magaతెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఒక రోజు ముంబై పర్యటనలో పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ముందుగా ఉదయం ఐసీఐసీఐ బ్యాంకు సియివో చందా కొచ్చర్‌తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌, వుమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌, డిజిటల్‌ ఇనిషియేటివ్స్‌ పైన మంత్రి కొచ్చార్‌తో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టి-ఫండ్‌ లో భాగస్వాములు కావాలని కోరారు. తర్వాత మంత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. జేయస్‌డబ్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ యండి సజ్జన్‌ జిందాల్‌తో సమావేశం అయ్యి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సమావేశం తర్వాత మంత్రిపైన సజ్జన్‌ జిందాల్‌ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధి పట్ల మంత్రికి ఉన్న విజన్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పట్ల మంత్రి కెటి రామారావుకు ఉన్న నిబద్ధత, అలోచనలు ఇతర రాజకీయ నాయకులకు కూడా ఉంటే దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని ట్వీట్‌ చేశారు.

తర్వాత లూపిన్‌ యండి నీలేష్‌ గుప్తతో సమావేశం అయిన మంత్రి తెలంగాణ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సాయంత్రం జరిగిన వార్షిక గ్లోబల్‌ పెట్టుబడిదారుల సమావేశంలో ”స్టార్ట్‌ అప్‌ స్టేట్‌గా మూడేళ్ల తెలంగాణ ప్రయాణం” అనే అంశంపైన మంత్రి ప్రసంగించారు. తాము ఒక స్టార్ట్‌అప్‌ కంపెనీలాగా ఉన్నతమైన నిబద్ధత, పట్టుదలతో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, తాము రూపొందించిన పారిశ్రామిక పాలసీ, ఇతర పాలసీలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, పెట్టుబడుల సేకరణ వంటి బహుముఖ లక్ష్యాలతో ముందుకు పోతున్నామని తెలిపారు. అనంతరం కేటీఆర్‌ ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌తో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సమస్యలపైన వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సవివరమైన లేఖను అందజేయడం జరిగింది. దాదాపు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఆర్బీఐ నుంచి కావాల్సిన మద్దతు పైన మంత్రి వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చిన్నతరహా పరిశ్రమల పారిశ్రామికోత్పత్తి 45 శాతం ఉందని, మొత్తం 40 శాతం ఎగుమతులు చిన్నతరహా పరిశ్రమల నుంచే వస్తున్నాయని మంత్రి తెలిపారు.

అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఆశించిన మేర చిన్నతరహా పరిశ్రమలకు సహకారం లభించడం లేదని మంత్రి తెలిపారు. చాలా సందర్భాల్లో ఇవి చిన్న తరహా పరిశ్రమలకు సిక్‌ పరిశ్రమలుగా గుర్తించి వేలం వేయడం జరుగుతుందని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలను ఏన్పీఏలు (NPA)గా గుర్తించడంలో ఆర్బీఐ ఇచ్చిన techno viability study, కనీస 17 నెలల గడువు వంటి మార్గదర్శకాలను చాలా సందర్భాల్లో ఉల్లంఘిస్తున్నాయని మంత్రి గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని ఒక ప్రభుత్వ బ్యాంకు అక్కడి చిన్న తరహా పరిశ్రమను చీూూగా గుర్తించిన 15రోజుల్లోనే వేలం వేసిన విషయాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 69,120 గుర్తింపు పొందిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలున్నాయని, ఇందులో సుమారు 8,618 సిక్‌ యూనిట్లుగా గుర్తించబడ్డాయని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ పేరిట ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇందుకోసం సుమారు వంద కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వంలోని వివిధ శాఖల తాలుకు సహకారంతో పాటు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి అందవలసిన ఆర్ధిక సహకారం అందించే దిశగా పనిచేస్తుందని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ప్రత్యేక ఆర్ధిక సంస్ధ (NBfC)గా గుర్తించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను ఆర్బీఐ అందించాలని మంత్రి కోరడం జరిగింది.

Other Updates