తెలంగాణలో
పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటిచెప్పాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగుభాష కీర్తి పొందింది. నికోలస్ కోంటే అనే పాశ్చాత్య పండితుడు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా కొనియాడారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్యభారతి సుందర తెలుంగు అని కీర్తించారు. మన తెలంగాణ ప్రాచీన కాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం.
చరిత్రకు అందినంత వరకు తెలంగాణలో 2000 ఏండ్ల పూర్వం నుంచే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రిక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన హాలుని ‘గాథా సప్తశతి’లో మన తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద బొమ్మలమ్మగుట్టపై ఉన్న జినవల్లభుని శాసనం కంద పద్యాలలో ఉండటం విశేషం. దీనిని బట్టి క్రీ.శ. 947 నాటి తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెబుతున్నది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ఉరుతర గద్య పద్యోక్తుల కన్న సరసమై పరగిన జాను తెనుగులో కావ్యసృష్టి చేస్తానని ప్రతిజ్ఞ చేసి, అచ్చ తెలుగు పలుకుబడికి పట్టం కట్టిన పాల్కురికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి.
తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన ‘బసవ పురాణం’, తొలి శతకం ‘వృషాధిప శతకం’, తొలి ఉదాహరణ కావ్యం ‘బసవోదాహరణం’ పాల్కురికి సోమన వెలువరించిన అనర్ఘ కావ్యరత్నాలు, తొలిగా సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీనిని బట్టి తెలుగుభాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదాంశం. తేట తెలుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోనబుద్ధారెడ్డి వెలువరించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగులో తొలి ద్విపద కావ్యం.
మెదక్ జిల్లా పటాన్‌చెరువు నివాసి పొన్నిగంటి తెలగన రచించిన ‘యయాతి చరిత్రం’ తొలి అచ్చ తెలుగు కావ్యం. సకల నీతి సమ్మతం అనే తొలి నీతిశాస్త్ర గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి. తొలి కథా సంకలన కావ్యం ‘సింహాసన ద్వాత్రింశిక’ను రచించిన కొఱవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీవ్‌ుగల్ నివాసి. చాటు పద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమకవిది వేములవాడ. ‘వాణి నా రాణి’ అని ప్రకటించిన జైమినీ భారత కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లా వాసి.
రాచకొండనేలిన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు, కవిరాజు ూడా. తెలుగువారి పుణ్యపేటిగా భావించే బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతం మధురభక్తికి, మంజుల పదవిన్యాసానికి, మనోహరమైన అలంకారిక శైలికి ఆలవాలమై అజరామర కీర్తి పొందింది. ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వ్యర్థి, త్య్రర్థి, చతురర్థి కావ్యాలు, చిత్ర, బంధ అవధాన పద్యవిద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. శిష్ట సాహిత్యంతోపాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు. నిరక్షరాస్యులైన శ్రామిక జనుల నోటి నుంచి ఆశువుగా వెలువడి, అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న సజీవనిధులు. ఆయా శ్రమ సందర్భాల్లో పాడుకునే నాటుపాటలు, రాటుపాటలు, మోటపాటలు, కల్లాల దగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసుర్రాయి పాటల్లో పల్లెజనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది.
వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడిపాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమి పాటలు, అసోయి ధూల అని పాడే పీరీల పాటలు ప్రజల సంఘజీవన సంస్కృతిని చాటుతున్నాయి. ఒకతరం నుంచి మరోతరానికి సజీవమైన తెలుగు పదసంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుతల రామాయణం, హరికథ, యక్షగానాలు, ఒగ్గు కథలు, బుడిగ జంగాల శారద కథలు, బాలసంతుల పాటలు ఇంకా ఎన్నో విశిష్ట విలక్షణ కళారూపాల్లో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది. పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రే చరిత్రగా చలామణి అయింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయాయి. వేములవాడ భీమకవి, బమ్మెర పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల గురించిన చరిత్ర వక్రీకరణకు గురైంది. ఒకదశలో తెలంగాణలో కవులే లేరు అనే స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలు చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలోనే మ¬న్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్యశిఖరంగా వెలుగొందిన కవి, పండితుడు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో శ్రమకోర్చి, తెలంగాణ నాలుగు చెరగులా తిరిగి, 354 మంది కవుల రచనలతో ‘గోలకొండ కవుల సంచిక’ను వెలువరించారు. అది మన స్వాభిమాన ప్రతీక, సాహిత్య జయపతాక.
జలపాత సదృశమైన ధారతో, అద్భుతమైన ప్రౌఢిమతో అగ్నిధార, రుద్రవీణ వంటి పద్య కావ్యాలను సృజించిన మహాకవి దాశరథి ‘నా తెలంగాణ తల్లి కంజాత వల్లి’ అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించారు. ‘భూగర్భమున గనులు, పొంగిపారే నదులు నా తల్లి తెలంగాణరా! వెలలేని నందనోద్యానమ్మురా!’ అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల వెంకటరామారావు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు.
ప్రజాకవి కాళోజీ తన కవితలతో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పతనాన్ని ప్రకటిస్తూనే, తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించినవారికి దీటైన సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు తమపై అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు
ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైదుష్యా న్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉన్నది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృతనిశ్చయంతో కృషిచేస్తున్నది. తెలంగా ణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరుగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ అధ్యక్షుడిగా ప్రసిద్ధ కవి నందిని సిధారెడ్డిని నియమించి, సారథ్య బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్రంలో చదువుకొనే ప్రతి విద్యార్థి ప్రాథమికస్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు విధిగా తెలుగు భాషను అభ్యసించాలని ఇటీవలనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలలో పాల్గొనాలని రాష్ట్రంలోని తెలుగు భాషాభిమానులతోపాటు, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో స్థిరపడిన తెలుగు భాషా ప్రేమికులందరికీ సాదరంగా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నది. ఈ సభల సందర్భంగా నిర్వహించే సదస్సులు తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటిపైన ూలంకషంగా చర్చిస్తాయి. గత వైభవాన్ని ఘనంగా తలచుకుంటూనే వర్తమానాన్ని విశ్లేషిస్తాయి. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. కొత్త పరిశోధనలకు నాంది పలుకుతాయి. ఈ సభల్లో ఏర్పాటుచేసే కళాప్రదర్శనలు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని దర్శింపజేస్తాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్య రసహృద యులందరూ ఒకచోటకు చేరటంతో వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు నెలకొంటాయి. కొత్త తరానికి తెలంగాణ తెలుగు సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతోపాటు నూతన
ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తాయి.
సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, భాషా ప్రేమికులు గుండెల నిండుగా జరుపుకొనే ఈ తెలుగు పండుగలో అందరూ ఉత్సాహంతో పాల్గొని ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ మాస పత్రిక ఈ మహాసభలను పురస్కరించుకొని ప్రత్యేక సంచిక వెలువరించడం ఆనంద దాయకం, అభినందనీయం.
(కె. చంద్రశేఖరరావు)
ముఖ్యమంత్రి