తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు చెరువే ఆదరువు. కాకతీయ కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం పెద్ద సంఖ్యలో జరిగింది. ఆ తరువాత ఆధికారంలోకి వచ్చిన అసఫ్‌జాహీ, కుతుబ్‌షాహీల పాలనా కాలంలో కూడా పాత చెరువులను పరిరక్షిస్తూ మరెన్నో కొత్త చెరువులు కూడా నిర్మించారు. అప్పట్లో చెరువుల నిర్వహణ సజావుగాసాగి, వ్యవసాయం లాభసాటిగా జరిగింది. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై చెరువులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. చెరువుల వైభవం తగ్గినకొద్దీ ఆ చెరువులపై ఆధారపడిన గ్రామీణులూ, గ్రామాలలోని వివిధ వృత్తుల వారు, రైతులూ అష్టకష్టాల పాలయ్యారు. గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. బతుకులు ఛిద్రమైనాయి.

తెలంగాణ పల్లెలకు మళ్లీ జవజీవాలు తెచ్చేందుకు చెరువును బతికించి సకల వృత్తులూ పునరుజ్జీవనం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోకి దిగి, తలపాగాచుట్టి, పలుగు, పార చేతబట్టి మిషన్‌కాకతీయ కార్యక్రమానికి ఉత్సాహపూరిత వాతావరణంలో శ్రీకారం చుట్టారు. మట్టితట్ట నెత్తిన మోసి, ఇతరులకు మార్గదర్శకులయ్యారు. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో మిషన్‌ కాకతీయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏ పల్లెలో చెరువును చూసినా ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్లు, పలుగు, పారలు చేపట్టిన జనంతో సందడి చోటుచేసుకుంది. తమ బతుకు తెరువైన చెరువుల పరిరక్షణకు ఊరుఊరంతా కదలివస్తోంది.

  • సామ్రాజ్యాల కన్నా చెరువులే మిన్న
  • కాకతీయ రెడ్డి రాజులకు దండంపెట్టి
  • మిషన్‌కాకతీయ ప్రారంభిస్తున్నా
  • ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు

‘‘కాకతీయ రెడ్డి రాజులు తమపై దండెత్తే రాజులకు ఒక శాసనం ద్వారా విజ్ఞప్తి చేసిండ్రు. మా రాజ్యంపై దండెత్తితే రాజ్యం గుంజుకున్నా సరే..బురుజులు, కోటలు కూల్చినా సరే, మనుషులను చంపినా సరే కానీ మేము నిర్మించిన చెరువులను మాత్రం పాడుచేయకండి..అవి ప్రజల జీవనాధారాలు. ప్రజలకు అన్నం పెట్టే చెరువులను ధ్వంసం చేయకండని శిలాశాసనంపై వేల సంవత్సరాల క్రితమే రాసిపెట్టారు. అంటే అప్పటి రాజులు చెరువులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది. వెయ్యేండ్ల కిందనే కాకతీయ రెడ్డిరాజులు వాటర్‌షెడ్‌ అంటే ఏందో ప్రపంచానికి తెలియచెప్పిండ్రు. ఎనభై వేల గొలుసుకట్టు చెరువులను తెలంగాణలో నిర్మించిండ్రు. అప్పుడు తెలంగాణ ప్రజలు గొప్పగా బతికిండ్రు. పదిమందికి అన్నంపెట్టే దాతలుగా రైతులు జీవనం సాగించిండ్రు. అందుకే కాకతీయ రెడ్డి రాజులకు దండం పెట్టి చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్ఘాటించారు.

మార్చి 12న నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్‌లోని పాతచెరువు వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ చెరువులు పునరుద్ధరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిషన్‌ కాకతీయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్‌ స్వయంగా గడ్డపారతో చెరువులో మట్టిని తవ్వి తట్టలో ఎత్తుకుని ట్రాక్టర్‌లో వేసారు. ఆయనతో పాటు నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు, వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మ, ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డిలు కూడా గడ్డపారతో మట్టిని తవ్వి తట్టలకు ఎత్తుకుని ట్రాక్టర్‌లో నింపారు.

జిల్లా ఎమ్మెల్యేలు గణేష్‌గుప్త, ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, షకీల్‌, హన్మంత్‌ షిండే, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్‌, రాజేశ్వర్‌, జడ్పీ చైర్మన్‌ డి.రాజు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎంపి పాటిల్‌, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌లతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో సి.ఎం. కేసీఆర్‌ ప్రసంగించారు.

‘కాకతీయ రాజుల కాలం నుంచి కుతుబ్‌షాహీలు, నిజాం రాజులు అందరు కూడా ఇక్కడి చెరువులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి కాపాడారు. ఆంధ్రా పాలకులు వచ్చాకనే ఇక్కడి చెరువలన్నీ పాడైపోయాయి. పూడిక తీతకు నోచుకోలేదు’ అని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిలువ సామర్ద్యం తగ్గిపోయి అవి తాంబాళాల్లా తయారయ్యాయయని, వాటికి మళ్ళీ పూర్వ వైభవం తేవాలన్నారు. యావత్‌ తెలంగాణ ప్రజానీకం ఖచ్చితంగా దీన్నొక యజ్ఞంలా భావించాలె. మన బతుకుదెరువుకు ఆధారమైన చెరువులను నీళ్ళతో కళకళలాడేలా చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. అదృష్టం బాగుండి ఒక్క సంవత్సరం చెరువు నిండితే మూడు సంవత్సరాల దాక సాగునీటికి ధోకా లేకుండా ఉంటుందన్నారు.

