మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) పథకం కింద రంగారెడ్డి జిల్లాలోని మేడ్చెల్, కుత్బుల్లాపూర్ నియోజవర్గాల్లోని 104 గ్రామాలకు, మేడ్చెల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు తాగునీటిని ఏప్రిల్ నెలాఖరునాటికి పూర్తి స్థాయిలో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 160 కోట్లు వ్యయంతో చేపట్టే మిషన్ భగీరథ పనుల వలన మేడ్చెల్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, కుత్బుల్లాపూర్ మండలాల్లోని 2.12 లక్షల మందికి సురక్షితమైన తాగునీటిని అందించడం జరుగుతుంది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపుల నిర్మాణాలతో పాటు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. మేడ్చెల్‌లో పెద్ద సంపు, డబిల్‌పూర్, గిర్మాపూర్, బోగారంలలో ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం, 271 కిలోమీటర్ల మేరకు పైపులైన్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతున్నది.
మిషన్ భగీరథ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకుగాను డిసెంబర్ 16న జిల్లాలోని మేడ్చెల్ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మిషన్ భగీరధ ఎండి ఎస్.పి.సింగ్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ పనులను పరిశీలించారు. నియోజకవర్గంలోని గిర్మాపూర్, సోమారం, డబిల్‌పూర్, ఘణపూర్, బోగారంలలో నిర్మించే సంపులు, పైపులైన్ల నిర్మాణాల పనులను వారు పరిశీలించారు. ఏప్రిల్ నాటికి పనులన్నింటిని పూర్తి చేసి ప్రజలకు సురక్షితమైన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతలో రాజీలేకుండా నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలని, దాదాపు 270 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయాల్సి ఉన్నందున పైపులైన్ల డిజైన్ వచ్చే 20 సంవత్సరాల అవసరాలు తీర్చేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని వారు సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నాణ్యత లోపిస్తే కాంట్రక్టర్లపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
ఇప్పటికే గోదావరి జలాలను నగరానికి తీసుకురావడం జరిగిందని ఘణపూర్ రిజర్వాయర్ నుండి కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడకు గోదావరి జలాలను విడుదల చేయడం జరిగింది. వాటర్ గ్రిడ్ పనులు పూర్తయిన పక్షంలో పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేందుకు వీలవుతుంది.