tsmagazine
మిషన్‌ ‘భగీరథ ప్రాజెక్టు’ వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు
పూర్తయిన చోట ప్రారంభంలో వచ్చే చిన్నచిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలని సూచించారు. పనుల్లో వేగం, నాణ్యత పెంచడానికి, మిషన్‌ భగీరథను మరింత సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. శాఖను పునర్వ్యవస్థీకరించాలని సీఎం నిర్ణయించారు.

‘మిషన్‌ భగీరథ’ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ లో సమీక్ష నిర్వహించారు. మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్‌, మిషన్‌ భగీరథ సలహాదారులు జ్ఞానేశ్వర్‌, మనోహర్‌, సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మిషన్‌ భగీరథ ప్రాజెక్టులో మెజారిటీ శాతం పనులు పూర్తయ్యాయని, వేలాది గ్రామాలకు ఇప్పటికే నీరు చేరుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పనులతో పాటు, మరికొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు. ఆగస్టు 14 అర్థరాత్రిని డెడ్‌ లైన్‌ పెట్టుకుని అన్ని గ్రామాలకు ఆరోజు లోగా నీరు (బల్క్‌ గా) అందించేలా పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. అంతర్గత పనులు కూడా సమాంతరంగా కొనసాగాలని, మరో నెల, నెలన్నర వ్యవధిలో ఆ పనులు కూడా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చెప్పారు. లక్షా 50 వేల కిలోమీటర్ల పొడవైన పైపులైను, 1400 మోటార్లు, 180 మెగావాట్ల విద్యుత్‌, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన పెద్ద ప్రాజెక్టు కావడంతో అక్కడక్కడ వాల్వ్‌ ల లీకేజీ లాంటి సమస్యలు ఉత్పన్నమవడం సహజమని సీఎం అభిప్రాయపడ్డారు. అలాంటి బాలారిష్టాలను గుర్తించి, ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలని సీఎం చెప్పారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించే వర్క్‌ ఏజన్సీలు, అధికారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

మిషన్‌ భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేయడంతో పాటు, మరింత సమన్వయంతో, సమర్ధతతో పనులు నిర్వహించడానికి ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. శాఖను పునర్వ్యవస్థీకరిం చాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. ఇఎన్సీగా పనిచేస్తున్న సురేందర్‌ రెడ్డిని ప్రాజెక్టు సలహాదారుడిగా నియమించాలని అధికారులను ఆదేశించారు. సీఇ కపాకర్‌ రెడ్డిని ఇఎన్సీగా నియమించాలని చెప్పారు. ప్రస్తుతం ఆర్‌.డబ్ల్యు.ఎస్‌.లో నలుగురు సీఇలున్నారని, విధులను సమర్ధంగా నిర్వహించేందుకు సీఇల సంఖ్యను తొమ్మిదికి పెంచాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులు చేస్తున్న వర్క్‌ ఏజన్సీలకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు పెండింగ్‌ పెట్టవద్దని సూచించారు.

మిషన్‌ భగీరథ పనులను ఇకపై ప్రతీ రోజు పర్యవేక్షించి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని చెప్పారు. ఎక్కడ పనులు పూర్తయితే అక్కడ నీరు సరఫరా చేస్తూ ముందుకుపోవాలని సూచించారు. విద్యుత్‌ శాఖ సబ్‌ స్టేషన్లు, పంపు హౌజుల నిర్మాణానికి అవసరమైన సిబ్బంది ని నియమించాలని ఆదేశించారు. లో ఓల్టేజి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. విద్యుత్‌ శాఖ, మిషన్‌ భగీరథ అధికారులు సమావేశమై విద్యుత్‌ లైన్లను ప్రాజెక్టుకు అనుసంధానం చేసే విషయంపై తుది చర్యలు తీసుకోవాలని చెప్పారు.
tsmagazine

గడువుకన్నా ముందే పూర్తయిన విద్యుత్‌ పనులు
నిర్ణీత గడువుకన్నా ముందే మిషన్‌ భగీరథ పథకానికి కావాల్సిన విద్యుత్‌ సరఫరా వ్యవస్థను తెలంగాణ విద్యుత్‌ సంస్థలు వందకు వంద శాతం సిద్ధం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ పంపుసెట్లు నడవడానికి అనువుగా రూ.280 కోట్ల వ్యయంతో కొత్త సబ్‌ స్టేషన్లు, పవర్‌ లైన్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌ కో- జెన్‌ కో సీఎండి డి. ప్రభాకర్‌ రావు వెల్లడించారు. విద్యుత్‌ సంస్థలు చేసిన ఏర్పాట్లపై ఆయన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు సమర్పించారు. మిషన్‌ భగీరథ పథకం విద్యుత్‌ సంబంధ వ్యవస్థలన్నీ 2018 ఆగస్టు 15 నాటికి పూర్తి కావాలని గతంలో ముఖ్యమంత్రి గడువు విధించారు. ఈ గడువుకన్నా నెల రోజుల ముందే జూలై 15 నాటికే పనులన్నీ పూర్తి చేసి, మిషన్‌ భగీరథ పథకానికి అప్పగించినట్లు సీఎండి ప్రభాకర్‌ రావు చెప్పారు.

180 మెగావాట్ల విద్యుత్తును నిరంతరాయంగా ఈ పథకం కోసం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని, డెడికేటెడ్‌ లైన్లు కూడా వేశామని ప్రభాకర్‌రావు చెప్పారు. ట్రాన్స్‌ కో ఆధ్వర్యంలో మహబూబ్‌ నగర్‌ జిల్లా గౌరిదేవిపల్లిలో, నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఎల్లూరులో 220/11 కెవి సబ్‌ స్టేషన్లు నిర్మించినట్లు వెల్లడించారు. మొత్తం 44 సబ్‌ స్టేషన్లు, 603.57 కిలోమీటర్ల మేర 33 కెవి లైన్లు, 603.3 కిలోమీటర్ల 11 కెవి లైన్లు, 46 పవర్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు, 314 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎస్‌.పి.డి.సి.ఎల్‌. పరిధిలోని ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ జిల్లాల్లో రెండు 220/11 కెవి సబ్‌ స్టేషన్లు, పదహారు 33/11 సబ్‌ స్టేషన్లు, 249.94 కిలోమీటర్ల 33 కెవి లైన్లు, 254.94 కిలోమీటర్ల 11 కెవి లైన్లు, 126 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్‌.పి.డి.సి.ఎల్‌. పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇరవై ఆరు 33/11 కెవి సబ్‌ స్టేషన్లు, 353.63 కిలోమీటర్ల 33కెవి లైన్లు, 348.36 కిలోమీటర్ల 11 కెవి లైన్లు, 46 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 188 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటల పర్యవేక్షణతో ఈ వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేస్తాయని చెప్పారు.

Other Updates