kakatiya-missionతెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ‘మిషన్‌ కాకతీయ’ పనులను నీతిఆయోగ్‌ కమిటీ సభ్యులు వీకే సారస్వత్‌ మెచ్చుకున్నారు. మిషన్‌ కాకతీయనే కాకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని, వీటిని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 10న ఆయన రాష్ట్రంలోని మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించారు. మొదట మెదక్‌జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని పిడిచేడ్‌ గ్రామంలోని లక్ష్మీదేవి చెరువులో జరుగుతున్న పనులు పరిశీలించారు. ఆయనతో పాటు నీతిఆయోగ్‌ సలహాదారు అశోక్‌కుమార్‌ జైన్‌ కూడా పర్యటించారు. అక్కడి పనులు చూసి ఆయన వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల పూడికతీత ద్వారా చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరగడంతో పాటు వొండ్రు మట్టితో రైతుల పొలాలు సారవంతమవుతాయని అధికారులు సారస్వత్‌కు వివరించారు. చెరువుల్లో నీరు ఉంటే సాగునీరు లభించడమే కాకుండా, భూగర్భజల మట్టం కూడా పెరుగుతుందని వారు తెలిపారు. రైతులకు ఎంతో ఉపయోగపడే ‘మిషన్‌ కాకతీయ’ ప్రజలకు ప్రయోజనకారిగా ఉంటుందని సారస్వత్‌ అన్నారు. ఇలాంటి పథకాల వల్ల గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం వారు సిద్ధిపేట నియోజక వర్గంలో పర్యటించారు. అక్కడ గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలను పరిశీలించారు. రాష్ట్రంలో చేపట్టబోతున్న ‘వాటర్‌గ్రిడ్‌’ పనులకు సిద్ధిపేట మంచినీటి పథకమే స్పూర్తి అని తెలిసి దాన్ని కూలంకషంగా పరిశీలించారు.

అనంతరం కరీంనగర్‌ జిల్లాలోని బొమ్మకల్‌ గ్రామ చెరువులో జరుగుతున్న మిషన్‌ కాకతీయ పనులను పరిశీలించారు. తిమ్మాపూర్‌ మండలంలోని నుస్తులాపూర్‌లో పారిశుధ్యపనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సారస్వత్‌ మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌ పనుల వల్ల రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నారు. వీటి ఫలితాలను ప్రజలు వచ్చే అయిదు సంవత్సరాలలో పొందుతారన్నారు. భవిష్యత్తులో అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు. వ్యవసాయానికి ఆధారమైన సాగునీరంతా ఈ చెరువుల ద్వారా సమకూరుతుందన్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, దళితులకు 3ఎకరాల భూమి, రెండు బెడ్‌రూంల ఇండ్లనిర్మాణం, వృద్దులు, వికలాంగులు, వితంతువులకు వెయ్యి, 1500 రూపాయల పెన్షన్‌ తదితర పథాకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

Other Updates