మనకు నాయకుల కొదువలేదు. కానీ, భవిష్యత్తును ఊహించి, గతాన్ని గమనించి, ముందుకు నడిపించేవాడే అసలయిన నాయకుడు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాల వారసత్వం అమోఘమైంది. అఖండమైంది. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వైభవం తెరమరుగైపోయింది. తెలంగాణ భాష, యాస, పండుగలు, పర్వాలు, ఆటలు, పాటలు ప్రోత్సాహంలేక నీరసించిపోయాయి. సంస్కృతి, సంప్రదాయాలు అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడిరది. వీటన్నింటినీ పునరుద్ధరించిననాడే తెలంగాణ చరిత్రకు తిరిగి న్యాయం చేకూరుతుంది.
స్వాతంత్య్రోద్యమానికి ముందునుంచే పోరాటాల పురిటిగడ్డ మన తెలంగాణ. మహాకవి దాశరధి కీర్తించినట్టుగా ‘తెలంగాణ కోటి రతనాల వీణ’. ఎందరో త్యాగధనులు, ఎన్నో వనరులు, మరెంతో చారిత్రక సంపద మన వారసత్వం.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమసారథి మాత్రమేకాదు. పరిపాలనా దక్షునిగా, ముందుచూపుగల నాయకునిగా నిరూపించుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి గతంలో జరిగిన అన్యాయాలను, తెరమరుగైన చరిత్రను తవ్వితీసి రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా పరుగులు తీయించడం ఆయన ముందు చూపుకు నిదర్శనం.
గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసినా, బోనాల ప్రాభవానికి ప్రాణప్రతిష్ట చేసినా, బతుకమ్మ వైభవాన్ని ట్యాంక్‌బండ్ సాక్షిగా చాటిచెప్పినా, కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడానికి నడుం బిగించినా అది మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్.కే చెల్లింది.
హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలన్న ఆలోచన ఎంత అద్భుతం. ఒక్కసారి ఆ సుందర దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఆనందంతో తనువు పులకించ కమానదు. మరి ఆ సుందర స్వప్నం సాకారం కావాలన్నా, సకల సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నా అందరి సహకారం అవసరం.
అందుకే, ముందుచూపుతో రాష్ట్రాన్ని మునుముందుకు నడిపిస్తున్న ప్రభుత్వానికి చేయూతనివ్వడం అందరి బాధ్యత. ముఖ్యంగా యువతరం తరంగాల్లా తరలిరావాలి. ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలి.
అప్పుడే, మనం కలగంటున్న ‘బంగారు తెలంగాణ’ సుసాధ్యం చేసుకోగలం.
` డాక్టర్ ఆర్.వి. చంద్రవదన్, ఐఎఎస్
కమీషనర్ & పబ్లిషర్