ayoghరాష్ట్రంలో ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించే మిషన్‌ భగీరథ పథకాన్ని అభినందించారు నీతి అయోగ్‌ వైస్‌ ఛైర్మెన్‌ అరవింద్‌ పనగారియా. తాగునీటి కొరత, నీటి సంబంధ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలంటే మిషన్‌ భగీరథ లాంటి ప్రాజెక్టు కావాలన్నారు. మిషన్‌ భగీరథతో మొత్తం దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌ గా నిలిచిందని పనగారియా మెచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తరుచుగా ఉన్నతస్థాయి సమావేశాల్లో మిషన్‌ భగీరథ గురించి చెపుతుంటారని పనగారియా గుర్తుచేశారు. ఒక రోజు పర్యటనకోసం ఆగస్లు 12న హైదరాబాద్‌ వచ్చిన అరవింద్‌ పనగారియాతో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హోటల్‌ ప్లాజాలో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి హాజరైన పంచాయతీరాజ్‌ జాయింట్‌ సెక్రటరీ శ్రీధర్‌, RWS & SENC సురేందర్‌ రెడ్డి మిషన్‌ భగీరథపై విజువల్‌ ప్రజెంటేషన్‌ తో పాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడమే కాకుండా మిషన్‌ భగీరథను ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. దాంతోపాటు పథకం లక్ష్యాలు, యాక్షన్‌ ప్లాన్‌ను చెప్పారు. ఇంటింటికి సురక్షిత నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగనన్న ముఖ్యమంత్రి వాగ్దానాన్ని అధికారులు పనగారియా దష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణతో ప్రాజెక్టు పనులు అనుకున్నదానికంటే వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇందుకు గజ్వేల్‌ సెగ్మెంట్‌ పనులే నిదర్శనమన్నారు. రెండు సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన గజ్వేల్‌ సెగ్మెంట్‌ పనులను అత్యంత నాణ్యతతో 11 నెలల్లోనే పూర్తి చేశామని చెప్పారు.

గజ్వేల్‌ సెగ్మెంట్‌ పనులు జరిగిన తీరును తెలుసుకున్న పనగారియా, భగీరథ అధికారులను, ఇంజనీర్లను ప్రశంసించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకంటే కూడా మెరుగైన ప్రమాణాలతో తెలంగాణలోని ఇంటింటికి మంచినీటిని అందిస్తున్నామని అధికారులు చెప్పడంతో పనగారియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

భగీరథ పైప్‌లైన్‌లతో పాటే ఆఫ్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేసి ఇంటింటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఎలా ఇస్తారో అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుకు చేతనైనంత ఆర్థిక సహాయం చేయాలని పనగారియాను జాయింట్‌ సెక్రటరీతో పాటు ఈ.ఎన్‌.సి కోరారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్టార్టప్‌ అధ్భుతం : స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి టీ-హబ్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అభినందించారు. ఆగస్టు 13న టీ-హబ్‌ను సందర్శించిన అమితాబ్‌ ఎంటర్‌ప్రెన్యూర్లతో ముచ్చటించారు. స్టార్టప్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుత వాతావరణంలో దీనిని తీర్చిదిద్దిందని ప్రశంసించారు. టీ-హబ్‌కు అండగా నిలవాలని కేంద్రానికి ప్రతిపాదిస్తామని నీతి ఆయోగ్‌ సీఈవో హామీ ఇచ్చారు. ఐటి కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, రాష్ట్ర ప్రణాళిక ముఖ్యకార్యదర్శి బి.పి. ఆచార్య, టీ-హబ్‌ సిఈవో జే. కృష్ణన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Other Updates