రైతులు కూడా చెరువులపై నిర్లక్ష్యధోరణి అవలంభించారని, చెరువులలో మట్టిని పొలాలకు కొట్టడం మరచిపోయారన్నారు. కేవలం రసాయనిక ఎరువులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, ఆ పద్ధతి మానుకోవాలన్నారు. చెరువులో మట్టి ఎంతో సారవంతంగా ఉన్నందున పొలాలకు కొడితే సారవంతంగా మారుతాయన్నారు. అందుకే చెరువుల పునరుద్ధరణ వల్ల సాగునీరు లభించడమే కాకుండా, పొలాలు సారవంతం కావడం, ధాన్యం అధిక దిగుబడి రావడం జరుగుతుందన్నారు. చెరువులు ప్రజల జీవనంలో ఒక భాగమని, ఇలాంటి చెరువుల పునరుద్ధరణలో కూడా కొందరు కాంట్రాక్టర్లు అవినీతికి పాలుపడి పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారన్నారు. అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సి.ఎం. అధికారులను ఆదేశించారు.
సదాశివనగర్‌ పాత చెరువు పూడికతీతకు హరీష్‌రావు రూ. 38 లక్షలు మాత్రమే కేటాయించారని, ఇవి ఏమాత్రం సరిపోవన్నారు. చెరువులో ఎంత పూడిక ఉందో అని తవ్విస్తే ఏడు ఫీట్ల వరకు పూడిక ఉందన్నారు. ఇది తీయాలంటే ఈ డబ్బులు సరిపోవన్నారు. అందుకే తాను ప్రారంభించిన ఈ చెరువుకు మరో కోటిన్నర రూపాయలను తన నిధుల నుంచి ఇస్తున్నట్లు సి.ఎం. ప్రకటించారు.

కామారెడ్డిని జిల్లాగా మారుస్తాం

నిజామాబాద్‌ తర్వాత జిల్లాలోని పెద్ద పట్టణమైన కామారెడ్డిని జిల్లాగా మారుస్తామని సి.ఎం. ప్రజల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. రాష్ట్రంలో నియోజకవర్గాలు ఎక్కువ అవుతాయని, అప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 132 కేవీ సబ్‌స్టేషన్‌, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 11 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఐటీఐ, ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని చెరువుల
మరమ్మతులకు రూ. 30 కోట్లు మంజూరీ ఇచ్చారని, దాన్ని రూ. 60 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

నియోజకవర్గంలో 50వేల ఎకరాలకు సాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని చెరువులు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. రాష్ట్రంలో 46,445 చెరువులు ఉన్నాయన్నారు. మన వారసత్వసంపద అయిన చెరువులను కాపాడు కోవాలన్నారు. ఇలాంటి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకోవడం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. ఇలాంటి పని ప్రారంభించిన సి.ఎం. చరితార్థుడన్నారు. పాత రోజుల్లో చెరువు నీటిని కాపాడడానికి నీరడి ఉండేవాడని, అలా ఇప్పుడు రాష్ట్రంలోని చెరువులన్నింటికి నీరడిలా ఉండి కాపాడతానని మంత్రి పేర్కొన్నారు. పాతరోజుల్లో ఉన్న చెరువుల నీటి నిలువ సామర్థ్యాన్ని తిరిగి తేవడమే మిషన్‌ కాకతీయ లక్ష్యమన్నారు. మిషన్‌ కాకతీయ ప్రజా ఉద్యమంగా నిర్వహించాలన్నదే కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ చెరువులు బాగుంటేనే రైతు బాగుంటాడని, అన్ని కులవృత్తుల వారికి పని దొరుకుతుందని పేర్కొన్నారు. చెరువు మట్టిని పొలాల్లో వేసుకుంటే సారవంతమై అధిక దిగుబడి వస్తుందన్నారు.

kcr‘మిషన్‌ కాకతీయ’కు విరాళాల వెల్లువ చెరువుల పునరుద్ధరణకై ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మిషన్‌ కాకతీయకు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి విరాళాలు వెల్లువలా వచ్చాయి. సైమెట్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ దొడ్డ మోహన్‌రావు కోటి 50 లక్షల రూపాయల చెక్‌ను విరాళంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందచేశారు. ఆయనను కేసీఆర్‌ మనస్ఫూర్తిగా అభినందించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపురం పెద్ద చెరువుతో పాటు తమ స్వగ్రామం లింగాగిరిలో మూడు చెరువులను ఆయన దత్తత తీసుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన రిజెన్సీస్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి బొమ్మలరామారం లోని నల్లచెరువు అభివృద్ధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందచేశారు. నల్లగొండజిల్లా మందాపురం సర్పంచ్‌ సోలీపురం రాంరెడ్డి బెంజెరువారి చెరువు అభివృద్ధికి రూ. 6లక్షల 27వేలు విరాళం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని నీటిపారుదలశాఖ ఇంజనీర్లు తమ ఒకరోజు వేతనాన్ని మిషన్‌ కాకతీయకు అందచేయనున్నట్లు ప్రకటించారు.

చెరువుల పునరుద్ధరణ వల్ల
సాగునీరు లభించడమే కాకుండా,
పొలాలు సారవంతం కావడం,
ధాన్యం అధిక దిగుబడి రావడం జరుగుతుంది. చెరువులు ప్రజల
జీవనంలో ఒక భాగం.

Other Updates