మంగారి రాజేందర్
భారత రాజ్యాంగంలోని అధికరణ 39 డి ప్రకారం న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరిగేటట్లు చూడటానికి ప్రభుత్వం కృషి చేయాలి. న్యాయ సహాయం అందరికి అందుబాటులోకి రావాలి. ఆర్థిక దుస్థితి వల్లగానీ లేక వేరే ఇతర కారణాల వల్లగానీ న్యాయాన్ని పొందే అవకాశం కొందరికి లేకుండాపోయే పరిస్థితి ఉండకూడదు. ఈ పరిస్థితిని నివారించేందుకు అటువంటి వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించటానికి తగిన శాసనాలను, ఇతర పథకాలను ప్రభుత్వం రూపొందించాలి. అధికరణలు 14, 22(1) ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. అందరికీ సమాన అవకాశాలను కల్పించాలి. న్యాయ సహాయాన్ని కూడా అందించాలి. ప్రతి సంవత్సరం న్యాయ సేవ రోజుని జరపడం వల్ల ప్రజలకి న్యాయ సహాయం గురించి మరొక్కసారి తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
ప్రతి సంవత్సరం న్యాయ సహాయం గురించి సుప్రీంకోర్టు ఏదో ఒక తీర్పుని వెలువరిస్తూనే వుంది. ఇటీవలి కాలంలో వచ్చిన తీర్పు మూడు. అవి న్యాయవాది ఆర్.కె. ఆనంద్ కేసు. అజ్మిర్ కసబ్ కేసు. రాజా ఎలియాన్ రహశాంత్ కేసు. ఈ మూడు కేసుల్లో సుప్రీకోర్టు న్యాయసహాయం గురించి చర్చించిన ప్రధాన అంశాలని పరిశీలిద్దాం.
ఓ ప్రమాదం కేసులో సాక్షులని ప్రలోభపెట్టినాడన్న కారణంగా సీనియర్ న్యాయవాది ఆనంద్‌పై కోర్టు ధిక్కారణ కేసుని ఢల్లీ హైకోర్టు నమోదు చేసింది. అతను నాలుగు మాసాల పాటు ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీల్లేదని, ఢల్లీ హైకోర్టు అతనికి ఇచ్చిన సీనియర్ న్యాయవాది హోదాను రద్దు చేయాలని, అదే విధంగా అతను 2000 రూపాయల జరిమానాను చెల్లించాలని జిల్లాకోర్టు తన తీర్పులో పేర్కొంది.
హైకోర్టు అతనికి విధించిన శిక్ష తక్కువగా వుందని ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అప్పీల్ ని దాఖలు చేసింది. న్యాయవాది ఆనంద్‌కి విధించిన శిక్ష అతను చేసిన నేరానికి అనుగుణంగా లేదని సుప్రీం కోర్టు భావించి, శిక్ష పెంచే ముందు న్యాయవాది ఆనంద్‌కి నోటీసుని జారీ చేసింది. కేసు ఈ దశలో వుండగా న్యాయవాది ఆనంద్ సుప్రీంకోర్టు ముందు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసి, ఎలాంటి షరతులు లేకుండా తప్పును ఒప్పుకొని శిక్షను మాఫీ చేయమని కోరాడు. అంతేకాదు, కంప్యూటర్ కేంద్రాన్ని గానీ, లైబ్రరీని గానీ బార్ కౌన్సిల్ ఎక్కడైనా ఏర్పాటు చేయదలిస్తే దాని ఖర్చుకి గానూ 21 లక్షల రూపాయలని ఇస్తానని, సంవత్సర కాలం పాటు ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా న్యాయసేవలు అందిస్తానని, ఈ సంవత్సర కాలంలో వేరే ప్రాక్టీస్ చేయనని అతను తన ప్రమాణ పత్రంలో సుప్రీంకోర్టుకి విన్నవించాడు.
