kaleswaram‘ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్‌

ఉర్వారుకమివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయమామృతాత్‌’

కష్టాలనుండి, మృత్యువునుండి రక్షించమని పరమశివుడిని వేడుకుంటూ భక్తులు మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తారు. మన హిందూ దేవతల్లో శివుడు ఆదిదేవుడుగా కొలువబడుతాడు. హిందు వుల ప్రధాన ఆరాధ్య దైవం పరమశివుడు. మనకున్న పండుగల్లో మహాశివరాత్రి ప్రధానమైంది. ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం, శివ పార్వతుల కల్యాణం జరిగిన రోజుగా కూడా భావిస్తారు. చాంద్రమానం ప్రకారం మాఘమాసంలో కృష్ణ చతుర్దశినాడు శివుని జన్మ నక్షత్రమున ఆరుద్ర నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. శివుడు ఈరోజే లింగా కారంలో ఉద్భవించాడని శివపురాణంలో ఉంది. ప్రతిమాసంలో శివరాత్రి వస్తుంది. దీన్ని మాస శివరాత్రి అంటారు. కాని మాఘ మాసంలో వచ్చే ఈ శివరాత్రినే ‘మహాశివరాత్రి’ అంటారు.

ఈ పండుగను భక్తులు శివుడికి బిల్వదళాలతో, ఉపవాసాలతో, జాగరణలతో ప్రీతి కలిగించి అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలు, జాగరణ సమయంలో శివలీలల కథా పారాయణాలు చేస్తారు. ప్రధాన శైవ క్షేత్రాల్లో మూడు రోజుల ఉత్సవాలు, జాతరలు నిర్వహిస్తారు. పూజారులు, ఋత్విక్కులు పఠించే నమక, చమకాలు, మృత్యుంజయ మంత్రాల వల్ల శివరాత్రి పండుగ శక్తి అధికమై, భక్తులకు ఆ ఫలాలు అందుతాయి.

తపస్సు, యోగం, ధ్యానం వంటి వాటితో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తి మనలో పాజిటివ్‌ ఎనర్జీని పెంపొదిస్తుంది. శివుడి నుండే యోగసంప్రదాయం మొదలైంది. శక్తి స్వరూపుడు, కాల స్వరూపుడు, ఆదిమధ్యాంత రహితుడైన పరమశివుడిని ఆరాధిస్తే, మానవులకు, పశు పక్ష్యాదులకు మోక్షం తప్పక సిద్ధిస్తుందని పురాణ గాథలు, ప్రత్యక్ష అనుభవాలు మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. అటు వంటి పరమశివుడు ఎక్కడ ఏ రూపంలోనైనా కొలువై

ఉండవచ్చు. శక్తి సర్వాంతర్యామి. అతడికి ఒక కోవెల నిర్మించి అందు లో నిక్షిప్తం చేయడం మనకు సాధ్యం కాదు. కానీ మానవులందరి స్థాయి ఒకేవిధంగా ఉండదు. కొందరు పూజతో, కొందరు అర్చనతో, కొందరు స్తోత్రంతో, కొందరు జపంతో తమ భక్తిమార్గాన్ని, మోక్ష మార్గాన్ని ఎంచుకుంటారు. ఎవరి ఆనందం స్థాయిలో వారిని భగ వంతుడు అనుగ్రహిస్తాడు. అందుకే మన భారతదేశంలో లక్షలాదిగా శివుడికి దేవాలయాలు నిర్మించబడ్డాయి. తెలంగాణాలో కూడా వందలు, వేల సంఖ్యలో శివాలయాలు ఉన్నాయి. ప్రసిద్ధ, ప్రాచీన శైవక్షేత్రాలను ఈ సందర్భంగా దర్శించుకుందాం.

