ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబం అనాధ అయిపోతుంది. మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లను ముందుగానే గుర్తించడం ద్వారా ఆ తల్లులను కాపాడుదాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.
ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ నుంచి జలవిహార్ వరకు క్యాన్సర్ అవగాహన వాక్ ను నిర్వహించారు.
మంత్రి ఈటెల రాజేందర్ ఈ వాక్‌లో పాల్గొని క్యాన్సర్ పై అవగాహన ఆవశ్యకతను తెలిపారు.దేశంలో క్యాన్సర్, గుండెజబ్బులు రోజు రోజుకి పెరుగుతు న్నాయి. అనేక లక్షల మంది చనిపోతు న్నారు. క్యాన్సర్ ను ముందుగా గుర్తిద్దాం… క్యాన్సర్ బారి నుంచి కాపాడుకుందాం… క్యాన్సర్ ను తరిమికొడదాం అంటూ వాక్ నిర్వహించారు. మహిళల్లో ఈ అవగాహన ఎంతో అవసరం. ముందుగా గుర్తిస్తే అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్‌ను నయం చేయవచ్చు, బ్రతికించొచ్చు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో క్యాన్సర్‌ను గుర్తించే పరికరాలతో కూడిన మొబైల్ వాహనాలను నడిపిస్తూ, పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పీహెచ్‌సీల్లో ఏరియా ఆసుపత్రిలో క్యాన్సర్‌ను గుర్తించే పరికరాలు అందుబాటులో ఉంచుతున్నం.
ఆశ వర్కర్లకు క్యాన్సర్ను గుర్తించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాము. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాము. త్వరలో పెట్ స్కాన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. 60 కోట్లతో అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 11 టీచింగ్ హాస్పిటల్స్‌లో క్యాన్సర్‌ను గుర్తించేందుకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఎడ్యుకేషన్- ప్రివెన్షన్- ట్రీట్మెంట్ మూడు విధానాలతో క్యాన్సర్‌ను త్వరలోనే అధిగమిస్తామని, ఆరోగ్య శ్రీలో క్యాన్సర్ చేర్చి పేదవారికి ఉచితంగా చికిత్స అందేలాగా చూస్తున్నామని మంత్రి తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సిఎం కెసిఆర్ ఆలోచనలతో వైద్య ఆరోగ్య శాఖలో వినూత్న నిర్ణయాలు తీసుకుని దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రాన్ని నిలబెట్టడానికి కషి చేస్తున్నాము అని ఈ వాక్ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.