహాలు, పూర్వం ఇలాంటి ఉద్యోగం సంపాదించిన వారి సలహాలతో వాస్తవ దృష్టితో పరిస్థితిని బేరీజు వేసుకున్నాడు. తన శక్తియుక్తులను సానబెట్టుకున్నాడు… తను ఎలాగైనా ఆ ఉద్యోగాన్ని సాధించినట్టు, తనను అందరూ అభినందించినట్టు, పదేపదే దృశ్యం తన మనస్సులో ప్రత్యక్షమవుతుండేది. అది ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. మళ్ళీ మళ్ళీ చదవడానికి రోజంతా ఉత్సాహంగా ఉండేది.
ప్రకాష్ గతంలో పోటీ పరీక్షలు వ్రాసాడు. కానీ విజయం సాధించలేకపోయాడు. ఎందుకు తనకు ఉద్యోగం రావడం లేదోనని విపరీతమైన బాధలో ఉండేవాడు. ఎప్పుడూ చికాకు పడుతూ, ఈ వ్యవస్థను విమర్శిస్తూ చుట్టూవున్న పెద్దలను విమర్శిస్తూ, కావాలనే కొందరు తనకు ఉద్యోగం రాకుండా అడ్డుపడ్డారని.. అందుకోసమే తనకు రాలేదని… ఈ వ్యవస్థ కుళ్ళి పోయిందని.. తనలాంటి మంచి వాళ్ళకు స్థానం లేదని పదేపదే తలచేవాడు. తన మనస్సులో తను ఎలా! విఫలం అయ్యాడో! అలాంటి విషయాల గురించి ఆలోచించాడు… వైఫల్యానికి గురించిన మనో చిత్రాలే తనకు విపరీతంగా వచ్చేవి.. తనను అందరూ గేలి చేసినట్టు.. తను విపరీతమైన అవమానంతో తలదించుకుంటున్నట్టు.. తను ఒంటరిగా మాసిపోయిన బట్టలతో.. ఇంటర్వ్యూలకు వెళ్ళితే ఒక్క జవాబు కూడా చెప్పలేకపోయినట్టు నువ్వు ఎంపిక కాలేదు అని వాళ్ళు చెప్పినట్టు.. తను మానసికంగా కృంగిపోతే అందరూ… అయ్యో పాపం! చదివి చదివి ఇలా అయిపోయాడు, అంటున్నట్టు… ఒకటే దృశ్యాలు మనస్సుకు ఇబ్బంది పెట్టేవి.
తను వాటి గురించి తలచుకుంటూ.. చివరకు అలాగే తయ్యారయ్యాడు. తన కుటుంబం అతని గురించి విపరీతమైన బాధలో ఉంది. ‘ఉద్యోగం లేకపోతే ఇంకా ఏదో పనిచేసుకొని బతుకొచ్చు. ఈ బాధ నాకెందుకురా! నాయనా, అని బాధతో నా దగ్గరకు వచ్చారు.
పై సంఘటనలను, వ్యక్తులను చూస్తుంటే చిత్రంగా లేదు! ఎందుకు ఎంత శ్రమించినా తన మనస్సులో ఏదైతే పదేపదే తిరుగుతుందో అదే జరుగుతుంది.. ఎందుకు? చాలామందికి అంతుపట్టని ప్రశ్న.
గతంలో నేను చిన్నగ వున్నప్పుడు… పెద్దవాళ్ళు ఏదైనా నెగెటివ్‌గా మాట్లాడితే… ‘తప్పుతప్పు… అలా మాట్లాడకూడదు.. తథాస్తు దేవతలుంటారు.. అలా మాట్లాడకూడదు… మన తరఫున శ్రమించాలి.. పని గురించి… వ్యక్తిగా ఎంత బెెస్ట్ పని పూర్తి కావడానికి ఇవ్వగలమో… వేరే ఆలోచన లేకుండా.. ఇవ్వగలగాలి.. ఇలా చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అని నమ్మి పని చెయ్యాలి. అప్పుడు తప్పకుండా పని పూర్తిగా అనుకున్న ఫలితం వస్తుంది. చేస్తున్నంత సేపు.. ‘ఇలా చేస్తే పనికాదు.. నేను తప్పుగా చేస్తున్నాను’ అని మనస్సు మూలలో అనుకుంటూ పనిచేస్తే అది తప్పకుండా వ్యతిరేక ఫలితాన్నే ఇస్తుంది. ఈ అంత: సంఘర్షణ మనలో మనం ఏమి అనుకుంటామో, అది ఏ రకంగా మనకు ఫలితం వస్తుందో తెలుసుకుందాం!
