newతెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశమందిరంతో కూడిన నూతన భవన సముదాయానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మార్చి 5న పంజాగుట్టలో (ప్రస్తుత క్యాంపు కార్యాలయం పక్కన) శంకుస్థాపన చేశారు. అత్యంత నిరాడంబరంగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింగ్ రావు, ఆర్ అండ బి శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుతమున్న క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహించుకోవడానికి సందర్శకులను కలుసుకోవాడానికి అనువుగా లేనందున కొత్త కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత జూబ్లీహాల్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి నిర్వహణ కోసం కెటాయించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించాలన్నా, ఇతర ముఖ్య సమావేశాలు జరుపుకోవాలన్నా అనువైన సమావేశ మందిరమే లేదు. కలెక్టర్ల కాన్ఫరెన్సును హోటళ్లలో పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది.

ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించుకోవాలంటే జెఎన్టీయూకో, అగ్రికల్చర్‌ యూనివర్సిటీకో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కూడా తన అధికారిక నివాసంలో ప్రతీ రోజు సమీక్షలు నిర్వహిస్తారు. విధాన నిర్ణయాలు చేయడం కోసం, పరిపాలన సమన్వయం కోసం ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహి స్తారు. దీనికోసం కూడా ఎంసీఆర్ హెచ్ఆర్డీకో మరో చోటుకో వెళ్లాల్సి వస్తున్నది. ఓ ఐదొందల మంది ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే వారికి నిలువ నీడ కూడా ఉండడం లేదు. పలితంగా సం దర్శకులను కూడా ముఖ్యమంత్రి కలవలేకపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిత్యం సమావేశాలు పెట్టుకోవడానికి వీలుగా, కనీసం వెయ్యి మంది పట్టే సమావేశ మందిరంతో కూడిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం ఉండే విధంగా పంజాగుట్టలోని 8.9 ఎకరాల స్థలంలో భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించారు.

Other Updates