ఆనంద్ వయస్సు 69 సంవత్సరాలు. అతని భార్యకి మెదడుకి అయిన గాయం వల్ల 20 సంవత్సరాలుగా మంచం మీద వుండిపోయింది. ఈ కారణాలవల్ల, అతను ప్రమాణ పత్రంలో పేర్కొన్న కారణాల వల్ల సుప్రీంకోర్టు శిక్షను మాఫీ చేసింది. ఒక సంవత్సర కాలం పాటూ పేదలకి ఉచిత న్యాయ సహాయం అందించాలని ఆదేశించింది. ఢల్లీ న్యాయసేవల అధికార సంస్థ పంపిన కేసుని మాత్రమే అతను చేపట్టాలని, అతను చేసిన పురోగతిని సమీక్షించాలని కోర్టు ఢల్లీ న్యాయ సేవల అధికార సంస్థని ఆదేశించింది.
మిగిలిన రెండు కేసుల విషయానికి వస్తే మన రాజ్యాంగంలోని అధికరణ 21, 22(1) ప్రకారం తనకు ఇష్టమైన న్యాయవాదిని సంప్రదించుకోవడానికి, ఎంపిక చేసుకోవడానికి అధికారం ముద్దాయికి వుందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అజ్మల్ కసబ్‌కి సెషన్సుకోర్టు విధించిన మరణ శిక్షను సమర్థిస్తూ కోర్టు న్యాయసేవల అందుబాటు గురించి ఈ విధంగా తన తీర్పులో ప్రకటించింది.’’ నేరం చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పటి నుంచి అతనికి న్యాయవాది వున్నాడా లేదా అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ అతనికి న్యాయవాది అందుబాటులో లేనట్లైతే ప్రభుత్వ ఖర్చు మీద న్యాయవాదిని నియమించాల్సిన బాధ్యత మెజిస్ట్రేట్‌పై వుంటుంది.
కేసు విచారణకి ముందు కూడా ముద్దాయికి న్యాయవాది వున్నాడా లేదానన్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ న్యాయవాది అందుబాటులో లేకపోతే అతనికి ప్రభుత్వ ఖర్చు మీద న్యాయవాదిని నియమించాలి. ముద్దాయి తన కేసుని తానే వాదించుకుంటానని కోర్టులో స్పష్టంగా చెప్పినప్పుడు తప్ప ప్రతి సారీ అతనికి న్యాయవాదిని నియమించాల్సిన బాధ్యత కోర్టుపై వుంటుంది. అంతే కాదు, ఆ విషయం రికార్డుల్లో ప్రతిబింబించాలి. ఒకవేళ న్యాయవాది లేకుండా విచారణ జరిగి ముద్దాయికి శిక్షపడితే ఆ శిక్ష చెల్లకుండా పోతుందని కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పులో స్పష్టం చేసింది. ముద్దాయికి న్యాయవాదిని నియమించి న్యాయసహాయం అందించాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి మెజిస్ట్రేట్‌పై వుందని, ఈ బాధ్యత ప్రతి మేజిస్ట్రేట్ నమ్మకంతో నిర్వర్తించాలని కోర్టు స్పష్టం చేసింది.ఈ విషయంలో ఏ మెజిస్ట్రేట్ అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అతనిపై శాఖ పరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఈ తీర్పులో సూచించింది.
ఖత్రి (ఖత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, 1981 ఎఫ్‌సిసి (క్రిమినల్)228) సుఖ్‌దాస్ వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్, 1986 ఎస్.సి.సి. (క్రిమినల్) 10 కేసుల్లో ముద్దాయి న్యాయసహాయం కావాలని కోరకున్నా అతనికి న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత మేజిస్ట్రేట్ పై, కోర్టుపై వుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ న్యాయ సహాయం అందించడంలో కోర్టు కొన్ని మినహాయింపులని ఇచ్చింది.
‘‘ఆర్థిక నేరాలు, లైంగిక దోపిడి, పిల్లల దుర్వినియోగం లాంటి నేరాలు చేసిన వ్యక్తులకి న్యాయ సహాయం అందించాల్సిన అవసరం లేదు’’.
