గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి అవరోధాలను అధిగమిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన సందర్భంగా కరీంనగర్ జిల్లా రైతులు 202 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఇత్తడి, వెండి పాత్రలలో తెచ్చిన గోదావరి జలాలను ముఖ్యమంత్రికి అందజేశారు.
రైతు నాయకుడు రఘువీర్‌సింగ్, జడ్.పి.టి.సి ప్రీతి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలానికి చెందిన 210 మంది రైతులు పాదయాత్రగా మార్చి 20న క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఎంతో శ్రమకోర్చి తనను కలుసుకోవడానిక వచ్చిన రైతులను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి ఆతిధ్యమిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్. రైతులనుద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ జిల్లాలు ఆంధ్రలోని గోదావరి జిల్లాలను మించిపోయే రోజులు త్వరలోనే రానున్నాయన్నారు. ఈ ఎండాకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణం జరుగుతుందని సి.ఎం. ప్రకటించారు. పొరుగు రాష్ట్రంతో గత పాలకులు పరిష్కరించలేని దశాబ్దాల నీటి జగడానికి తెరదింపడం తనాకెంతో ఆనందంగా వున్నదన్నారు.