godతెలంగాణలో 20వ శతాబ్దపు పూర్వార్ధంలోనే పౌరాణిక పాత్రలకు అపూర్వరూపకల్పన చేసిన తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు. ఇంటిపేరు ఆసూరి కారంచేడు. తెలంగాణలో సకల రంగాల్లో ప్రతిభావంతులెందరో పరిస్థితుల ప్రభావంతో తెరమరుగయిన తీరునే రామాచార్యులు కూడా విస్మృతుడైనాడు. ఆయన మహబూబ్‌ నగర్‌ జిల్లా, కల్వకుర్తి తాలూకా, మార్చాల గ్రామంలో 1899లో సంప్రదాయ కటుంబంలో మంగమ్మ – శ్రీనివాస దీక్షితులకు జన్మించారు. బాల్యంలో ఆయన విద్యాభ్యాసం పాఠశాలలో జరుగలేదు. మహావిద్వాంసుడైన వట్టెంపెద్ద శాస్త్రుల శిష్యరికంలో సంస్కృతం అభ్యసించారు.

ఆయన చిత్రకళ ఎవ్వరి వద్దా అభ్యసించలేదు. అది ఆయన సహజాతం. చిత్రకళపై ఆయనకున్న అభినివేశం చూసి, తెలంగాణలో ప్రసిద్ధులు, తమ బంధువు, హైదరాబాద్‌ స్టేట్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ సాహితీ వేత్త, గోలకొండ పత్రికా సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డికి పరిచయం చేశారు. ఆ పరిచయం స్నేహంగా మారింది. రామాచార్యుల చిత్రకళాసక్తిని గమనించిన సురవరం ప్రతాపరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులైన మాడపాటి హనుమంతరావు, ప్రముఖులు మందుముల నరసింగరావులను సంప్రదించి, ఆర్ధిక సహాయం చేసి, బందరు జాతీయ కళాశాలకు చిత్రకళాభ్యాసనం కొరకు పంపారు. ఆయన అక్కడ 1925 జులై నుండి 1926 మార్చి వరకు ప్రమోదకుమార్‌ ఛటోపాధ్యాయ ఆచార్యత్వంలో ‘నవవంగ సంప్రదాయ చిత్రకళ’ లో ‘ఏ’ సర్టిఫికేటు పొందారు. ఆ కళాశాలలోనే కవి, రచయిత, ప్రఖ్యాత చిత్రకారుడు అడవిబాపిరాజు, చిత్రకారులు కౌతా రాంమోహన శాస్త్రి, కౌతా ఆనంద్‌ మోహన్‌, గుర్రం మల్లయ్యలు వారి సహాధ్యాయులు, తరువాత బెంగాల్‌లో రవీంద్రనాథ ఠాగూరు స్థాపించిన ‘శాంతి నికేతన్‌’లో చేరి చిత్రకళలో స్వల్పకాలిక కోర్సు పూర్తి చేశారు. నాటి హైదరాబాద్‌ నగర కొత్వాలు రాజా బహ ద్దూరు వెంకట్రాుుుమారెడ్డి, రామాచార్యులకు ఫోటోగ్రఫీలో శిక్షణ ఇప్పించారు. ఆయన చిత్రకళతో పాటు ఫోటో గ్రఫీలో కూడా ప్రావీణ్యం సంపాదించారు.

వీరి చిత్రాలన్నీ సంప్రదాయబద్ధమైన హిందూపురాణ పాత్రలకు రూపకల్పనలే. వీరి చిత్రాల్లో అధిక భాగం వస్త్రంపై చిత్రించినవే. ధౌతం, ఘట్టితం, లాంఛితం, వర్ణితం అనే వస్త్రచిత్ర కళా పద్ధతులను అనుసరిస్తూ ఏకాగ్రతతో సాగిపోయారు. రామ పట్టాభిషేకం, సరస్వతి, లక్ష్మీ, గజలక్ష్మీ, ధనలక్ష్మీ, రామకృష్ణులు, లక్ష్మీనారాయణులు, విష్ణువు వీరు వేసిన చిత్రాలు. ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన గోలకొండ కవుల సంచిక ముఖపత్ర చిత్రం ‘వీణాపాణి సరస్వతి’ వీరువేసిందే. వీరి చిత్రాలు 1927నాటి ‘సుజాత’ మొదలగు పత్రికల్లో ప్రచురణ పొందాయి. వీరికి చిరకీర్తిని సంపాదించి పెట్టింది సురవరం వారి తార్కిక ఊహాజనితమైన ‘మీసాల కృష్ణుని’ రూపకల్పన, ఈ చిత్రం 1938లో సురవరం వారి ‘హిందువుల పండుగలు’ గ్రంథóంలో అచ్చయింది. ఆ చిత్రం మీద సంప్రదాయవాదులు పెద్ద దుమారం లేపారు. ఇలా అనుకూల ప్రతికూల ఖండన మండనాలతో ఆ చిత్రం ప్రసిద్ధమైపోయింది. ఆ మీసాల కృష్ణుని చిత్రాన్ని సురవరం వారు గోలకొండ పత్రిక కార్యాలయంలో తాను ఆసీనుడయ్యే కుర్చీ పైభాగంలో గోడకు అమర్చి, వచ్చిన వారికి చూపి వ్యాఖ్యానించే వారట. ఆ చిత్రాన్ని నేటి వరకు తండ్రిమీది గౌరవంతో వారిపెద్ద కూతురు సరోజనమ్మ (86) తన కూతురు ప్రవీణ, అల్లుడు మధుసూదన్‌ రెడ్డి సహకారంతో పదిలంగా భద్రపరిచి చరిత్రకు కానుకగ అందించడం అభినందనీయం! రామాచారి చిత్రాలు లక్నో, కలకత్తా, మద్రాసు అడయార్లలో ప్రదర్శింపబడి బహుప్రశంసలందుకున్నాయి. వీరి చిత్రాలు హైదరాబాద్‌ ఆబిడ్స్‌ తాజ్‌మహల్‌ హోటల్‌తో పాటు బంధువుల యిండ్లలో భద్రంగా వున్నాయి.