2012 సంవత్సరంలో రాజా వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (2012)8 ఎస్.సిసి. 553 కేసులో సుప్రీం కోర్టు ఈ మినహాయింపుని వ్యతిరేకించింది. ఆ విధంగా కొన్ని నేరాల్లో న్యాయసహాయం అందించాల్సిన అవసరం లేదని చెప్పడం సరైంది కాదని సుప్రీంకోర్టు ఈ కేసులో అభిప్రాయపడింది. నేరం నిరూపణ జరిగే వరకు ముద్దాయిని అమాయకుడిగానే పరిగణించాల్సి వుంటుంది. ఇది విశ్వజనీనంగా అమోదించిన సూత్రం. మన రాజ్యాంగం కూడా ఇదే విషయాన్ని ఆదేశిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆ విధంగా కొన్ని నేరాలకి మినహాయింపుని ఇచ్చి న్యాయసహాయం అందించకపోవడం సరైంది కాదని, సుప్రీంకోర్టు రాజూ కేసులో స్పష్టం చేసింది. మినహాయింపును ఆమోదిస్తే ఇంకా కొన్ని కేసులు ఇదే వరుసలో చేరే ప్రమాదం వుంది. దాని వల్ల రాజ్యాంగం అభయం ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛ హక్కుకి, జీవించే హక్కుకి భంగం వాటిల్లుతుంది.
మన రాజ్యాంగం ప్రకారం, న్యాయసేవాధిక చట్ట ప్రకారం కస్టడీలో వున్న వ్యక్తికి, కేసు విచారణని ఎదుర్కొంటున్న వ్యక్తికి న్యాయసహాయం అందించాల్సిన బాధ్యత కోర్టుపై వుంది. ముద్దాయిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పటి నుంచి అప్పీలు చివరిదశ దాకా అతనికి న్యాయ సహాయం అందే విధంగా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద వుంటుందని సుప్రీం కోర్టు రాజా కేసులో స్పష్టం చేసింది. అంతే కాదు కేసు తీవ్రతని బట్టి కాకుండా అన్ని కేసుల్లో ఈ న్యాయసహాయం అందించాలి.
ఈ తీర్పు ద్వారా రెండు విషయాలు స్పష్టమయ్యాయి. రాజ్యాంగంలోని అధికరణ 39ఎ, 21 ప్రకారం ఉచిత న్యాయ సేవలని అర్హులైన వ్యక్తులకి అందించాల్సిన బాధ్యత ‘రాజ్యం’పై వుంటుంది. అదే విధంగా ప్రతి ముద్దాయికి అతనిపై ఏ నేరారోపణ వున్నప్పటికీ అతనికి కేసు అన్ని దశల్లోనూ న్యాయ సహాయం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ‘రాజ్యంగం’పై వుంది. కోర్టు రాజ్యంగంలో భాగం కాబట్టి ప్రతి కోర్టుపై ఈ బాధ్యత వుంది. ఈ విషయాన్ని న్యాయమూర్తులందరూ గుర్తుంచుకోవాలి.
ముద్దాయిని అరెస్టు చేసి పోలీసు విచారిస్తున్న క్రమంలో కూడా ఈ న్యాయసహాయాన్ని అందించాలి. రాజ్యాంగంలోని అధికరణ 22(1) ప్రకారం ముద్దాయిని అరెస్టు చేసినప్పుడు అతనికి ఇష్టమైన న్యాయవాదిని సంప్రదించుకొని తన కేసుని వాదించుకునే అవకాశాన్ని పోలీసులు కల్పించాలి. తన అరెస్టు సక్రమమైందా కాదా చెప్పే అవకాశం ఇక్కడ కలుగుతుంది. డి.కె. బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇంటరాగేషన్ మొత్తం సమయానికి కాకపోయినా, ఇంటరాగేషన్ మధ్య మధ్యలో తన న్యాయవాదితో సంప్రదించుకునే అవకాశం ముద్దాయికి కల్పించాలి. అతనికి న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేకపోతే న్యాయసేవాధికార సంస్థని సంప్రదించి న్యాయవాదిని ముద్దాయికి అందుబాటులో వుంచాల్సిన బాధ్యత పోలీసులపై వుంటుంది. ఈ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలి.