తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాలు పెరగడానికి, గ్రామాలలో రైతులకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌కాకతీయ’ కార్యక్రమం మొదటి విడతలో అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఊపుతో రెండో విడత కార్యక్రమం చేపట్టడానికి ప్రభుత్వం ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఎప్పుడూ చేపట్టని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించింది. కాకతీయ ప్రభువుల కాలంలో చేపట్టిన గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలను తిరిగి పునరుద్ధరించి, ఏ గ్రామానికి ఆ గ్రామం సాగునీటి కొరతలేని గ్రామంగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ సంకల్పం మేరకు ‘మిషన్‌కాకతీయ’ కార్యక్రమం పురుడుపోసుకుంది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులకు వెరవకుండా అయిదు సంవత్సరాలలో రాష్ట్రంలోని చెరువులన్నీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి సంవత్సరం 20శాతం చెరువులు తీసుకుని, అలా అయిదు సంవత్సరాల కాలంలో మొత్తం పూర్తి చేయాలని సంకల్పించారు. మొదటి విడత కార్యక్రమంలో రూ. 2,237 కోట్లు కెటాయించి చెరువులను పునరుద్ధరించారు. నీరుపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు ‘మిషన్‌కాకతీయ’ విజయవంతానికి అహర్నిశలూ శ్రమించారు.
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలను (హైదరాబాద్ మినహా) తిరిగి గ్రామాలలో రైతులను ప్రోత్సాహపరిచారు. ఆయన కృషితో తక్కువ సమయంలో చేపట్టినా కూడా మొదటి విడత విజయవంతమైంది. దీనివల్ల ఆయా గ్రామాలలో చెరువులు నిండడమే కాకుండా భూగర్భజలాలు కూడా పెరిగాయి. భూగర్భ జలవనరులశాఖ రెండు నెలలుగా చేపట్టిన అధ్యయనంలో భూగర్భజలాలు 0.08 మీటర్ల నుంచి 0.97 మీటర్లకు పెరిగినట్లు స్పష్టమైంది. ఈ మిషన్‌కాకతీయను చైనాలోని బ్రిస్క్‌బ్యాంక్ చైర్మన్, నీతిఆయోగ్ చైర్మన్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్, కేంద్ర జనవనరులశాఖ కార్యదర్శి అమర్‌జిత్ సింగ్ తదితరులు ఎందరో ప్రశంసించారు.
రెండవ విడతకు శ్రీకారం..
మొదటి విడత మిషన్‌కాకతీయ విజయవంతంతో రెండవ విడత చేపట్టడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నవంబరు 2న హైదరాబాద్‌లోని జేఎన్‌టీయు ఆడిటోరియంలో ‘మిషన్ కాకతీయ రెండోదశ-సమాలోచనలు’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నీటిపారుదలశాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఆర్థికశాఖా మంత్రి ఈటెల రాజేందర్‌లు హాజరయ్యారు. నీటిపారుదలశాఖకు చెందిన ఎఇ మొదలు ఎస్‌ఇ వరకు హాజరయ్యారు. రెండో విడత ఎలా నిర్వహించుకోవాలో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కిందిస్థాయి ఇంజనీరు మొదలు మంత్రి వరకు అందరూ అహర్నిశలూ శ్రమించడం వల్లనే ‘మిషన్‌కాకతీయ’ మొదటి విడత అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా వారు అందరూ సహకరించారన్నారు. అందుకే ఇది ఘనవిజయం సాధించిందన్నారు. ఈ పథకానికి ఇక్కడి గ్రామాలలో ఉన్న వారే కాకుండా విదేశాలలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు కూడా స్పందించి విరాళాలు అందచేశారన్నారు. ప్రభుత్వం కూడా భారీగా నిధులు కెటాయించిందన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు చిన్న నీటిపారుదలకు రూ. 1400 కోట్లు కెటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది జిల్లాలకే రూ. 2,237 కోట్లు కెటాయించిదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చిన్ననీటి వనరులకు ఇచ్చే ప్రాధాన్యం దీన్ని బట్టే తెలిసిపోతుందన్నారు. ఈ-ప్రోక్యూర్‌మెంట్ ద్వారా పారదర్శకంగా టెండర్లు పూర్తిచేసినట్లు తెలిపారు. నిధులు, టెండర్లు ఇలా ఏ విషయాన్నయినా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసామని, అందులో అన్ని వివరాలను పొందుపరిచామన్నారు.
ఇక నిధుల విషయంలో ఆర్థికశాఖ ఎంతో శ్రద్ధతో పనిచేసిందన్నారు. ఉదయం ఫైలు పంపితే సాయంత్రానికి జీవోలు వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇక వివిధ వర్గాల నుంచి ఎంతో స్పందన వస్తుందని చెబుతూ, యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు తమ ఒకరోజు వేతనాన్ని ‘మిషన్ కాకతీయ’కు ఇచ్చి ఆశీర్వదించారని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ఆశీర్వాదంతో మొదటి విడత విజయవంతమైందన్నారు. మొదటిదశ అనుభవాలను క్రోడీకరించుకుని రెండో విడత కూడా ఇంతకన్నా ఎక్కువ శ్రద్ధతో నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సమాజానికి ఎంతో ఉపయోగపడే ఈ పథకాన్ని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మివేసినట్లేనన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో ‘మిషన్‌కాకతీయ’ మంచిపేరు సంపాదించిందన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు అమలుచేసే బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ఇక మంత్రి హరీష్‌రావు గాలికంటే వేగంగా పనిచేస్తారని, పండగలు, విందులు, వినోదాలు అన్నీ వదులుకుని మిషన్‌కాకతీయ గురించి శ్రమిస్తున్నాడని ప్రశంసించారు. మొత్తంగా మిషన్‌కాకతీయ రెండోదశ మరింత విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.