శ్రీశైల ఉత్తర ద్వారంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉమా మహేశ్వరం. ఇది మహబూబ్‌నగర్‌ జిల్లాలో నల్లమల అడవి ప్రాంతంలో కొండలో కలిసిపోయి ఉంటుంది. సంవత్సరం మొత్తం కొండలోనుండి నీరు నిరంతరం ప్రవహిస్తూ ప్రకృతి రమణీయంగా కన్పిస్తుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుండి 100 కి.మీ. దూరంలో శ్రీశైలం వెళ్లే దారిలో ఈ క్షేత్రం ఉంది.

పురాణాల ప్రకారం పార్వతీదేవి పరమశివుడి గురించి తపస్సు చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చాలామంది మహర్షులు వందల సంవత్సరాల పాటు శివుడి గురించి ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్లు స్కంద పురాణం వల్ల తెలుస్తుంది. ఉమామహేశ్వరాన్ని దర్శించుకొని మాత్రమే శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలి. అప్పుడే శ్రీశైల యాత్ర పరిపూర్ణమైనట్లని పెద్దలు చెప్తారు.

ఉమామహేశ్వర స్వామి ఆలయం ఒక కొండమీద ఉంది. ఈ కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీనికి పక్కన పాపనాశిని

ఉంటుంది. ఈ పాపనాశిని నుండి ఐదు ధారలుగా ఒకేచోటునుండి ప్రవహిస్తుంది. ఈ కొండ క్రింది ప్రాంతాన్ని భోగమహేశ్వరం అని పిలుస్తారు. ఇక్కడ ఐదు గుడులలో ఐదు శివలింగాలున్నాయి. వీటిని పంచలింగాలని అంటారు. అదేవిధంగా ఇక్కడ జంటలింగాల దేవాలయం కూడా ఉంది.

కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న

వరంగల్‌ జిల్లా కొమురవెల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది. ఇతర ఆలయాలకు భిన్నంగా ఇక్కడ ‘పుట్టమన్ను’చే స్వామి విగ్రహం ప్రతిష్టించబడింది. 500 సంవత్సరాల క్రితం తయారుచేయబడిన ఈ విగ్రహం నేటి వరకు చెక్కుచెదరకుండా భక్తుల పాలిట కల్పతరువై వెలిసి ఉంది. స్థానిక అర్చకుల కథనం ప్రకారం స్వామి విగ్రహం నాభి ప్రాంతంలో పుట్టు లింగం ఉందని ప్రతీతి. యాదవుల ఆడపడుచైన ‘గొల్ల కేతమ్మ’ను లింగ బలిజల ఆడపడుచైన ‘బలిజ మేడమ్మ’ను స్వామి వివాహం చేసుకున్నట్లు, ఆ కారణంగా స్వామికి ఇరుపక్కలా గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మల విగ్రహాలుంటాయి. స్వామి వారికి వీర శైవ ఆగమం ప్రకారం లింగ బలిజలు పూజలు నిర్వహిస్తారు.

ప్రతీ సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమయ్యే కొమురవెల్లి మల్లన్న జాతర ఉగాది వరకు కొనసాగుతుంది. సంక్రాంతి పండుగ ముందు రోజు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. జాతర సమయంలో ‘బోనం – పట్నం’ అనే మొక్కుబడులను భక్తులు చెల్లించుకుంటారు. జాతర చివర్లో, హోళీ పండుగ ముందు ‘పెద్ద పట్నం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో వీరశైవ పూజారులు వీరభద్రుడ్ని, భద్రకాళిని పూజించి రాత్రి వేళ చతురస్రాకారంలో టన్నుల కొద్దీ కట్టెలను పేర్చి అగ్ని ప్రతిష్ట చేస్తారు.

వరంగల్‌ పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఐనవోలు గ్రామముంది. ఇక్కడ కాకతీయులు కట్టించిన మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది. ఇక్కడి ప్రధాన దైవతం ‘ఐనవోలు మల్లన్నగా’ ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయాన్ని కాకతీ రెండవ ప్రోలుని కుమారుడు రుద్రదేవుడు నిర్మించినట్లు సిద్ధేశ్వర చరిత్ర వల్ల తెలుస్తోంది. ఆలయానికి తూర్పు, దక్షిణ దిశల్లో రెండు కీర్తి తోరణాలు నిర్మించబడ్డాయి.