వీరి చిత్రాలు బహుళ మూర్తిమయమై, అద్భుత వర్ణసమ్మేళనంతో, రేఖా సారళ్యంతో, ప్రసన్న ముఖాకృతులతో సమ్మోహనకరమైనవీ సంక్లిష్టమైనవి. 1949 నుండి వీరు స్వయంగా కెమెరా తయారుచేసి, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రెండవ కుమారుడు నరసింహాచార్య సహకారంతో ఆర్‌.కె. చారి స్టూడియో పేరుతో కొంత కాలం నడిపారు. ఆ సందర్భంలో మహబూబ్‌నగర్‌ను సందర్శించిన జవహర్‌లాల్‌ నెహ్రూ, శాంతాబాయి మొదలగు వారి ఫోటోలు తీశారు. బూర్గుల వారి కార్యాలయ ఫోటోగ్రాఫర్‌గా వున్నారు. కల్వకుర్తి తాలూకా వ్యాప్తంగా వారు చిత్రించిన ‘రూపచిత్రాలు నేటికీ వున్నాయి.

రామాచారి జీవన వివరాల్లోకి వస్తే ఆయన నిరాడంబరుడు. గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితుడై ‘స్వయంసేవ’కు నిర్వచనమ య్యాడు. స్వయంగా చరఖాపై దారంతీసి, బట్టలు నేసి ఒంటిపై ఒక కండువా, పంచెతో జీవితమంతా నడయాడాడు. చెప్పులు తానే స్వయంగా తయారు చేసుకుని ధరించేవాడు. సిరిచాపలు అల్లడం నేర్చుకోవడానికి బూర్గుల వారి సహకారంతో వరంగల్లు జైలు ఖైదీల దగ్గరికి వెళ్లి నేర్చుకున్నాడు. ఇటుకలు తయారుచేసి స్వయంగా వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసుకున్నాడు. 1961 లో మార్చాలలో ప్రతిష్ఠాత్మకంగా ‘సోమయాగం’ నిర్వహించి సోమయాజి అయ్యారు. ఆయనలో ఒక చిత్రకారుడే కాదు, మంచి ప్రౌఢకవి కూడా దాగివున్నాడు. గోలకొండ కవుల సంచికలో ‘ప్రార్థనము’ శీర్షికన వారి చిక్కని పద్యకవిత్వం వుంది.

ఇంతటి పెద్దల ప్రాపకం వున్నా, అద్భుతమైన చిత్రాలను సృష్టించినా, నిరాడంబరంగా జీవిస్తూ సమాజానికి సందేశప్రా యుడైనా ఆయనకు సమాజంలో రావలసినంత పేరు, ప్రతిష్ఠలు రాలేదు. క్రమంగా విస్మృత యవనికంలోకి జారిపోయారు. కార ణాలు అన్వేషిస్తే చిత్రకళకు సమాజంలో తగినంత ఆదరణ లేక పోవడం, ఆయనకు సన్మానాలంటే ఇష్టంలేక వ్యక్తిగత ప్రతిష్ఠకు పాకులాడక పోవడం, నిజాం పాలనలో, తరువాత ప్రవాసాంధ్రుల పక్షపాతధోరణికి ఎరకావడం, బహుకుటుంబ భారాన్ని ప్రయాసతో ఈదడం మొదలైనవన్నీ ఆయన కీర్తికి అడ్డుగోడలయ్యాయి. సురవరం ప్రతాపరెడ్డిని గురించి వ్రాసిన రచయితలందరూ రామాచార్య పేరును విస్మరించడం పెద్దకారణం !

అయితే ఆన్ని రంగాల్లో తెలంగాణా అస్తిత్వాన్ని, ఆధిక్యాన్ని ఆహ్వానిస్తున్న వర్గాలకు, తెలంగాణ రాష్ట్రావతరణ అనంతరం 100 సంవత్సరాల్లోని 150 చిత్రకారులను నమోదు చేసిన ఆర్ట్‌ ఏ తెలంగాణలో మార్చాల రామాచార్యులకు స్థానం కల్పించక పోవడం విచారకరం. మనవాళ్లను మనం గౌరవించుకునే సంప్రదాయాన్ని ఆహ్వానిస్తూ, తరువాత సంచికల్లోనైనా వారికి సముచిత స్థానం కల్పించాలని కోరుకుందాం.

Other Updates