“The power of your subconsciousmind” రచయిత జోసెఫ్ మర్ఫి ఏమంటాడంటే… ‘మిమ్మల్ని పాలించేవి, నియంత్రించేవి మీలో గాఢంగా పాతుకుపోయిన నమ్మకాలు, అనుభూతులే. మీ subconsciousలో బలంగా నాటుకపోయిన నమ్మకం, భావనకాని, ఏదైనాసరే, అదే మీ ఆలోచనలను, చేతలను ప్రతిస్పందనలను నియంత్రిస్తుంది. మీరు దేన్ని అయితే అనుభూతి చెందుతారో దానివైపుకే సాగిపోతారు. మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటారో అలాగే తయారు అవుతారు. కాబట్టి మీ అంత:మనస్సులో మీపట్ల నమ్మకాలు, మీ శక్తియుక్తులపట్ల వున్న అపనమ్మకాలే ఎక్కువకాలం, ఎక్కువమందికి నిజం అవుతుంటాయి. అప్పుడు మనం చాలామందినోట ఓ మాట వింటుంటాం. ‘నేను అనుకుంటూనే వున్నాను’ ‘ఇలాంటిదేదో జరుగుతుందని… అనుకున్నట్టుగానే జరిగింది. ప్చ్! ఏం చేద్దాం!’
ఎందుకిలా జరుగుతుంది మరి! అంటే… నౌకా సిబ్బంది నావి కెప్టెన్ ఆదేశాలకు లోబడి నౌకను నియంత్రించినట్టు మీ ఆదేశాలను మీ subconscious శివరసావహిస్తుంది.
మనలోపల… ఎవరో ఉండి మన గురించిన అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు నిర్ణయిస్తున్నట్లు.. అవి మన జీవితంలో జరుగుతుంటాయి. ఈ అంత: విషయమే నిజం రూపం వేసుకొని మనకు ప్రత్యక్షం అవుతాయి. అప్పుడు మనం అనుకున్నది అయ్యిందే అని ఆశ్యర్యంతో బాధపడతాం, లేదా సంతోషపడతాం.
మీరు కెప్టెన్ స్థానంలో ఉండి మీపట్ల మీరు స్పష్టమైన అవగాహన లేనట్టు వ్యవహరిస్తే, మీకేం కావాలో మీకే తెలియకపోతే, మీ సబ్‌కాన్షియిస్‌మైండ్‌కు ఒక అస్థవ్యస్థమైన సందేశం అందుతుంది. అప్పుడు మీ ‘నావ’ దానికి తోచిన దారిలోకి వెళ్తుంది.
ఒక వ్యక్తి తన గురించి తాను ఎలాంటి అంచనాలను, భావనను కలిగి ఉన్నాడన్నదే ఆ వ్యక్తి జయాపజయాలను నిర్ణయిస్తుంది. ఎలాగంటె, మనకు తెలియకుండానే మన గురించి, మన జీవితం గురించి ఒక ‘స్క్రిప్ట్’ను వ్రాసుకుంటాం.. అది చాలా రహస్యంగా జరిగిపోతుంది. ఆ ‘స్క్రిప్ట్’ ప్రకారమే మన జీవనయానం సాగిపోతుంది. ఒకవేళ ‘స్క్రిప్ట్’ను దాటి పనులు జరిగినా.. ఏదో తప్పు చేశావన్న భావనతో మళ్లీ ఆ ‘స్క్రిప్ట్’ తన నిర్వచనం ప్రకారం నడిపిస్తుంది.. ఆ స్క్రిప్ట్‌లో అన్ని అంశాలు మనల్ని ఉత్సాహంగా ఉండాలా లేదా నిరాశగా ఉండాలా అని నిర్ణయిస్తుంది. నిరంతరం ఉత్సాహంగా… ఉండాలంటే..
(1) మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి (2) మిమ్మల్ని మీరు నమ్మండి (3) ప్రతి రోజూ, ప్రతి విషయంలో నేను మరింతగా మెరుగుపడడానికి శ్రమిస్తాను అని శ్రమించండి.. తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.. భయాలు, ఆందోళనలన్నీ ‘నీడ’లాంటివి.. నీడకు ఏ శక్తి ఉండదు, ఆందోళనకు ఏ శక్తి ఉండదు… విషయాన్ని అర్థం చేసుకుని శ్రమిస్తే.. అందరూ విజయులాగానే కొనసాగుతారు. అందరినీ విజయం వరిస్తుంది… మీ ‘స్క్రిప్ట్’ను సరిచూసుకోండి… ఉత్సాహం మీ ఊపిరౌతుంది.
ఒక వ్యక్తి తన గురించి తాను ఎలాంటి అంచనాలను, భావనను కలిగి ఉన్నాడన్నదే ఆ వ్యక్తి జయాపజయాలను నిర్ణయిస్తుంది. ఎలాగంటె, మనకు తెలియకుండానే మన గురించి, మన జీవితం గురించి ఒక ‘స్క్రిప్ట్’ను వ్రాసుకుంటాం.. అది చాలా రహస్యంగా జరిగిపోతుంది.
డాక్టర్ సి. వీరేందర్