ఐనవోలు మల్లన్న బ్రహ్మూెత్సవాలు ప్రతీ శివరాత్రి సందర్భంగా జరుగుతాయి. అశ్వ, నంది, పర్వత, రావణ వాహనాలను అధిరోహించి, చివరి రోజు రథారూఢుడై పుర వీధుల్లో స్వామి ఊరేగింపు జరుగుతుంది. అయిదవ రోజు అగ్ని గుండాల కార్యక్రమం, వసంతోత్సవం, పుష్పయాగం నిర్వహించబడతాయి.

కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం

హైదరాబాదుకు 30 కి.మీ. దూరంలో భవానీసమేత శ్రీ రామలిం గేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది త్రేతాయుగం నాటిదని ఐతిహ్యం. పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా హనుమత్‌ సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చెనపుడు ఇక్కడి కొండలు, చెట్లు, ఆహ్లాదమైన ప్రకృతిని చూసి శివలింగం ప్రతిష్టించాలని సంకల్పించగా మహర్షులు ముహూర్తాన్ని నిర్ణయించారు. రాముడు హనుమంతుడిని శివ లింగాన్ని తీసుకురమ్మని వారణాసికి పంపెను. హనుమంతుడు కావల్సిన శివలింగాన్ని ఎంచుకోలేక సందిగ్ధావస్థలో 101 శివ లింగాలను తీసుకొచ్చాడట. కానీ ముహూర్త సమయం మించిపోవడంతో రాముడు వ్యాకలుడై ఉండగా, స్వయంగా శివుడే ప్రత్యక్షమై లింగ రూపాన్ని రాముడికి అందించాడట. హనుమంతుడు వచ్చే సరికి లింగ ప్రతిష్ట పూర్తి అయినది. రాముడు తాను తెచ్చిన లింగాలను ప్రతిష్టించలేదనే బాధతో లింగాలన్నింటినీ తోకతో చుట్టి విసిరివేశాడట. దాంతో కీసర గుట్ట పరిసర ప్రాంతాల్లో లింగాలన్నీ చెల్లాచెదురైనాయి. ఇప్పటికీ కీసర పరిసర ప్రాంతాల్లో మనకు చాలా శివ లింగాలు కనిపిస్తాయి.

వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి దేవాలయం

తెలుగుదేశాన్ని పాలించిన, పౌరుష పరాక్రమాలకు మారుపేరుగా నిలిచిన కాకతీయుల కాలంలో వేయి స్తంభాల గుడి నిర్మించబడింది. ఇందులో పరమ శివుడు రుద్రేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. విశిష్ట నిర్మాణ శైలితో కూడిన ఈ ఆలయాన్ని క్రీ.శ. 1138 – 1145 మధ్య కాలంలో కాకతి రుద్రదేవుడు నిర్మించాడు. ఆలయం చుట్టూ చెక్కబడిన శిల్పాలు, వాటిని చూడడానికి సుమారు పది అడుగుల ప్రదక్షిణా పథం ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తయిన ద్వారం నిర్మించబడింది. దీనికి ఎదురుగా సూర్య దేవాలయం, దక్షిణాభిముఖంగా వాసుదేవాలయం ఉన్నాయి. కాబట్టి ఈ వేయి స్తంభాల గుడి త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధిచెందింది. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన నంది విగ్రహం జీవం ఉట్టిపడేలా ఉంటుంది. హనుమకొండలో ఉన్న ఈ చారిత్రక రుద్రేశ్వర స్వామి దేవాలయం వేయి స్తంభాల గుడిగా కాకతీయుల కళా విభవానికి అద్దం పడుతుంది. కాకతీయ రాజులు ఇక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా భద్రకాళీ ఆలయానికి, వరంగల్‌ కోటకు, రామప్ప దేవాలయానికి వెళ్ళేవారని చెబుతారు. రుద్రేశ్వరాలయంలో నిత్య పూజలు, అభిషేకాలతో పాటు కార్తిక పౌర్ణమి, మహా శివరాత్రి, శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

