నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న గ్రామాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. ఆయా గ్రామాల ప్రజలు కోరుకున్న తరహాలో మోడల్ విలేజ్‌లను ఏర్పాటుచేస్తున్నది. రాష్ట్రంలో తొలిసారి కొత్తచట్టం (21/2017) ప్రకారం పునరావాసం, పునర్ ఉపాధి కింద సిద్దిపేట జిల్లా అనంతగిరి రిజర్వాయర్‌లో ముంపు గ్రామమైన చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లిని సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లి పరిధిలో నిర్మిస్తున్నారు. సర్వే నంబర్ 772లో 7.18 ఎకరాల్లో కొచ్చగుట్టపల్లి పునరావాస గ్రామ నిర్మాణానికి నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మీరు చూపిన నమ్మకం, విశ్వాసానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం.. మీ దీవెనలు ఉంటేనే అందరికీ మేలు జరుగుతుంది.. కరువు ప్రాంతాలకు గోదావరి జలాలు వస్తే కష్టాలు తీరుతాయి.. అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ తాపత్రయం.. రిజర్వాయర్ల కింద ఉన్న ఆయకట్టు రైతులు పంటలు పండించుకొని ఎంత సంతోషంగా ఉంటారో.. భూములు కోల్పోయిన మీరూ.. అంత కన్న ఎక్కువ సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత తమపై ఉందన్నారు. వచ్చే వానకాలంలో అనంతగిరి రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపుతామని నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లి శివారులోని 772 సర్వే నంబరులో అనంతగిరి రిజర్వాయర్ ముంపు గ్రామమైన కొచ్చగుట్టపల్లి పునరావాస కేంద్రానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, స్థానికులు, ప్రజాప్రతినిధులతో కలిసి డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు.
ఈ గ్రామంలో గుడి, బడి, అంగన్‌వాడీ కేంద్రం, దవాఖాన, కమ్యూనిటీ భవనాలు, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కొచ్చగుట్టపల్లిలో కేసీఆర్ ఆ రోజుల్లో హన్మాండ్ల గుడి కట్టించారని, ఇప్పుడు కొత్తగా నిర్మించుకుంటున్న ఈ మోడల్ విలేజ్‌లోనూ కట్టిస్తామని, దీనికి సీఎం కేసీఆర్ సహాయాన్ని తీసుకుందామని మంత్రి చెప్పారు. ఒక్కో కుటుంబానికి 250 గజాల విస్తీర్ణంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ ఆర్‌అండ్‌ఆర్ కాలనీని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రాబోయే ఐదారు మాసాల్లోనే డబుల్ బెడ్‌రూం ఇండ్లు పూర్తి చేసుకొని వచ్చే దసరా రోజు గృహ ప్రవేశాలు చేసుకుందామని చెప్పారు. భూనిర్వా సితులు ఏ చట్టం ప్రకారం కోరుకుంటే ఆ చట్టం ప్రకారం తమ ప్రభు త్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వమంటే అదే మాదిరిగా ఇస్తామని తెలిపారు. కొచ్చగుట్టపల్లి గ్రామ ప్రజలు జీవో 120 (21/2017) చట్టం ప్రకారం కోరుకున్నారు వారికి అదే తరహాలో అందిస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు.
నూతనంగా నిర్మిస్తున్న మోడల్ విలేజీకి ప్రభుత్వ భూమి 7 ఎకరాల 18 గుంటలు, అదనంగా 4 ఎకరాలు కొనుగోలు చేసి మొత్తం 11 ఎకరాల 18 గుంటల్లో 145 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించనున్నారు. కొచ్చగుట్టపల్లి గ్రామం లో 104 కుటుంబాలు, చెల్కలపల్లిలో 2, ఎల్లాయిపల్లిలో26, అల్లీపూర్‌లో13 మొత్తం 145 కుటుంబాలకు ఇక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించనున్నారు.
మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు ముట్రాజ్‌పల్లి వద్ద..
కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద 8 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వీటిలో ఏడు గ్రామాల భూసేకరణ పూర్తి కాగా మిగిలిన ఒక గ్రామంలో 50 శాతానికి పైగా పూర్తయిందని, మిగతాది కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ ముంపు గ్రామాలకు గజ్వేల్ పక్కన ఉన్న ముట్రాజ్‌పల్లి వద్ద పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొండపోచమ్మ రిజర్వాయర్ కింద రెండు గ్రామాలు మునుగుతున్నాయని వారంతా భూములు ఇచ్చారని, పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అన్నారు. వీరికి తున్కి బొల్లారం వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారం పది రోజుల్లో ముట్రాజ్‌పల్లి, తున్కి బొల్లారం వద్ద పునరావాస కేంద్రాలకు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు.
నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం రిజర్వాయర్ల కింద ముంపునకు గురైన గ్రామాల వారికి ఫిషింగ్ సొసైటీని ఏర్పాటుచేసి వాటిలో సభ్యత్వం కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దీంతో ఆ రిజర్వాయర్‌లో చేపలు పట్టుకొని ఉపాధి పొందే హక్కులు ఉంటాయన్నారు. ప్రతి ఏటా చేపల పెంపకం, పట్టుకోవడానికి అర్రాజ్ వేస్తే మత్స్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం సొసైటీలో సభ్యత్వం పొందిన ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు. మోడల్‌కాలనీగా నిర్మించుకుంటున్న ఈ గ్రామానికి మీరే పేరు నిర్ణయించుకోవాలని సూచించారు. గ్రామ పునర్నిర్మాణానికి మహిళలు, పురుషుల నుంచి ఇద్దరేసి సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రా జెక్టు ఎస్‌ఈ వేణు, ఈఈ ఆనంద్, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నముండ్ల కమల రామచంద్రం, స్థానిక సర్పంచులు సత్తవ్వ, రామస్వామి, ఎంపీటీసీలు పుష్పా భూంరెడ్డి, బాలయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.