వేములవాడ – కోడెమొక్కుల రాజరాజేశ్వరస్వామి దేవాలయం

తెలంగాణలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో వేములవాడ అగ్రగణ్యమైంది. ప్రధాన దైవం శ్రీరాజరాజేశ్వరుడు. ఈ ఆలయాన్ని చాళుక్యవంశ రాజులు నిర్మించారు. జగత్పతి అయిన పరమేశ్వరుడు ఇక్కడ నివాసం ఉండడం వల్ల ఈ క్షేత్రం భక్తులకు పుణ్యస్థలంగా ప్రసిద్ధి పొందింది.

వృత్రాసురుని చంపిన ఇంద్రుడు బ్రహ్మ హత్యా దోషాన్ని నివారించు కునే ప్రయత్నంలో అనేక క్షేత్రాలను దర్శించినాడు. అయినా అతనికి ఫలితం లభించలేదు. దేవగురువు బృహస్పతి సూచన మేరకు రాజేశ్వర క్షేత్రాన్ని చేరుకొని, ధర్మకుండంలో స్నానం చేసి, దేవదేవుని దర్శించి బ్రహ్మహత్యాదోషం నుండి విముక్తుడైనాడు.

చాళుక్యరాజులలో గొప్పవాడు రెండవ అరికేసరి. ఇతడి తంత్ర పాలకుడు పెద్దనార్యుడు. రాజేశ్వరదేవుని వద్దకు వచ్చే భక్తులకు అన్నదాన సత్రాలు వేములవాడలో ఉండేవి. పెద్దనార్యుని కోరిక మేరకు సత్రాల నిర్వహణకు శతవర్తన విస్తారమైన భూమిని, 8 నివర్తనాల నీరునేలను దానమిస్తూ శాసనం వేయించాడు. ఈ శాసనం వల్ల వేములవాడ చాళుక్యుల చరిత్ర తెలుసుకోడానికి వీలవుతుంది.

వేములవాడలో ప్రధాన ఆలయమైన రాజేశ్వర స్వామి ఆలయం కాక అనేక ఇతర ఉప ఆలయాలున్నాయి. రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయం, కాశీ విశ్వేశ్వరాలయం, కోదండ రామాలయం, ఉమా మహేశ్వరాలయం, బాలా త్రిపురసుందరీ దేవి ఆలయం, బాల రాజేశ్వరాలయం, విఠలేశ్వరాలయం, సోమేశ్వరాలయం, భీమేశ్వరాలయం, కనకదుర్గ, మహాలక్ష్మి ఆలయాలు, బద్ది పోచమ్మ గుడి (శీతలాదేవి ఆలయం) ద్వాదశ లింగాలు, శివ పంచాయతనములు మొదలైన దేవతల ఆలయాలు వివిధ కాలాల్లో నిర్మించబడి నాటినుండి నేటివరకు పూజలందుకుంటున్నాయి.

కష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం వాడపల్లి. ఇది కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రదేశం. దీనికి మూడు వైపులా నీరు, ఒక వైపు భూభాగం ఉంది. ఇది నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఏకైక జలదుర్గం. దీనిచుట్టూ లోతైన కందకం ఉండి బలిష్టంగా నిర్మించబడింది.

వాడపల్లిలో రెండు ప్రాచీన, ప్రసిద్ధ శైవ, వైష్ణవ క్షేత్రాలు నిర్మించ బడినాయి. రాష్ట్ర రాజధాని నుంచి జహీరాబాదు వెళ్ళే మార్గంలో ఝరాసంగమనే గ్రామంలో పరమశివుడు సంగమేశ్వర స్వామిగా వెలసినాడు. ఈయననే కేతకీ సంగమేశ్వరుడని కూడా అంటారు. పూర్వం ఈ ప్రాంతం కేతకీ వనమని, శౌనకాది మునులు ఇక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడున్న గుండాన్ని ‘అమృత గుండం’ అంటారు.

కాళేశ్వరం – ముక్తేశ్వర, కాళేశ్వర స్వామి దేవాలయం

భారతదేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం కాళేశ్వరాలయం ప్రత్యేకత. ఈ క్షేత్ర ప్రస్తావన స్కాంద, గౌతమీ పురాణాల్లో కనిపిస్తుంది. దేవాలయంలో మొదట కాళేశ్వరుడిని (యముడు) పూజించి తర్వాత ముక్తేశ్వరుడిని (శివుడు) పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీనికి ఒక కథ ప్రచారంలో ఉంది. ముక్తేశ్వర స్వామిని దర్శించిన భక్తులకు స్వామి ముక్తినివ్వడంతో యముడికి పని లేకుండా పోయిందట. ఆయన శివుడికి మొరపెట్టుకోగా తన పక్కనే యముడిని సైతం లింగాకారంలో నిల్చోమన్నాడట. తనని అర్చించి యముడిని అర్చించకుండా వెళ్ళే వారికి ముక్తి దొరకదు. అట్టి వారిని యముడు నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట.

ముక్తేశ్వర స్వామి లింగంలో విశేషంగా రెండు రంధ్రాలుంటాయి. వీటిలో నీటిని పోసి అభిషేకం చేస్తే మైలు దూరానికి ఆవల ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని చెబుతారు. చారిత్రకంగా వేంగి రాజైన విష్ణువర్ధనుడు కాళేశ్వర రాజ్యాన్ని జయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం 26 కోనేరులను కలిగి పెద్ద పట్టణంగా విలసిల్లింది. కాకతి ప్రోలరాజు బంగారంతో తులాభారం తూగి స్వామికి అర్పించాడట. ముక్తేశ్వర, కాళేశ్వర స్వాములతో పాటు ఇక్కడ సరస్వతి ఆలయం, రామాలయం, ఆది ముక్తేశ్వర ఆలయం, బ్రహ్మాలయం కూడా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలో నల్లగొండ పట్టణానికి 3 కి.మీ. దూరంలో పానుగల్లు గ్రామం ఉంది. ఈ గ్రామం కందూరు చోళులు, కాకతీయులకు రాజధానిగా నిలిచింది. చారిత్రకంగా పానుగల్లుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రముఖ శివ కవి పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో పానగల్లును ప్రస్తావించడం జరిగింది. పానగల్లు నగరంలో శిథిల శివాలయాలు, నందీశ్వర విగ్రహాలు, పానవట్టాలతో కూడిన శివలింగాలు, శివుని పానవట్టం ఆకృతి కలిగిన రాళ్ళు ఈ ప్రాంతంలో లభించడం వలన ‘పానవట్టపు కల్లు’ క్రమంగా పానగల్లుగా మారి ఉండవచ్చని చారిత్రకుల కథనం.

పానగల్లులో ఎన్నో శిల్పకళా నిలయాలైన దేవాలయా లున్నాయి. వాటిలో ఛాయా సోమేశ్వరాలయం ముఖ్యమైంది. ఈ క్షేత్రాలే కాక ఇంకా తీర్థాల సంగమేశ్వరస్వామి ఆలయం, పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం, సలేశ్వరం శివాలయం, భావిగి భద్రేశ్వరస్వామి ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయం, రామప్ప, దేవాలయం, ఖాజీపేట మల్లికార్జున దేవాలయం…. ఇట్లా ఇంకా చాలా దేవాలయాలు అతి పురాతనమ్కెనవి, ప్రసిద్ధమైనవి తెలంగాణా అంతటా ఉన్నాయి.

Other Updates